-53,625 ఓట్ల భారీ మెజారిటీతో భూపాల్‌రెడ్డి ఘనవిజయం -రెండోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. టీడీపీ డిపాజిట్ గల్లంతు -పోలైన ఓట్లు 1,54,912, టీఆర్‌ఎస్‌కు వచ్చినవి 93,076 -ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం.. సంబురాల్లో పార్టీ శ్రేణులు
అధికార టీఆర్‌ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే సీటు చేరింది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం భూపాల్‌రెడ్డి రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఖేడ్ చరిత్రలోనే తొలిసారి 53,625 ఓట్ల మెజారిటీతో విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్ కంచుకోటను కారు జెట్‌స్పీడ్‌తో వచ్చి బద్ధలుకొట్టింది. టీడీపీ డిపాజిట్ కోల్పోగా, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కింది. మంగళవారం ఖేడ్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కించారు. 14 టేబుళ్ల ద్వారా 21 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. తొలి రౌండ్ మొదలుకొని చివరి 21వ రౌండ్ వరకు ప్రతిరౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు కనిష్ఠంగా 2 వేలకుపైగా మెజారిటీ వచ్చింది.

నియోజకవర్గంలో 1,88,373 ఓట్లుండగా 1,54,912 (82.2 శాతం)ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 93,076 ఓట్లు, కాంగ్రెస్‌కు 39,451 ఓట్లు, టీడీపీకి 14,787 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ కోటకు బీటలు.. అడ్రస్‌లేని టీడీపీ: కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాలమరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సెంటిమెంట్‌తో విజయం తమవైపే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కిష్టారెడ్డి కొడుకు సంజీవరెడ్డిని నిలబెట్టడంతో కనీసం డిపాజిట్ దక్కింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితరుల ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఎంతగానో చెమటోడ్చినా డిపాజిట్ దక్కలేదు.
అభివృద్ధే లక్ష్యంగా ఖేడ్ ప్రజానీకం ఏకమై టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1994లో టీడీపీ అభ్యర్థి విజయ్‌పాల్‌రెడ్డికి 22 వేలు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కిష్టారెడ్డికి 27 వేలు, 2014లో తిరిగి కిష్టారెడ్డి 15 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు భూపాల్‌రెడ్డి సాధించిన 53 వేలపైచిలుకు ఓట్ల మెజారిటీ ఇదే ప్రథమం.
మిన్నంటిన విజయోత్సవ సంబురాలు: టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఖేడ్‌తోపాటు మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నాయి. ఖేడ్‌లో భూపాల్‌రెడ్డితో కలి సి ఎంపీ బీబీ పాటిల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, రాష్ట్ర గీతపారిశ్రామిక సంఘం మాజీ అధ్యక్షుడు విగ్రం రామాగౌడ్‌లతోపాటు శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. ఖేడ్ పట్టణంలో ప్రజలకు అభివాదం చేస్తూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పట్టణాల్లో పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ విజయం సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుక: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భారీ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నారాయణఖేడ్ ప్రజానీకానికి కృతజ్ఞతలు. నేడు జన్మదినం జరుపుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విజయాన్ని నారాయణఖేడ్ ప్రజలు అందిస్తున్న కానుక. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోను. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. గోదావరి జలాలు ఖేడ్‌కు వస్తే వలసలు ఆగిపోతాయి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఖేడ్‌కు రానున్న రోజుల్లో పరిశ్రమలు వస్తాయి. అవినీతి, ఫ్యాక్షన్ రహిత, పాలన అందిస్తా. ఖేడ్‌లో ఇకపై కొత్త రకమైన పాలన చూస్తారు. నా గెలుపులో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.
జైత్రయాత్ర కొనసాగుతున్నది -మంత్రి హరీశ్‌రావుకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు నారాయణఖేడ్ ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలుపొందడంపై ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఖేడ్ లో గెలుపుతో టీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగుతున్నదని స్పష్టమైందని పేర్కొన్నారు. గెలుపునకు కారణమైన భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుకు, మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్‌లో మంగళవారం మంత్రి కేటీఆర్ సంతోషాన్ని పంచుకున్నారు.
గురితప్పని బుల్లెట్ హరీశ్‌రావు సాధారణ ఎన్నికైనా, ఉప ఎన్నికైనా.. వ్యూహ, ప్రతివ్యూహాలతో విపక్షాలను మట్టికరిపించి సొంత పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో దిట్టయిన మంత్రి హరీశ్‌రావు మరోసారి తన మార్కును ప్రదర్శించారు. ఉప ఎన్నికల ట్రబుల్ షూటర్‌గా పేరుతెచ్చుకున్న హరీశ్‌రావు, తాజా విజయంతో ఆ పేరును సార్థకం చేసుకున్నారు. తనదైన శైలిలో చక్రం తిప్పి ఖేడ్‌లో టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వెనుకబాటుకు గురైన ఖేడ్ అభివృద్ధి బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. మంత్రి రంగంలోకి దిగి శాఖలవారీగా నివేదికలు తెప్పించుకుని ప్రాధాన్యతాక్రమంలో సీఎం సహకారంతో అభివృద్ధి పనులను మంజూరు చేయించారు. కొత్తగా 11 విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఖేడ్, పెద్దశంకరంపేటకు మార్కెట్‌యార్డులు, ఖేడ్‌లో 150 పడకల ప్రభుత్వ దవాఖాన, వివిధ సంఘాలకు భవనాలు, గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతున్నది. మార్కెట్ యార్డులు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. రోడ్లు అద్దంలా తయారయ్యాయి. ఖేడ్‌లో డివైడర్లు ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ లైట్లు అమర్చడంతో కొత్తకళ వచ్చింది. నాలుగు నెలల్లోనే ఖేడ్ రూపం మారుతుండడంతో ప్రజలు మూడ్ మారింది. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని భావించారు. కండ్లముందే రూ.500 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు ఖేడ్ ప్రజానీకాన్ని టీఆర్‌ఎస్ వైపు మళ్లించాయి. అందుకే హరీశ్‌రావు ఓ దశలో అభివృ ద్ధే మా అభ్యర్థి అని ప్రకటించారు. కంటిముందు అభ్యర్థి-ఇంటి ముందు అభివృద్ధి నినాదం కూడా ప్రజలను ఆలోచింపజేసింది. ఖేడ్‌ను దత్తత తీసుకున్నానని, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఇచ్చిన హామీకి స్థానికుల నుంచి అనూహ్యస్పందన వచ్చింది.
ప్రతిగ్రామంలో వృద్ధులు, మహిళలు, ఇతరులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలసుకోవడంతోపాటు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరాతీసి.. మీకు నేనున్నానంటూ భరోసా కల్పించా రు. అరైవై ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఖేడ్ ఎందుకు వెనుకబడింతో ప్రపంచానికి చెప్పారు. తండాల్లో మంచినీళ్లు లేక పెండ్లిచేసుకోవడానికి ఆడపిల్లను ఇవ్వ డం లేదనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రాయలసీమ తరహాలో ఖేడ్‌లో కొనసాగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలను, ప్రజలు స్వేచ్ఛగా కనీసం ఓటెయ్యలేని పరిస్థితులను సహించబోమని తేల్చిచెప్పారు. ఫలితంగానే ప్రజలు ధైర్యంగా ఓటెయ్యడంతోనే పోలింగ్‌శాతం అనూహ్యంగా పెరిగింది.

రెండు పార్టీల లొసుగులను అవకాశంగా చేసుకుని వసలను ప్రోత్సహించారు. ఉపాధికోసం వలసవెళ్లినవారిని పోలింగ్ రోజున ఓట్లేసేలా స్థానిక కార్యకర్తలతో ప్రయత్నాలు చేయించి సఫలమయ్యారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఇల్లిల్లూ కలియతిరిగారు. నిత్యం దాదాపు 14 గ్రామాల్లో అభ్యర్థి భూపాల్‌రెడ్డితో కలిసి ఇం టింటా ప్రచారం చేసిన హరీశ్, ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. పోలింగ్‌కు ముందురోజు ఖేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగసభ హైలెట్‌గా నిలిచింది. సభలోనే సీఎం కాళ్లు మొక్కి ఖేడ్‌ను అభివృద్ధి చేస్తానని హరీశ్‌రావు అనడం, కేసీఆర్ స్పందిస్తూ నా కాళ్లు మొక్కడం అవసరం లేదు.. గోదావరి నీళ్లు తెచ్చి ఖేడ్ ప్రజల కాళ్లు కడుగుతామన్న మాటలు స్థానికుల మనసును తాకాయి. ఖేడ్‌కు హరీశ్‌రావు అండగా ఉంటారన్న భరోసాయే భారీ మెజార్టీ తెచ్చిపెట్టిందనేది సుస్పష్టం.
సీఎంను ప్రజలు దీవించారు -ఖేడ్‌ను సిద్దిపేటలా మార్చేస్తా: మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్, నమస్తేతెలంగాణ: టీఆర్‌ఎస్‌ను నమ్మి, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దీవించి ఖేడ్ ప్రజలు ఉప ఎన్నికలో ఘన విజయాన్ని అందించారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్‌ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసినందుకు మంగళవారం ఒక ప్రకటనలో ఖేడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్త నుంచి ఎంపీ వరకు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ముందుగా ప్రకటించినట్లుగా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా ఈ ఘనవిజయాన్ని అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఖేడ్ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమనే నమ్మకంతో ప్రజలు భూపాల్‌రెడ్డిని గెలిపించారని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టంచేశారు. ఖేడ్‌ను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానన్న మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ ఫలితాలు బాధ్యతను పెంచాయన్నారు.