-జీఎస్టీ హామీల అమలు బాధ్యత కేంద్రానిదే -జీఎస్టీ పరిహారం 10 శాతానికి తగ్గించడం చట్ట విరుద్ధం -1.35 లక్షల కోట్లు ఎగ్గొట్టే అధికారం ఎవరిచ్చారు? -రాష్ర్టాలపై రుణభారం మోపడం సమంజసం కాదు -కేంద్రమే అప్పు తీసుకొని పూర్తి పరిహారం చెల్లించాలి -నష్టమైనా దేశ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీకి మద్దతిచ్చాం -గతంలో సీఎస్టీపై రాష్ర్టాలను యూపీఏ మోసం చేసింది -ఎఫ్డీ విధానం సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం -మీ నిర్ణయాన్ని మార్చుకోండి.. రాష్ర్టాలను ఆదుకోండి -ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లేఖ -ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కావడంతోపాటు దేశం మరింత పటిష్ఠం అవుతుంది.

దేశంలోని ఏ రాష్ట్రం.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటివరకు అన్ని నిర్ణయాలను రాష్ర్టాల అంగీకారంతో ఏకగ్రీవంగా తీసుకున్నది. ఇకపైనా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం.
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ర్టాలకు ఇవ్వాలని సూచించారు. పరిహారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. జీఎస్టీలో చేరితే రాష్ట్రం నష్టపోతుందని తెలిసినా.. దేశ ప్రయోజనాలు ఆశించి కేంద్రానికి మద్దతు తెలిపామని కేసీఆర్ గుర్తుచేశారు. నష్టపోయే ప్రతిపైసా ఇస్తామని నాడు చెప్పి.. నేడు రుణాలు తీసుకోమనటం సమంజసం కాదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించొద్దని హితవు పలికారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంతోపాటు దేశం మరింత పటిష్ఠం అవుతుందని సీఎం పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ర్టాలే.. దేశాన్ని మరింత పటిష్ఠం చేస్తాయని సీఎం స్పష్టంచేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటివరకు అన్ని నిర్ణయాలను రాష్ర్టాల అంగీకారంతో ఏకగ్రీవంగా తీసుకున్నదని, ఇకపైనా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు.ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ పూర్తిపాఠం..
దేశ ప్రయోజనాల దృష్ట్యా మద్దతిచ్చాం రాష్ర్టాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం అసంతృప్తి కలిగించింది. జీఎస్టీ వల్ల రాష్ర్టానికి ఆదాయం తగ్గుతుందని తెలిసినా.. దేశ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పూర్తి మద్దతు తెలిపింది. జీఎస్టీ వల్ల స్వల్పకాలికంగా నష్టం కలిగినా, దీర్ఘకాలికంగా పెట్టుబడులను ఆకర్షించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని మేము భావించాం.
యూపీఏ మోసం చేసింది.. మీరూ అదే బాటలో యూపీఏ ప్రభుత్వం ‘సెంట్రల్ సేల్స్ ట్యాక్స్’ (సీఎస్టీ) ప్రవేశపెట్టే సమయంలో రాష్ర్టాలు నష్టపోయే ప్రతి రూపాయిని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత మొండిచేయి చూపింది. తెలంగాణకు చెల్లించాల్సిన సుమారు రూ.3,800 కోట్ల పరిహారాన్ని ఎగ్గొట్టింది. ఈ చేదు అనుభవం దృష్ట్యా జీఎస్టీ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచారు. జీఎస్టీ అమలుతో రాష్ర్టాలు కోల్పోయే ఆదాయాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి చెల్లించాలని అందులో స్పష్టంగా ఉన్నది. అయినా కేంద్రం సమయానికి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
రాబడి తగ్గింది.. ఖర్చులు పెరిగాయి లాక్‌డౌన్‌తో ఓవైపు రాష్ర్టాల ఆదాయం పడిపోగా, మరోవైపు ఖర్చులు, చెల్లింపులు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ రెవెన్యూ ఆదాయం 83% పడిపోయింది. అదేసమయంలో కరోనా నియంత్రణ చర్యలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అతికష్టం మీద మార్కెట్ నుంచి అప్పులు, అడ్వాన్సులు, ఓడీఎఫ్‌లు తదితర మార్గాల్లో నిధులు తెచ్చి సర్దుబాటు చేసుకున్నాం. విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉండటం వల్ల రాష్ర్టాలు మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవాలన్నా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎఫ్డీ కేంద్రానికి 3.5% ఉంటే రాష్ర్టాలకు 3% మాత్రమే ఉన్నది. ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం.
వడ్డీలపై ఎలాంటి ప్రభావం పడదు కేంద్రం అప్పు తీసుకోవడం వల్ల ప్రభుత్వ బాండ్లు, మార్కెట్లో ఇతర రుణాలపై వడ్డీ భారం పెరుగుతుందని, కాబట్టి రాష్ర్టాలే అప్పులు తీసుకోవాలని చెప్పడం సమంజసంగా లేదు. ఒకే ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారుల సమూహం నుంచి కేంద్రం లేదా రాష్ట్రంలో ఎవరు అప్పు తీసుకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. పైగా కేంద్ర ప్రభుత్వానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కేంద్రమే రుణాలు తీసుకొని, రాష్ర్టాలకు పూర్తి పరిహారం చెల్లించాలి.
కేంద్రానికి అవకాశాలు ఎక్కువ జీఎస్టీ వల్ల రాష్ర్టాలు సగటున 47% రెవెన్యూ ఆదాయం కోల్పోతే కేంద్రం కేవలం 31% నష్టపోయింది. జీఎస్టీతో రాష్ర్టాలకు సొంతగా నిధులు సమకూర్చుకునే ప్రధాన ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ కేంద్రానికి ఆదాయం పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి డివిడెండ్లు తదితర రూపాల్లో అదనపు ఆదాయం వస్తున్నది. కాబట్టి రాష్ర్టాలను ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వంటి విపత్కర సమయంలో కేంద్రం రాష్ర్టాలకు ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిందిపోయి హక్కులను కూడా హరిస్తున్నది. పరిహారం సెస్సు లోటును పూడ్చుకొనేందుకు రాష్ర్టాలు అప్పులు తీసుకోవడం గురించి చట్టంలో ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ర్టాల రుణాలను ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ కిందికి చేర్చడం మరింత నష్టం కలిగిస్తుంది.
చమురుపై అదనపు పన్నుతో రూ.2 లక్షల కోట్లు జీఎస్టీ అమలుచేస్తే కేంద్రం విధించే సర్‌చార్జీలు, ఇతర పన్నుల్లో తమకు కూడా వాటా వస్తుందని రాష్ర్టాలు భావించాయి. అయితే అవన్నీ భ్రమలని తేలిపోయింది. కేంద్రం ఇటీవలే దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.13 అదనపు పన్ను విధించింది. చమురు ద్వారానే కేంద్రానికి ఏటా రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. రాష్ర్టాలు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ విధించే అవకాశం లేకుండా చేసింది. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ర్టాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం కన్నా ఎక్కువగా రాష్ర్టాలకే వనరుల అవసరం ఉన్నది.
10 శాతానికి ఎలా తగ్గిస్తారు? 14% వృద్ధి రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నది. కానీ కేంద్రం 2020-21 సంవత్సరానికి సంబంధించి 10 శాతానికే లెక్కించాలని నిర్ణయించడం గర్హనీయం. దీంతో కరోనా వల్ల రాష్ర్టాలు కోల్పోయే ఆదాయానికి.. జీఎస్టీ పరిహారానికి మధ్య అగాథం ఏర్పడింది. కేంద్రం ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని చట్టం అంగీకరించదు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరుతున్నాం. కేంద్రమే అప్పులు తీసుకొని రాష్ర్టాలకు పూర్తి పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలోనూ జీఎస్టీ పరిహార నిధి నుంచి రాష్ర్టాలకు పంచగా మిగిలిన సొమ్మును కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమచేసుకొన్నది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో మిగిలిన సొమ్మును వాడుకొని, ఇప్పుడు కష్టకాలంలో ఆదుకొమ్మంటే అప్పు తీసుకోమని చెప్పడం సమంజసం కాదు.
అప్పుల సూచన వాపస్ తీసుకోవాలి రాష్ర్టాలే అప్పు తీసుకోవాలన్న సూచనను కేంద్రం కచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. దీనికి బదులు కేంద్రమే మొత్తం సొమ్మును అప్పుగా తీసుకొని, రాష్ర్టాలకు పంచాలి. అసలు, వడ్డీని వసూలయ్యే సెస్సు సొమ్ము నుంచి చెల్లించాలి. తిరిగి చెల్లించే గడువును 2022గానే ఉంచాలా? పొడిగించాలా? అన్నది జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. తన సూచనలను ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకుంటారని, రాష్ర్టాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.