Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఖేడ్‌ను మరో సిద్దిపేట చేస్తాం..

ఇన్నాళ్ల పాలనలో వెనుకబడ్డ నారాయణఖేడ్ అభివృద్ధి బాధ్యత నాది అని నియోజకవర్గం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టమైన హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లు తెచ్చి గట్టులింగంపల్లీ ప్రాజెక్టు నింపి ఖేడ్ నీటికష్టాలు తీరుస్తానని చెప్పారు. ఖేడ్‌కు మార్కెట్ యార్డు కూడా లేకపోవడం గతపాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని, ఇక నుంచి ఖేడ్ ముఖచిత్రం మారిపోవాలని అన్నారు. ఖేడ్‌ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ తరహా తీర్పు ఇవ్వాలని కోరారు. అభివృద్ధికి బాటలు వేసే టీఆర్‌ఎస్ పార్టీని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడి మేధావులు, విద్యావంతులు మేల్కొని ఏ పార్టీకి, ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు వివరించాలని కోరారు. -నారాయణఖేడ్ అభివృద్ధి బాధ్యత నాది.. టీఆర్‌ఎస్‌ను గెలిపించండి -ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు -ఖేడ్ మేధావులు మేల్కోవాలి.. వాస్తవాలను ప్రజలకు వివరించాలి -పంచాయతీరాజ్ ఎన్నికల నాటికి తండాలు పంచాయతీలవుతాయి -పశ్చిమ మెదక్ జిల్లా అభివృద్ధికి పెద్ద ప్రయత్నం జరుగాలి -వెయ్యిరూపాయల పింఛన్, డబుల్‌బెడ్‌రూం పథకాలు దేశంలో ఎక్కడా లేవు: కేసీఆర్

CM-KCR-addressing-in-Narayankhed-TRS-Public-Meeting

బుధవారం నారాయణఖేడ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందినప్పుడే కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు సార్థకత లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం రూ.34వేల కోట్లు వెచ్చిస్తున్నదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసే హైదరాబాద్ ప్రజలు దీవించారని చెప్పారు. వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు 1500 పింఛను ఇస్తున్నామని, కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని, ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, నాయీబ్రాహ్మణులకు కరెంటు బిల్లుల తగ్గింపు వంటి చర్యలు సర్కారు చేపట్టిందని వివరించారు. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కరూపాయి ఖర్చు చేయకుండా పేదలకు డబుల్‌బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లోగా రాష్ట్రంలోని తాండాలకు గ్రామ పంచాయతీ హోదాకల్పించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారని, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కోసం చావునోట్లోకి వెళ్ళివచ్చిన.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ చాలా అన్యాయానికి గురైందని, వేరుపడితేనే బాగుపడుతామని 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన. ఉద్యమంలో భాగంగా నారాయణఖేడ్‌కు పలు సందర్భాల్లో వచ్చిన. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి చావునోట్లోకి వెళ్ళివచ్చిన. భగవంతుని దయతో నేను చచ్చిపోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని సీఎం కేసీఆర్ గతాన్ని గుర్తు చేశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణాను అన్నివిధాలుగా బాగుచేసుకోవాల్సి ఉందన్నారు. దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు. బీసీ వర్గాల ప్రజలు, ఓసీ వర్గాల్లోని పేదలతోపాటు అన్నివర్గాలు బాగుపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అందరి ముఖాల్ల్లో చిరునవ్వులు వెలిగిన రోజే తెలంగాణకు సార్థకత చేకూరుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం పేదల సంక్షేమానికి రూ.34 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, తాను చెప్పేవి కథలు కావని అన్నారు.

ప్రతినెల వృద్ధులు, భర్తలు చనిపోయిన మహిళలు వెయ్యిరూపాయలు పించను తీసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇండియా మొత్తంలో ఏ రా్రష్ట్రంలో కూడా ఇలా పింఛన్ ఇవ్వడం లేదు. ఇది చాలా పెద్ద పథకమని అందరూ అంటున్నరు. వెయ్యి ఫించన్‌తో పప్పుతోనో, పులుసుతోనో పేదలు ఇంత అన్నం తింటున్నరు. ఈ పథకం పెట్టడంతోనే హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దీవించారు అన్నారు. గతంలో రాష్ర్టాన్ని ఏలిన మారాజులు కుటుంబంలో ఒక్కరికి 4 కిలోలు బియ్యం ఇచ్చారు. ఈ రోజు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి బియ్యం ఇస్తున్నం. వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఆటోరిక్షా కార్మికులకు టాక్స్ రద్దు చేస్తమని చెప్పి చేశాం. తెలంగాణాలో 10 లక్షల డ్రైవర్లకు రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించాం. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పని చేసిందా? ప్రతిఒక్కరూ ఈ విషయం ఆలోచించాలి అని సీఎం కోరారు. నాయీబ్రాహ్మణులకు కరెంటు బిల్లులు తగ్గించాం. దేశం ఆశ్చర్యపడే విధంగా, ప్రపంచదేశాల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్కరూపాయి పేదలు ఖర్చు పెట్టకుండా డబుల్ బెడ్‌రూము ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఇవన్నీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ బాగుకావడం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని సీఎం స్పష్టం చేశారు.

TRS-Public-Meeting-in-Narayankhed

ఖేడ్ దేశంలోనే ఉన్నదా? ఎంత అన్యాయం..! నారాయణఖేడ్ దేశంలోనే ఉందా? ఇంకెక్కడైనా ఉందా? ఎంత అన్యాయం! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారు నా వద్దకు వచ్చి చెప్పిన మాటలివి అని కేసీఆర్ గుర్తు చేశారు. ఖేడ్‌లో ఉన్న దరిద్రం మరెక్కడా లేదంటున్నరు. ఇప్పటికీ ఖేడ్‌లో స్వాతంత్యం లేదు. కొన్నిచోట్ల ఓట్లు వేయనివ్వని, కనీసం మాట మాట్లాడనివ్వని పరిస్థితి ఉంది. గూండా, దాదాగిరి. ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులివ్వడం, మందుపోయడం, ఓట్లకోసం ఒట్లు పెట్టించే చర్యలకు పాల్పడుతున్నరు. ఇంత జరుగుతున్నా ఇక్కడివాళ్లు సోయికి రాకపోతే ఎలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అయినా ఓట్లు వేస్తనే ఉన్నం. ఇన్నిరోజులైనా నారాయణఖేడ్‌లో మార్కెట్ కమిటీ ఉండదా? మేం సిపాయిలమంటే.. మేం సిపాయిలమంటున్నరు. ఇన్నిరోజులు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేశారో అర్థం కావడం లేదు. ఒక నియోజకవర్గంలో మార్కెట్‌యార్డు ఉండదా? దవాఖానాలు ఉండవా? ఇంత అధ్వాన్నం ఉంటదా? ఇంత దారుణ పరిస్థితులు ఇంకా నారాయణఖేడ్‌లో అలాగే ఉండాలా? అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్, టీడీపీలను చూశారు. ఈ రోజు టీఆర్‌ఎస్‌కు అవకాశమివ్వమని అడుతున్నాం. కాంగ్రెస్, టీడీపీల పరిపాలనలో ఏం చేశారో? ఏం జరిగిందో? మీకు తెలియంది కాదు. 4 నెలల నుంచి హరీశ్‌రావు ఏం చేస్తున్నడో మీరు చూస్తున్నరు. ఈ సమయంలో తెలివిగా ఖేడ్ ప్రజలు ఓట్లేయాలనుకుంటే తప్పక టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటువేయాలి. అభివృద్ధి రావాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలి. భూపాల్‌రెడ్డి గెలుపుతో ఖేడ్ అభివృద్ధిలో ముందుకు పోతుంది. అన్ని రంగాల్లో ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల తరువాత రెండురోజులు ఖేడ్‌లోనే ఉండి అన్ని మండలాలు తిరిగి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు నేనే మంజూరు చేస్తానన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టు నేను ఈ జిల్లా బిడ్డనే. సీఎం జిల్లాలో ఖేడ్ వెనుకబడి ఉండడం నాకు కూడా ముఖం తెలివికాదు. ఎక్కడైనా మాట్లాడితే నీ జిల్లాలో నారాయణఖేడే బాగాలేదంటరు. ఖేడ్‌లో దరిద్రం, పేదరికంను దూరం చేసే బాధ్యత జిల్లాబిడ్డగా నేను తీసుకుంటున్న. ఖేడ్‌పై గులాబీ జెండా ఎగురుతుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

తాండాలు పంచాయతీలవుతాయి.. నులకమంచంపై స్నానం చేసి కిందపడిన నీటిని తిరిగి వాడుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఆ దుస్థితి ఇక ఉండదు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి నల్లాపెట్టి పరిశుభ్రమైన నీళ్లు అందిస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు. భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టుకోవాలన్నా, సంక్షేమం చేసుకోవాలన్నా. అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణా అంటే ఒట్టి మాటలు చెబితే కాదని, ఇక్కడి ప్రాంతాలు బాగుపడాలని అభిప్రాయపడ్డారు. ఖేడ్ నియోజకవర్గంలో 200 లంబాడి తండాలు ఉన్నాయి. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చనున్నాం. మొదటి క్యాబినెట్‌లోనే ఆర్డర్ పాస్‌చేశామని, రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల వరకు తాండాలన్నీ గ్రామ పంచాయతీలుగా అవుతాయన్నారు.

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కోసం మైనారిటీ కమిషన్‌ను నియమించామని, కమిషన్ రిపోర్టు వచ్చిన తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దళిత సోదరులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు షాదీముభారక్, దళితులకు కళ్యాణలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నం. రాబోయే బడ్జెట్ తరువాత తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేసి ఆడబిడ్డల పెండ్లికి రూ.51వేలు అందిస్తామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఆవే ముఠాలు ఖేడ్‌లో తిరుగుతున్నాయి.. అవాకులు, చెవాకులు మాట్లాడే కాంగ్రెస్, టీడీపీ నాయకులు మొన్న జరిగిన ఎన్నికల్లో వరంగల్‌కు వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడ వాళ్లు మాట్లాడిన మాటలు వింటే మొత్తం కిందమీదై పోయిందనుకోవాలే. ఎన్నికల తరువాత డబ్బాలు విప్పితే ఆ పార్టీలకు డిపాజిట్లు రాలే. అక్కడ తిరిగిన అదే ముఠా మొన్న హైదరాబాద్‌లో తేలింది. అక్కడా వీరంగం చేసింది. పట్నంలో ఒకనికి ఒక్కసీటు, ఇంకొకనికి రెండు సీట్లొచ్చినయి అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు నారాయణఖేడ్‌కు అవే ముఠాలు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతున్నయి. వరంగల్, హైదరాబాద్‌లాగా ఖేడ్‌లో తీర్పిచ్చే బాధ్యత మీదే అని కేసీఆర్ అన్నారు. నారాయణఖేడ్‌ను తీర్చిదిద్దే బాధ్యత తనదని, భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీదని అన్నారు. కారుగుర్తును గెలిపిస్తే ఏసీకార్లలో తిరిగినట్లు ఫీలవుతారని కేసీఆర్ అన్నారు.

మేధావివర్గం వాస్తవాలను ప్రజలకు వివరించాలి.. నారాయణఖేడ్‌లో ఏ పార్టీ, ఏ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో మేధావివర్గం ఆలోచించాలని కేసీఆర్ కోరారు. రవాణాశాఖ మంత్రిగా ఉండగా 20 ఏండ్ల కింద వచ్చిన ఉప ఎన్నికల్లో బాబుమోహన్‌ను గెలిపించడానికి మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డితో కలిసి అందోల్ వచ్చిన. ఇక్కడి వెనుకబాటును చూసి అప్పుడు నేను ఏది చెప్పానో ఖేడ్ వెనుకబాటు గురించి ఇప్పుడు హరీశ్‌రావు అదే చెప్తున్నడు. 20 ఏండ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఈ ప్రాంతం అలాగే ఉన్నది. పశ్చిమ మెదక్ జిల్లా అభివృద్ధికి పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరమున్నది అని కేసీఆర్ అన్నారు. ఖేడ్, అందోల్‌లాంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఖేడ్‌కు ఏదీ అవసరముంటే అది చేసిపెడతా.

తెలిసి కూడా గొయ్యిలో పడడం మంచిది కాదు. పండ్లు తినాలంటే పండ్ల చెట్లు పెట్టుకోవాలి తప్ప ముండ్ల చెట్లు కావు. గాడిదలకు గడ్డి వేస్తే గేదెలు పాలిస్తాయా? పెద్ద మెజారిటీతో భూపాల్‌రెడ్డి గెలుస్తున్నట్లు సర్వే రిపోర్టులు ఉన్నాయి. ఇతర పార్టీలవారు పెద్దఎత్తున డబ్బు కట్టలు పంచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. పనిచేసే వారికి పట్టం కట్టండి. ప్రపంచమంతా మేల్కోన్నది. నారాయణఖేడ్ కూడా మేల్కోవాలి. మేధావులు ఆలోచించాలి. అది మీ బాధ్యత. ఉద్యోగులు, న్యాయవాదులు, మేధావులు, రచయితలు, ఉపాధ్యాయులు మౌనం పాటిస్తే మంచి జరగదు. మేధావులు వాస్తవాలను అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

భారీ మెజారిటీ ద్వారా హరీశ్‌రావుకు వెయ్యి ఏనుగుల బలం ఇవ్వాలి బ్రహ్మాండమైన మంత్రి హరీశ్‌రావు ఈ జిల్లాలో ఉన్నడు. బుల్లెట్‌లా దూసుకుపోతున్నడు. నాలుగైదు నెలలనుంచి మీ మధ్యే తిరుగుతున్నడు. మీ బాధలు కండ్లారా చూసి గుండెలవిసిపోయి నీ కాళ్లు మొక్కుతా అని నాతోని అంటున్నడు. నా కాళ్లు మొక్కే అవసరం లేదు. ఇదే హరీశ్‌రావు చేత గోదావరి నీళ్లు తెచ్చి గట్‌లింగంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఖేడ్ ప్రజల కాళ్లు కడిగే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ అన్నారు. నారాయణఖేడ్‌కు వెలుగులు రావాలి. ఖేడ్‌ను బాగుచేసే బాధ్యత హరీశ్‌రావుకు ఎంత ఉందో నాకూ అంతేఉంది. కేసీఆర్ చాలా మొండిఘటం. నేను ఏదైనా చెప్పానంటే ఆరునూరైనా వెనకడుగేయను. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాటకు బయలుదేరిన రోజున చాలామంది చాలా మాటలన్నరు. బక్కోడు వీడితో ఏమైతది.

ఎవడో బొండిగె పిస్కుతరని కాంగ్రెస్, టీడీపీ వాళ్లు చాలా మాట్లాడారు. గీ బక్కోడే తెలంగాణ తెచ్చిన మాట నిజం కాదా అని కేసీఆర్ గతాన్ని గుర్తు చేశారు. శక్తి, పట్టుదల ఉన్న యువకుడైన మంత్రి హరీశ్‌రావు ఇక్కడ ఉన్నడు. వందశాతం సిద్దిపేట తరహాలో ఖేడ్‌ను అభివృద్ధి చేస్తానని చెబుతున్నడు. మీమధ్యే తిరుగుతూ మీబాధలు చూస్తున్నడు. వందకు వందశాతం హరీశ్‌రావు మాట నిలబెడుతా అని కేసీఆర్ ఖేడ్ ప్రజానీకానికి హామీ ఇచ్చారు. భూపాల్‌రెడ్డిని గెలిపించుకోండి. హరీశ్‌రావు అన్నట్టుగా కాంగ్రెస్, టీడీపీ డిపాజిట్లు పోగొట్టాలే. అప్పుడు హరీశ్‌రావుకు వెయ్యిఏనుగుల బలం వస్తుంది. మీకు బాగా పనిచేయగలుగుతాడు. పనిచేస్తామని చెబుతున్న హరీశ్‌రావుకు భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మరింత శక్తినివ్వాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే గ్రామాల్లో తిరుగనివ్వని దుస్థితి కల్పించారు.. స్వాతంత్య్రం వచ్చి 60ఏండ్లు అవుతున్నా ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు ఒరగబెట్టింది శూన్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేసిన పాపానికి గ్రామాల్లో తిరుగనివ్వని పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైనా ఖేడ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇంతకాలం ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంటగలిపిందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రభుత్వ దవాఖానలు, బీటీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. సీఎం ప్రత్యేక కృషితో నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట తరహాలో నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఖేడ్ ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీల డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.

భారీ మెజారిటీతో ఖేడ్‌ను కైవసం చేసుకొని ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రికి బర్త్‌డే కానుకగా ఇద్దామని ఆయన ఖేడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టారని, అయినా వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్యనే ఉండి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింతాప్రభాకర్, మహిపాల్‌రెడ్డి,

బాబుమోహన్, గణేశ్‌గుప్తా, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాములునాయక్, భూపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా సీఎం ప్రచార సభతో నారాయణఖేడ్ గులాబీమయమైంది. నియోజకవర్గంలోని నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి, కల్హేర్, మనూరు మండలాల నుంచి వేలమంది ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారు. ఖేడ్‌లో ఎక్కడ చూసినా జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు నినాదాలు మారుమ్రోగాయి. కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.