Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్రం కాడి పారేసింది

-వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం
-పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్‌ ప్రకటన
-డీసీపీని సాకుగా చూపిన మంత్రి
-గతంలో సేకరణ ఎఫ్‌సీఐ చేతిలోనే
-నాడు డీసీపీని బలవంతంగా రుద్ది
-నేడు రాష్ట్రాలను బలిచేస్తూ…
-అయిపోయింది.. అసలు సంగతి తెలిసిపోయింది..


పార్లమెంటు సాక్షిగా విషయం విస్పష్టమైపోయింది.. యాసంగి వడ్లు కొనం.. వానకాలం వడ్లు కొంటం… ఉప్పుడు బియ్యం కొనం.. రా రైస్‌ కొంటాం.. తప్పక కొంటం.. ఎంత కొంటమో చెప్పలేం.. వరి వద్దనలేదు.. ఇతర పంటలు వేయాలన్నాం.. అంటూ పూటకో మాట.. నోటికో పాట పాడిన కేంద్ర ప్రభుత్వం తన అంతరంగం ఏమిటో బయటపెట్టింది. వడ్లు కొనడం తమ బాధ్యతే కాదని తేల్చి చెప్పేసింది. వడ్లు కొనాల్సింది రాష్ట్రమేనని తన బాధ్యతను మనమీదికి నూకిపారేసింది.

2015 వరకు వడ్ల సేకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదు. మోదీ సర్కారు వచ్చిన తర్వాత డీ సెంట్రలైజ్‌డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (డీసీపీ) అనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎఫ్‌సీఐ మీద నమ్మకం లేక, రాష్ర్టాలను బతిమిలాడి, వడ్ల సేకరణలో తమకు సహకరించాల్సిందిగా ఒప్పించింది. రైతుల కోసం తెలంగాణ అయిష్టంగానే డీసీపీ విధానంలో చేరింది. కేంద్రానికి సహకరించడానికి అంగీకరించింది.

ఒకప్పుడు ఉప్పుడు బియ్యాన్ని ప్రోత్సహించింది కేంద్రం.. ఇప్పుడు వద్దంటున్నది కేంద్రం.. తన కోసం డీసీపీ తెచ్చింది కేంద్రం. దాన్ని చూపి రాష్ట్రాలపైకి బాధ్యతను నెట్టేస్తున్నది కేంద్రం. ఇప్పుడు వడ్లు కొనడం మా బాధ్యత కాదు.. బియ్యం మాత్రమే తీసుకుంటాం.. అంటున్న కేంద్రం.. రేపు బియ్యమూ తీసుకోబోమంటే… అట్లా అది ప్లేటు ఫిరాయించదని గ్యారెంటీ ఏముంది? వడ్లను కొనడానికి, నిల్వ చేయడానికి నాడూ.. నేడూ ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సౌకర్యాలు లేవన్నది వాస్తవం. ఆది నుంచీ వడ్ల కొనుగోలు కేంద్రం చేతుల్లోనే ఉందన్నదీ నిజం..

తెలంగాణ రైతన్నా.. చూస్తున్నవా..!
-అయినా, కొనాలనే మనసుండాలే గానీ,
-వడ్లు వేరు.. బియ్యం వేరా!
-వడ్లు లేనిది బియ్యం ఎక్కడి నుంచి వస్తయి?
-కేంద్రాన్ని నమ్ముకొని, రాష్ట్ర బీజేపీ నేతల
-మాటలు విని వరి వేస్తే ఏం జరుగుతుందో..
-..మరి జర పైలం!

‘ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ రాజ్య్‌ సర్కార్‌ కర్‌తీ హై.. కేంద్‌ సర్కార్‌ నహీ కర్తీహై’ ఇది బుధవారం లోక్‌సభలో కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ విస్పష్టంగా చేసిన ప్రకటన. దీని సారాంశం ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వాలే చేపడతాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. డీసెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (డీసీపీ) స్కీంలో ఉన్నారు కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనట. పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటినుంచీ టీఆర్‌ఎస్‌ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే కేంద్రం పూటకోమాటతో బొంకుతూ వచ్చింది. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించటంతో కేంద్రం తన ముసుగును పూర్తిగా తొలిగించింది. మొన్నటిదాకా బాయిల్డ్‌రైస్‌ వద్దని మొండికేసి.. నేడు ఏకంగా ధాన్యం సేకరణతో తమకు సంబంధమే లేదని చేతులెత్తేసింది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు బాధ్యత మొదటి నుంచీ కేంద్రానిదే. మోదీ సర్కారు వచ్చిన తర్వాతే ఆ బాధ్యత నుంచి తప్పించుకొని డీసీపీ విధానాన్ని అమలుచేసి రాష్ర్టాలపై రుద్దింది.

ఏమిటీ డీసీపీ స్కీం?
2015కు ముందు ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోలుతో రాష్ర్టాలకు ఎలాంటి సంబంధం ఉండేదికాదు. మిల్లర్లతో సమన్వయం చేసుకొని ఎఫ్‌సీఐ బియ్యం కొనుగోలు చేసేది. మిల్లర్లు నేరుగా రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరించేవారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించి తిరిగి డబ్బులు తీసుకొనేవారు. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి రాగానే డీసెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ స్కీం (డీసీపీ) పేరుతో ఓ పథకాన్ని తెచ్చింది. ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పుకొని ఆ బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించడమే ఈ స్కీం ప్రధాన ఉద్దేశం. 2014లో ఈ విధానాన్ని తీసుకురాగా, 2015 అక్టోబర్‌ నుంచి తెలంగాణలో అమలుచేసింది. దీనినని రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించినా కేంద్రం బలవంతంగా రుద్దింది. డీసీపీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లర్లకు ఇచ్చి, వచ్చే బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నది. ఈ వ్యవహారంలో ఇబ్బందులన్నీ రాష్ట్రమే భరిస్తున్నది. ప్రతి సీజన్‌లో రూ.2-3 వేల కోట్ల భారాన్ని మోస్తున్నది.

నిన్న బాయిల్డ్‌ వద్దన్నరు..నేడు ధాన్యమే వద్దంటున్నరు
నిన్నమొన్నటి వరకు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాయిల్డ్‌ రైస్‌ సేకరించేదిలేదని మొండికేసిన కేంద్రం, ఇప్పుడు ధాన్యం కూడా సేకరించబోమని ప్రకటించింది. కేంద్రం ప్రకటన వెనుక రైతులను నిండా ముంచే ప్రణాళిక ఉన్నదని వ్యవసాయార్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రా రైస్‌ తీసుకొంటామని చెప్తున్నా, ఎంత తీసుకుంటరో చెప్పకపోవటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ముందుముందు బియ్యం కూడా తీసుకోబోమని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఈ వ్యవహారమంతా పేదలకు చౌకధరలకు అందుతున్న నిత్యావసరాలను పూర్తిగా బంద్‌పెట్టే కుట్రలో భాగం కావచ్చని అనుమానిస్తున్నారు.

బియ్యం సేకరణలో ఏమైందా స్పీడ్‌?
‘రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా బియ్యం ఇస్తే అంత వేగంగా తీసుకొంటాం’ అని పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎఫ్‌సీఐలో వేగం కాదుకదా.. అసలు కదలికే కనిపిస్తలేదు. తమ గోదాముల్లో ఖాళీ లేదని, బియ్యం తీసుకోలేమని ఎఫ్‌సీఐ చెప్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ గోదాముల ముందు బియ్యం లారీలు వారాలతరబడి నిలిచి ఉంటున్నాయి. బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ గోదాముల్లో స్థలం లేక ఎఫ్‌సీఐ తీసుకోవటంలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వడంలేదని బద్నాం చేస్తున్నారు.

ధాన్యం కొని రాష్ట్రం ఏం చేసుకుంటది?
వ్యవసాయోత్పత్తులను విదేశాలకు ఎగుమతిచేయాలన్నా, వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాలన్న సంపూర్ణ అధికారం కేంద్రానిదే. పంటలు అధికంగా పండినప్పుడు మన అవసరాలకు సరిపడా నిల్వ ఉంచి మిగులు ఎగుమతికి కేంద్రం అనుమతి ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం అవసరానికి మించి మూడునాలుగింతలు దిగుబడి వచ్చింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం కొని ఏం చేసుకొంటుందనేది అసలు ప్రశ్న. ఎగుమతిచేసే అధికారం రాష్ర్టాలకు లేదు. అసలు కొనకుండా వదిలేస్తే అధిక దిగుబడి ఉన్నది కాబట్టి ప్రైవేటు వర్తకులు అడ్డికి పావుశేరు కాడికి రైతుల నుంచి తీసుకొంటారు. అప్పుడు కనీస మద్దతు ధర కాదుకదా.. పెట్టుబడి కూడా రైతుకు రాదు. రైతులను ఆదుకొనేందుకు భారమైనా భరిస్తూ రాష్ట్రప్రభుత్వం కొనాలంటే ధాన్యం, బియ్యాన్ని నిల్వ చేసుకొనేందుకు గోదాముల సౌకర్యం ఉండదు. ఇదంతా చూస్తుంటే ‘రైతులను మేం గాలికి వదిలేశాం.. మీరు కూడా వదిలేయండి’ అని రాష్ర్టాలకు కేంద్రం సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉన్నదని రైతుసంఘాలు మండిపడుతున్నాయి.

అప్పుడు బతిమాలి.. ఇప్పుడు బలి
డీసీపీ విధానంలోకి వచ్చేందుకు రాష్ర్టాలు మొదట నిరాకరించడంతో కేంద్రం బతిమాలి, బుజ్జగించి తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఎఫ్‌సీఐకి అవసరమైన సిబ్బంది లేకపోవడం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టంగా మారడంతో ‘మేం మీకే డబ్బులిస్తాం.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుంచి ధాన్యం సేకరించి మాకు బియ్యం ఇవ్వండి’ అని కోరింది. పాత కొనుగోలు విధానంతో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, రైతులకు మేలుచేసేందుకు ఈ విధానంలో చేరింది. ఇప్పుడు కేంద్రం మొత్తానికే ప్లేట్‌ ఫిరాయించి డీసీపీలో చేరారు కాబట్టి ధాన్యం కొనుగోలు బాధ్యత మీదేనని దబాయిస్తున్నది.

బాయిల్డ్‌ బియ్యం అడిగింది కేంద్రమే
ఇప్పుడు బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెప్తున్న కేంద్రప్రభుత్వం.. గతంలో ఈ బాయిల్డ్‌ బియ్యం కోసమే పట్టుబట్టింది. రా రైస్‌ ఇస్తే తీసుకొనేదికాదు. బాయిల్డ్‌ మిల్లులను ప్రోత్సహించటంతో మన రాష్ట్రంలో బాయిల్డ్‌ మిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కో మిల్లర్‌ రూ.5-10 కోట్లు పెట్టి మిల్లులను నెలకొల్పారు. తీరా మూడునాలుగేండ్లలోనే కేంద్రం ప్లేట్‌ ఫిరాయించింది. ఇప్పుడు రా రైస్‌ మాత్రమే తీసుకుంటాం.. బాయిల్డ్‌ రైస్‌ వద్దంటున్నది. కేంద్రం మాట విని కోట్లు పెట్టుబడి పెట్టి ప్రారంభించిన మిల్లులను ఇప్పుడేం చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బాయిల్డ్‌ మిల్లులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ రాజ్య్‌ సర్కార్‌ కర్తీ హై.. కేంద్‌ సర్కార్‌ నహీ కర్తీ!
ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేయదు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తది.. తెలంగాణ డీసీపీలో ఉన్నది కనుక వడ్లు సేకరించాల్సిన బాధ్యత మాది కాదు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే..
రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్పీడ్‌గా బియ్యం ఇస్తే.. ఎఫ్‌సీఐ అంత స్పీడ్‌గా తీసుకుంటుంది..

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
-రాష్ట్రం ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ
-ఎంత స్పీడ్‌గా తీసుకుంటున్నదో.. గోదాముల ముందు వారాల తరబడి బారులు తీరిన లారీలే నిదర్శనం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.