-కేటీఆర్ దత్తత సెగ్మెంట్లో ప్రగతి పరుగు.. -రూ.297 కోట్లతో పనులు పూర్తి.. -పూర్తికావచ్చిన కోస్గి బస్‌డిపో నిర్మాణం -ప్రతి హ్యాబిటేషన్‌కు రోడ్డు సౌకర్యం.. -బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌లో జూనియర్ కాలేజీలు అవి.. 2018 అసెంబ్లీ ఎన్నికలు.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. తాను దత్తత తీసుకొని సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. కేటీఆర్ హామీ మేరకు కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. హామీ నెరవేర్చడంలో భాగంగా నియోజకవర్గంలో రూ.297 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

గతంలో కొడంగల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు, తండాలకు రోడ్డు సౌకర్యం ఉండేదికాదు. ప్రస్తుతం బీటీ, సీసీ రోడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది. రోడ్లే కాకుండా కమ్యూనిటీ భవనాలు, చెక్‌డ్యాంలు, సర్కారు దవాఖాన, డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయి. కొడంగల్‌లో మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోస్గిలో బస్‌డిపో, బస్‌స్టేషన్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. కొడంగల్‌లో మున్సిపల్ భవన నిర్మాణం, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కొడంగల్‌లో మినీ స్టేడియం నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని సంబంధితశాఖలను మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కొత్త మండలాల ఏర్పాటుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం రూ.7.08 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుతం 60శాతం పనులు పూర్తయ్యాయి.

15 కోట్లతో చెక్‌డ్యాంలు కరువు ప్రాంతంగా పేరున్న కొడంగల్ సెగ్మెంట్లో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు రూ.15 కోట్లతో ఐదు చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. రూ.8.14 కోట్లతో ఐదు మండలాల పరిధిలో 37 రైతు వేదికలను నిర్మించారు. కొడంగల్, కోస్గి, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, మద్దూరు మండలాల్లో ఒక్కో మండలానికి రూ.10 కోట్ల చొప్పున రూ.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి.

రోడ్ల అభివృద్ధికి 185 కోట్లు రూ.185 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలను కలిపే రోడ్లకు రూ.85 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లకు రూ.100 కోట్లు విడుదలవగా పనులు కొనసాగుతున్నాయి. దౌల్తాబాద్- మద్దూరు, కోస్గి- మద్దూరు, రావులపల్లి- దౌల్తాబాద్, బొంరాస్‌పేట్- కోస్గి రోడ్ల నిర్మాణాలు పూర్తికాగా, కొడంగల్- బాపల్లి తండా రోడ్డు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
మున్సిపాలిటీల అభివృద్ధికి 30 కోట్లు కొడంగల్, కోస్గి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వీటి అభివృద్ధికి రూ.30 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో రెండు పట్టణాల్లో అంతర్గత మురుగు నీటి కాల్వల నిర్మాణం, సీసీ రోడ్లు, దుకాణ సముదాయాలు, పార్కులు అభివృద్ధి చేస్తారు.

2.25 కోట్లతో డిగ్రీ కాలేజీ భవనం కొడంగల్‌లో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన డిగ్రీ కళాశాల భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నది. నియోజకవర్గ పరిధిలో మంత్రి కేటీఆర్ చొరవతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు మంజూరయ్యాయి.
నెరవేరుతున్న బస్‌డిపో కల కోస్గి పట్టణానికి మహర్దశ రానుంది. 30 ఏండ్లుగా గ్రామాలకు రవాణా సదుపాయలు లేక ఇబ్బందిపడుతున్న కోస్గి ప్రాంత ప్రజల కల నెరవేరనుంది. రూ.2 కోట్లతో చేపట్టిన శాటిలైట్ బస్‌డిపో, రూ.కోటితో చేపట్టిన బస్‌స్టేషన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించ నున్నారు.
1.20 కోట్లతో బంజారాభవన్ కొడంగల్ నియోజకవర్గంలో గిరిజన తండాలు ఎక్కువే. గతంలో తండాల వరకు రోడ్లు ఉండేవి కాదు. ప్రస్తుతం బీటీ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. గిరిజనుల ఆత్మగౌరవం కాపాడేలా రూ.1.20 కోట్లతో చేపట్టిన బంజారాభవన్ నిర్మాణపనులు సాగుతున్నాయి.

మినీ స్టేడియం, జూనియర్ కాలేజీలు బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కొడంగల్‌లో మినీ స్టేడియం నిర్మాణాలకు ప్రభుత్వం త్వరలో నిధులు విడుదల చేయనున్నది. కోస్గి మున్సిపాలిటీ ఆధునీకరణలో భాగంగా కోస్గి- సయ్యద్పహాడ్ రోడ్డు విస్తరణకు రూ.10 కోట్ల నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గానికి కొత్తరూపు తెచ్చే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు. సెగ్మెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ నిధులు విడుదల చేయిస్తుండటంతో కొంగొత్త కొడంగల్ ఆవిష్కృతమవుతున్నది. కేటీఆర్ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
త్వరలో మూడు కొత్త మండలాలు పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తమండలాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొడంగల్ సెగ్మెంట్లో ప్రతిపాదనలో ఉన్న దుద్యాల, గుండుమల్, కొత్తపల్లి మండలాలను ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.