– ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లు – జీవన ప్రమాణాల మెరుగుకు తెలంగాణ పల్లె ప్రగతి: మంత్రి కేటీఆర్ – అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ను తొలగించాలా? – పీసీసీ అధ్యక్షుడికి మంత్రి సూటి ప్రశ్న

ఎన్నికల ముందు అందరూ హామీలిస్తారు..సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత కూడా హామీలు ఇవ్వడమే కాకుండా నెరవేర్చుతున్న మొనగాడు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ రాష్ట్రంలో చేయనటువంటి వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం సాహసంతో చేపడుతున్నది అని మంత్రి పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో బహిరంగసభలో, సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లు, ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు రూ.600 కోట్లతో నాలుగు లేన్ల రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకంలో పాలేరు, వైరా రిజర్వాయర్లు, గోదావరిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టను ప్రధాన నీటి వనరులుగా గుర్తించామని చెప్పారు. వీటి వద్ద ఎండాకాలంలో ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణం చేపడుతామన్నారు. వైరా రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృష్టిచేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ను పదవి నుంచి తొలగించాలాఅని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఎన్నికల్లో ప్రజల ఆదరణాభిమానాలు పొందలేక ప్రజాకోర్టులో గెలవనివాళ్లు హైకోర్టుకు పోతామనడం అవివేకమన్నారు. గత పాలకులు ఆటవిక పాలన సాగించారనడానికి నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి పెద్ద ఉదాహరణనన్నారు.
స్వరాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్యపై యుద్ధం ప్రకటించి వాటర్‌గ్రిడ్ ద్వారా నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మంచినీటిని అందిస్తామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఖమ్మం జెడ్పీచైర్మన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, కలెక్టర్ ఇలంబర్తి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు.