-నిధులు ఇవ్వబోమని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి -ఒప్పందం ప్రకారమే మెట్రోకు కేంద్రం నిధులు: విప్ కర్నె ఫైర్

తెలంగాణకు నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. మెట్రో నిధులపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో ప్రారంభోత్సవంపై కిషన్‌రెడ్డి అనవసర రా ద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణపై ప్రేమలేదని ఆరోపించారు. మెట్రోకు రూ.14,132కోట్ల వ్యయమవుతుంటే కేంద్రప్రభుత్వం ఒప్పందం ప్రకారం వయోబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) రూ.1400 కోట్లు కేటాయించిదని చెప్పారు. ఇందులో ఇంకా రూ.258 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. ఇందులో ఎవరి మెహర్బానీ లేదని స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెట్రోలకు 20శాతం నిధులు ఇచ్చారని చెప్పారు. బీజేపీ పాలితరాష్ర్టాలపై చూపిన ప్రేమలో పావలా వంతైనా తెలంగాణపై చూపితే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందేదని చెప్పా రు. కిషన్‌రెడ్డి తీరు చూసి ఆయనకు ఓట్లేసిన సికింద్రాబాద్ ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. మెట్రో నాలుగుదశలో ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్ ఒకదశలో మాత్రమే ప్రారంభించారని తెలిపారు. మెట్రోప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ను పాటించకపోతే.. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే ఎంపీ రేవంత్‌రెడ్డిని ఎలా ఆహ్వానించామని ప్రశ్నించారు. ప్రధాని ఫొటోను మెట్రోహోర్డింగుల్లో వేయించామని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇప్పించాలని సవాల్ విసిరారు. రాష్ర్టానికి కేంద్రం తరఫున ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకొస్తే పౌరసన్మానం చేస్తామన్నారు. బీజేపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నదని.. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓటమి చవిసూస్తున్నదని చెప్పారు.