విభజన హామీలు ఒక్కటీ నెరవేరలేదు జీఎస్టీ బకాయిలు సహా అన్ని అంశాలపై ఒత్తిడి తెండి సాగునీటిరంగ విజయాలను ప్రస్తావించండి పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మున్సిపల్‌ఎన్నికల్లో సామాజిక న్యాయంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు

రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజనచట్టంలోని హామీలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నిర్ణయించింది. తెలంగాణకు దక్కాల్సిన నిధులు, దీర్ఘకాల డిమాండ్లు, ప్రాజెక్టుల కేటాయింపులకు సంబంధించి ఒత్తిడి పెంచాలని తీర్మానించింది. మంగళవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై పోరాడాలని నిర్ణయించారు. జీఎస్టీ బకాయిలు, విభజన హామీల అమలు, రైల్వే, రహదారులు, రిజర్వేషన్ల బిల్లులు సహా పలు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని నిశ్చయించారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావుతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని సూచించారు. వివిధ పథకాలకు ఆర్థికసహాయం చేయాలని నీతిఆయోగ్ ప్రతిపాదించినప్పటికీ, రాష్ర్టానికి ఇప్పటిదాకా కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాని విషయాన్ని ప్రస్తావించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల స్ఫూర్తిగా కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టిందని, రైతుబంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను పార్లమెంట్ సమావేశాల్లో వివరించాలని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినా నయాపైసా కూడా ప్రత్యేక నిధులు కేటాయించని కేంద్రం తీరును ఎండగట్టాలని సూచించారు.
విభజన చట్టం హామీలపై రాష్ట్రం తరఫున కేంద్రానికి ఇప్పటికే వినతులు చేసిన ఐఐఎం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలకు కేటాయింపుల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని కేటీఆర్ ఆదేశించారు. సీఏఏ, ఎన్నార్సీ వంటి వాటిపైన సీఎం కేసీఆర్ తీసుకొన్న వైఖరి మేరకు వ్యవహరించాలని సూచించారు. దేశం సంక్లిష్ట పరిస్థితిలోకి దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సమస్యగా మారిన నిరుద్యోగిత, ఆర్థికవ్యవస్థలో అస్థిరతవంటి కీలకమైన ప్రజోపయోగ అంశాలపైన కేంద్రం ఫోకస్చేయాలని.. ప్రజలకు అవసరంలేని సీఏఏ, ఎన్నార్సీ వంటి రాజకీయపరమైన అంశాలను పక్కన పెట్టాలని కేంద్రానికి సూచించాలన్నారు. కేంద్రం తీసుకున్న నినాదాలు, విధానాలతో మందకొడిగా మారిన ఆర్థికవ్యవస్థ, వృద్ధిరేటుపైన.. శీఘ్రగతిన అభివృద్ధిచెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలపైన వాటి ప్రభావాన్ని వివరించాలని కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు.

సీఎం కేసీఆర్‌కు దన్యవాదాలు బడుగు, బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పురపాలక పదవుల్లో అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతూ పార్లమెంటరీపార్టీ తీర్మానం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయా వర్గాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కూడా వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపింది. పురపాలిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సీఎం, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పరిపాలన, ప్రజాసంక్షేమంకోసం చేసిన కృషివల్లనే సాధ్యమైందని, పూర్తిస్థాయి క్రెడిట్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పార్లమెంటరీపార్టీ సమావేశం ప్రారంభంలో పురపాలక ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా నడిపించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు.
కేంద్రం హామీలు అమలుకాలేదు: నామా లోక్‌సభ టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం అనుసరిస్తున్నదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ, రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులపై కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. నీతిఆయోగ్ సిఫారసులను కూడా కేంద్రం అమలుచేయడంలేదని నామా విమర్శించారు. దేశంలో ప్రోగ్రెసివ్స్టేట్గా తెలంగాణ ఉన్నదని, కేంద్రం మాత్రం సరియైన మద్దతు, సహాకారం అందించడంలేదని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, పీ రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, బీ వెంకటేశ్, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండాప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఆర్థికమాంద్యం ఆందోళనకరం టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావు
తెలంగాణభవన్‌లో సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కే కేశవరావు మాట్లాడుతూ దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటిరంగంలో సాధించిన విజయాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. సీఏఏను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని, సీఎం కేసీఆర్ కూడా ఇటీవలే దీనిపై పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారన్నారు.
పార్లమెంటులోనూ మరోసారి పార్టీ వైఖరిని వివరిస్తామని చెప్పారు. జనాభా లెక్కల్లో ఓబీసీ జనగణనచేయాలని డిమాండ్చేస్తామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలపై జరిగే అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ ప్రాథమ్యాలను వివరిస్తామని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు నిధుల కేటాయింపు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయని, దానిపైన కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించినందుకుగాను సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశామని కేకే వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ను ప్రజలు గెలిపించారన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందని తీర్మానంలో పేర్కొన్నామన్నారు.