తెలంగాణలో కేజీ టు పీజీ విద్యకు నమూనాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాంగణం సిద్ధమైంది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి పీజీ కళాశాల వరకు ఒకేచోట నిర్మించిన ఈ ప్రాంగణం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ ఏడాది శాతవాహన విశ్వవిద్యాలయం ఎంఎస్సీ కంప్యూటర్ సైన్సు, ఎంకాం ప్రవేశాలకు అనుమతిచ్చింది.
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్‌ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ విద్యానిలయం సిద్ధమైంది. ‘మన ఊరు- మన బడి కింద’ మంత్రి కేటీఆర్ చొరవ, గివ్ తెలంగాణ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసౌధం ఆవిష్కృతమైంది.
రూ.3 కోట్లతో ఆరెకరాల స్థలంలో ఏకకాలంలో 3,500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం అభ్యసించేందుకు 70 తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినేలా భోజనశాల ఉంది. ఆటల కోసం ప్రత్యేకంగా సింథటిక్‌తో రూపొందించిన మైదానం ఉంది. ఇందులో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.