Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్రాన్ని నిలదీస్తాం

పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజన కోసం కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. నిరసన రూపాన్ని నేడు ఖరారు చేయనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సుమారు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి హైకోర్టు విభజనతో పాటు పలు అంశాలపై లోతైన చర్చ జరిగింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్రమే చొరవ తీసుకోవాలన్న డిమాండ్‌ను పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా వినిపించాలని నిర్ణయించారు.

KCR-with-TRS-MP's

-హైకోర్టు విభజనే ఎజెండా -నిరసన రూపం నేడు ఖరారు -మిషన్ కాకతీయ, భగీరథకు కేంద్ర నిధుల సాధనకు ఒత్తిడి -పెండింగ్ అంశాలపై పార్లమెంటులో పోరాటం -టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయం -పార్లమెంటు సమావేశాలకు పార్టీ వైఖరిని నిర్దేశించిన సీఎం కేసీఆర్ -హైకోర్టు అంశం కేంద్ర పరిధిలోనే ఉంది: ఎంపీ జితేందర్‌రెడ్డి -జీఎస్టీకి సంపూర్ణ మద్దతిస్తాం: ఎంపీ వినోద్

రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని నిర్ణయించారు. అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఎయిమ్స్ సాధన, షెడ్యూల్ 9,10 సంస్థల విభజన, వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధుల విడుదల తదితర అంశాలను సభలో లేవనెత్తాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకువస్తున్న జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. జాతి ప్రయోజనాల విషయంలో కేంద్రానికి మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. అమెరికాలో ఉన్న వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మినహా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.

TRS-MP's

హైకోర్టు కోసం ఒత్తిడి తెస్తాం..: ఎంపీ జితేందర్‌రెడ్డి సమావేశం వివరాలను ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. అయితే నిరసన రూపాన్ని మాత్రం సోమవారం నిర్ణయించుకుంటామన్నారు. గతంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాలు ఏర్పడిన పదిహేను రోజుల వ్యవధిలోనే హైకోర్టులు ఏర్పాటయ్యాయని, తెలంగాణ విషయంలో మాత్రం రెండేండ్లు దాటినా కేంద్రం తగిన చొరవ చూపడం లేదన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రపతి నోటిఫై చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చన్న అంశం స్పష్టంగా ఉందని, అది కేంద్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. అయినా ఇది కేంద్రం పరిధిలో లేని అంశమంటూ కొంతమంది కేంద్ర మంత్రులు తప్పించుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే విధంగా టీఆర్‌ఎస్ నిరసనలు, ఆందోళనలు ఉంటాయని వివరించారు.

గత రెండేండ్లలో జరిగిన ఎనిమిది పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయమై ప్రతిసారీ ప్రస్తావన తెచ్చామన్నారు. ఇంతవరకు పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగానే నిరసన తెలియజేశాం తప్ప సమావేశాలను స్తంభింపజేసే విధంగా నడుచుకోలేదన్నారు. గత శీతాకాల సమావేశాల్లో ప్లకార్డులు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం దాక దాదాపు పది రోజులపాటు నిల్చుని కూడా నిరసన తెలియజేశామన్నారు. ఈసారి సమావేశాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంటు వేదికగానే స్పష్టమైన హామీ ఇచ్చినా ఇప్పటివరకూ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆందోళన చేసి విధులను బహిష్కరించిన తర్వాత కేంద్ర న్యాయమంత్రిని సంప్రదిస్తే ఉమ్మడి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని బదులిచ్చారన్నారు.

జీఎస్టీకి మద్దతు ఇస్తాం: ఎంపీ వినోద్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే జీఎస్టీ బిల్లు దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఊతమిచ్చేది కాబట్టి టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. అంశాలవారీగా కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని, అదే సమయంలో రాష్ట్ర అంశాలకు సంబంధించి మాత్రం స్పష్టమైన డిమాండ్లు తెస్తామని తెలిపారు. హైకోర్టు విభజన అంశం మీద పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై వత్తిడి తీసుకురావాలన్న నిర్ణయం జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులోనే సమావేశమవుతారని, ఆ సందర్భంగా హైకోర్టు విభజన అంశంతో పాటు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై లోతుగా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని తెలిపారు.

మా సహనాన్ని పరీక్షించవద్దు : అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి తెలంగాణ ఏర్పడి రెండేండ్లు పూర్తయినా హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ ఉందని, గతంలో ఏర్పడిన కొత్త రాష్ర్టాలకు లేని ఈ సమస్య ఒక్క తెలంగాణకు మాత్రమే ఎందుకు ఉండాలని అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఈ అంశంపై పార్లమెంటులో ప్రస్తావించి నిరసన తెలిపామే తప్ప సభా కార్యక్రమాలను అడ్డుకోలేదని, తమ సహనాన్ని పరీక్షించే విధంగా కేంద్రం వ్యవహరించరాదని స్పష్టం చేశారు. సభా కార్యకలాపాలను స్తంభింపజేసేంత వరకు సమస్యను తీసుకెళ్ళకుండా కేంద్రం తగిన తీరులో స్పందిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే సహకారాన్ని బట్టి టీఆర్‌ఎస్ వైఖరి ఉంటుందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌కు స్పష్టం చేశారు.

ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో కూడా జితేందర్‌రెడ్డి ఈ విషయం ప్రస్తావించారు. సభా కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, హైకోర్టు విభజన విషయంలో కేంద్రం వ్యవహరించే విధానానికి అనుగుణంగా తమ పార్టీ నిరసనలు ఉంటాయని లోక్‌సభ స్పీకర్‌కు స్పష్టం చేసినట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్ రెండేండ్ల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని, ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఇతర రాష్ర్టాలు కీర్తిస్తూ ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. అసెంబ్లీలో తమ సంఖ్యా బలం 63 నుంచి 91కు పెరిగిందని, లోక్‌సభలో 11 నుంచి 14కు పెరిగిందని, దీనికి కారణం సీఎం కేసీఆర్ సంక్షేమ రంగంలోనూ, అభివృద్ధి రంగంలోనూ చేపట్టిన పథకాలు ఇస్తున్న ఫలితాలు, ఇతర పార్టీలన్నీ టీఆర్‌ఎస్‌వైపు చూడడమేనని స్పీకర్‌కు వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.