-త్వరలోనే పోలవరం ఆర్డినెన్స్‌పై అఖిలపక్షంతో ఢిల్లీకి – ఏ సమాచారం కావాలన్నా ప్రభుత్వ ప్రతినిధులను అడగండి -టీఆర్ఎస్ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచన -పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు ఎంపీల పేర్లు ఖరారు

తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు దృష్టి సారించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గురువారం సీఎం కేసీఆర్ తన నివాసంలో పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, సుమన్, నగేష్, వినోద్, విశ్వేశ్వర్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలు చేశారు. కేంద్రం నుంచి నిధులు అధికంగా తెచ్చుకునేందుకు ఎంపీలు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వేణుగోపాలచారి, రామచంద్రుడును నియమించామని, ఏ అధికారిక సమాచారం కావాల్సి వచ్చినా వారు ప్రభుత్వం నుండి తెప్పించి ఇస్తారని, దానికనుగుణంగా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు తేవాలని కేసీఆర్ వారికి మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షంతో వస్తానని, ఆ సమయంలో ఎంపీలంతా అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పారు. ఈ నెల 24, 25 తేదీల్లో అఖిలపక్షం ఢిల్లీ పర్యటనపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, తేదీ ఖరారైన వెంటనే సమాచారం ఇస్తామని ఎంపీలకు తెలిపారు.
స్టాండింగ్ కమిటీల సభ్యులు వీరే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు టీఆర్ఎస్ ఎంపీలను ఖరారు చేశారు. ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పార్టీకి 10మంది ఎంపీలున్నారు. వీరిలో మహబూబ్‌నగర్ నుండి గెలిచిన ఏపీ జితేందర్‌రెడ్డిని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేతగా నియమించారు. మిగిలిన తొమ్మిది మంది పేర్లు వివిధ స్టాండింగ్ కమిటీలకు ఖరారు చేశారు.
నాయిని, రాముల్నాయక్కు ఎమ్మెల్సీ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. టీఆర్ఎస్ తరఫున హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములునాయక్ పేర్లను ఎమెల్సీ పదవికి క్యాబినెట్ సిఫారసు చేసింది. వీరి పేర్లకు ఆమోదం తెలిపిన గవర్నర్.. ఈ మేరకు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిసింది. నాయిని నర్సింహారెడ్డి, రాములునాయక్ సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తులుగా కొనసాగుతున్నారు. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉంటూ.. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు.
హోం శాఖ -వినోద్ వాణిజ్యం – కల్వకుంట్ల కవిత పరిశ్రమలు – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కార్మిక- డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వ్యవసాయం – కడియం శ్రీహరి రూరల్ డెవలప్మెంట్ – సుమన్ జలవనరులు – బీబీ పాటిల్ బొగ్గు మరియు ఇనుము – నగేష్ సామాజికన్యాయం, సాధికారిత – సీతారాంనాయక్