Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొడంగల్ చిత్తు కాగితాన్ని చిత్తుగా ఓడిద్దాం

-పదహారుమంది టీఆర్‌ఎస్ ఎంపీలుంటే.. రాష్ర్టానికి నిధులు, హక్కులు సాధించుకోవచ్చు
-కంటోన్మెంట్ భూములపై నోరుమెదపని కేంద్రం
-ఓట్ల కోసమే మోదీ చౌకీదార్ అవతారం
-మల్కాజిగిరి రోడ్‌షోలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కొండంగల్ ప్రజలు చిత్తుకాగితంగా తీసిపడేసిన కాంగ్రెస్ అభ్యర్థిని మల్కాజిగిరిలో చిత్తుచిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఓటర్లకు పిలుపునిచ్చారు. రూ.50 లక్షల నోట్ల సంచులతో ఓ ఎమ్మెల్యేను కొనేందుకు వెళ్లి కెమెరాకు అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసు దొంగకు ఓటేస్తారా? యువకుడు, విద్యావేత్త, ప్రజాసేవకుడైన మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఓటేస్తారో మల్కాజిగిరి ప్రజలు తేల్చుకోవాలన్నారు. కొడంగల్‌లో ఏమీచేయని రేవంత్.. మల్కాజిగిరికి వచ్చి ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవాచేశారు. బుధవారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్‌విలేజ్, మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చాయ్‌వాలా అవతారం ఎత్తిన మోదీ.. నేడు చౌకీదార్ అవతారంలో వస్తున్నాడన్నారు. ఇన్నాళ్లు చేసిందేంటి.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రాహుల్‌గాంధీ 40 ఏండ్ల కిందట వాళ్ల నాయనమ్మ ఇచ్చిన గరీబీ హఠావో నినాదాన్ని భుజానవేసుకు తిరుగుతున్నాడని ఎద్దేవాచేశారు.

కేంద్రం నుంచి స్పందన లేదు
కంటోన్మెంట్ పరిధిలో రెండు ప్రధాన రహదారులపై ఆరు లేన్ల స్కైవే నిర్మించడానికి రక్షణ శాఖ భూములు అడిగితే కేంద్రం ఇంతవరకు స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్‌లో వంద ఎకరాలకు బదులు శామీర్‌పేట్‌లో 600 ఎకరాలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా స్పందనలేదన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని రక్షణశాఖ అధికారులు.. ఇష్టారాజ్యంగా రోడ్లను మూసివేస్తున్నారని విమర్శించారు. కంటోన్మెంట్ పరిధిలోని ప్రజల మంచినీటి బకాయిలు దాదాపు రూ.17 కోట్ల మేరకు మాఫీచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కంటోన్మెంట్ ముద్దుబిడ్డ రాజశేఖర్‌రెడ్డికి ఇక్కడి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నదన్నారు. గల్లీలో ప్రజాసేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా ఉండే రాజశేఖర్‌రెడ్డినే గెలిపించాలని కోరారు.

రూ.300 కోట్లతో తాగునీరు.. రూ.80 కోట్లతో సాగునీరు
సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ తరువాత మేడ్చల్ ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందించాలనే సంకల్పంతో సుమారు రూ.300 కోట్లతో ఇంటింటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రూ.80వేల కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా మేడ్చల్ జిల్లాకు సాగునీరు అందిస్తామన్నారు. మేడ్చల్‌లో రాజశేఖర్‌రెడ్డిని 1.50 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం.. కాళేశ్వరానికి మాత్రం జాతీయహోదా ఇవ్వడం లేదన్నారు. మనకు ఢిల్లీలో 16 మంది ఎంపీలుంటే కేంద్రం మెడలువంచి కాళేశ్వరానికి జాతీయహోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువస్తామన్నారు.

ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో
బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీ ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో అంటారని, అదే టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే గల్లీలో సేవ చేసేందుకు ఢిల్లీలో పోరాడుతారని కేటీఆర్ చెప్పారు. ఇద్దరు ఎంపీలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్.. 16 మంది ఎంపీలుంటే మన రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేస్తారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. దేశానికి చౌకీదార్, టేకేదార్ కావాలా? లేక జోర్దార్.. వఫేదార్.. జిమ్మేదార్.. కేసీఆర్ కావాలా? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ ప్రాంతంలో 13 వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించామని, వీటిని త్వరలోనే ప్రారంభించి అర్హులకు అందిస్తామని చెప్పారు. గతంలో 15 రోజులకోసారి తాగునీరు వచ్చేదని, నేడు రెండ్రోజులకోసారి ఇస్తున్నామని, త్వరలోనే ప్రతిరోజు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అంబీర్ చెరువు, ఫాక్స్ సాగర్‌లను కోట్ల రూపాయలతో సుందరీకరించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాల్లో పార్కు నిర్మిస్తామని హామీనిచ్చారు.

నేడు అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కేటీఆర్ రోడ్‌షో
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేయనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక అలీ కేఫ్ చౌరస్తా, శ్రీరమణ చౌరస్తా, నల్లకుంట డివిజన్‌లోని ఫీవర్ హాస్పిటల్ రైల్వేబ్రిడ్జి, అక్కడినుంచి రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ జంక్షన్, భోలక్‌పూర్ సుప్రీం హోటల్ వద్ద రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.