Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

-ఎన్నికలప్పుడే మోదీకి మసీద్, మందిర్ గుర్తొస్తయా?
-ఈ ఎన్నికలతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే
-నగరంలో అర్హులైన పేదలకు త్వరలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు
-పదికోట్ల మందికి ఉద్యోగాలు ఎప్పుడిస్తావు మోదీ?
-పేదల ఖాతాల్లో రూ.15లక్షలు ఎప్పుడు వేస్తావు?
-బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కనీయొద్దు
-16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలుచుకొని ఢిల్లీని శాసిద్దాం
-మెట్రోరైలును 200 కిలోమీటర్ల మేర విస్తరిస్తాం
-మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్‌షో
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. మన పదహారుమంది ఎంపీలతోపాటు కాంగ్రెస్, బీజేపీలతో కలిసేందుకు అయిష్టంగా ఉన్న ప్రాంతీయపార్టీలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకాబోతున్నదన్నారు. దేశాన్ని 71ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ, జనతాపార్టీలు ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోయాయని విమర్శించారు. ఫలితంగా దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ పార్టీలమంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇన్నాళ్లు ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అబ్ హోగా న్యాయ్.. అంటూ ఈ మధ్య కాంగ్రెస్ కొత్త నినాదం ఎత్తుకున్నదన్న కేటీఆర్.. మరి ఇన్నాళ్లు అన్యాయం చేసినవాళ్లు ఎవరు? అని సూటిగా ప్రశ్నించారు. సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్, శోభనాసెంటర్, జగద్గిరిగుట్టలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోల్లో కేటీఆర్ మాట్లాడారు.

దేశాన్ని ఎవరు సమర్ధంగా నడుపుతారు? రాష్ర్టానికి హక్కులు, ప్రాజెక్టులకు నిధులు ఎట్ల వస్తాయో ఆలోచించి ప్రజలు ఓటువేయాలని కోరారు. మన శక్తిని మనం పోగుచేసుకుని 16మంది ఎంపీలను ఢిల్లీకి పంపితే కేంద్రం మెడలు వంచి నిధులు తరలించుకొస్తారన్నారు. దేశానికి కావాల్సింది మోదీలాంటి చౌకీదార్, రాహుల్‌లాంటి టేకేదార్‌కాదని, ఒక దమ్‌దార్, ఒక ఇమాన్‌దార్, ఒక జోర్దార్, ఒక వఫాదార్, ఒక హస్సర్‌దార్, ఒక దిల్‌దార్ మొత్తంగా జిమ్మేదార్‌లాంటి కేసీఆర్ కావాలన్నారు. 400 పైచిలుకు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్ అని, అదే పదహారుమంది ఎంపీలతో ఏం చేస్తాడో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు.

ఎన్నికలప్పుడే మసీద్, మందిర్ గుర్తొస్తాయా మోదీ?
ప్రధానమంత్రికి ఎన్నికలప్పుడే మసీద్, మందిర్ గుర్తుకువస్తాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హిందూ- ముస్లిం, ఇండియా- పాకిస్థాన్ అంటూ ప్రజల భావోద్వేగాలతో రాజకీయంచేయడం మానుకోవాలని హితవుపలికారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టి ప్రయోజనం పొందేందుకు బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు తిప్పికొట్టటం ఖాయమన్నారు. ఏ ఒక్క పని చేయని ఎన్డీయే ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు. మోకా చూసి దెబ్బ కొట్టాలె. ఇప్పుడు మీ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశమొచ్చింది అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎల్బీస్టేడియానికి వచ్చిన నరేంద్రమోదీ ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చెప్పకుండా.. మళ్లీ ఏం చేస్తారో చెప్పకుండా కేవలం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలుచేశారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఏమీ చేయనోడు మళ్లీ అధికారం ఇస్తే చేస్తానంటే నమ్ముదామా? మరోసారి మోసపోదామా? అని ప్రజలను ప్రశ్నించారు. మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే గల్లీలో ప్రజల సేవకుడిగా.. ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పనిచేస్తాడని చెప్పారు.

ఉద్యోగాలెప్పుడు ఇస్తావు.. రూ.15లక్షలు ఎప్పుడు వేస్తావు..?
అధికారంలోకి వస్తే ఐదేండ్లలో పదికోట్ల మందికి ఉద్యోగాలిస్తానని హామీలిచ్చిన మోదీ ఆ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఈ దేశ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌చేశారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తెచ్చి ప్రతీ పేదవారి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్పిన మోదీ ఇప్పటివరకు ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేశారని నిలదీశారు. బ్లాక్‌మనీ పేరుతో పెద్దనోట్లు రద్దుచేసి, మహిళలు కుటుంబ అవసరాలకు దాచుకున్న సొమ్మును సైతం మోదీ దోచుకెళ్లాడని విమర్శించారు. ముంబై మెట్రోరైలుకు రూ.18 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోరైలుకు మొండిచేయి ఇచ్చిందని విమర్శించారు. మెట్రోరైలు ప్రస్తుతానికి 56 కిలోమీటర్లు ప్రారంభించామని, భవిష్యత్తులో 200 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వాలె
ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ కారు గుర్తుపై గుద్దుడు గుద్దుతుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వాలని కేటీఆర్ అన్నారు. మూడునెలల క్రితం ప్రజలు తిరస్కరించిన బీజేపీ, కాంగ్రెస్‌లు చింతచచ్చినా పులుపుచావదు అన్నట్టు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాయని ఎద్దేవాచేశారు. హైదరాబాద్ నగరంలో, నగర శివార్లలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని, రాబోయే 6-9 నెలల్లో అర్హులందరికీ వాటిని అందిస్తామని చెప్పారు. అండర్ గ్రౌండ్‌డ్రైనేజీ నిర్మాణం, ప్రజల కనీస అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ఈ రోడ్డుషోలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్‌రావు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌నుద్దేశించి కేటీఆర్ చెప్పిన పిట్టకథ
ఎన్కటికి జగద్గిరిగుట్టలాంటి ప్రాంతంలో ఓ పిల్లవాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే వ్యసనాలకు అలవాటు పడిన ఆ పిల్లాడు.. పెరిగి పెద్దయ్యాడు కానీ తాగుడు మానలేదట. ఒకరోజు తాగిన మైకంలో ఇంటికి వచ్చి.. నాయిన జేబులో డబ్బులు తీయబోయాడట. అదిచూసిన తల్లి.. నాన్న జేబుల్లోంచి డబ్బులు తీస్తావా! అంటూ చెంపపై కొట్టిందట. తాగిన మైకంలో పక్కనే రోకలిబండతో తల్లిని కొట్టిండట. ఆమె అక్కడే చనిపోయిందట. ఇది చూసి వచ్చిన తండ్రిని కూడా కొట్టడంతో అతను కూడా అక్కడే చనిపోయాడట. పోలీసులు అతడిని జడ్జి ముంగిట నిలబెడితే.. ఎంతోమంది దుర్మార్గులను చూసిన కానీ తల్లిదండ్రులను కొట్టి చంపిన నీ అంతటి నేరస్థుడిని చూడలేదు.. నీకు ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అని మేజిస్ట్రేట్ అన్నాడట. దీంతో అప్పటివరకు భయంగా ఉన్న ఆ తాగుబోతు యువకుడు నేను తల్లి తండ్రి లేని అనాథను సర్.. నన్ను వదిలేయండి అన్నాడట! ఈ దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉన్నది. ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్.. ఇక నుంచి న్యాయం జరుగుతుంది అన్ని చెప్పడమేంటి?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.