-దత్తత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా -సిరిసిల్లకు దీటుగా నిలబెడుతా -సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి -కోస్గిలో బస్‌డిపో, బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం -మూడు నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయండి -సెప్టెంబర్‌లో మరోసారి పర్యటిస్తా -రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు

కొడంగల్ నియోజక వర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అపార నమ్మకంతో టీఆర్ఎస్ను గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. అన్ని రకాలుగా కొడంగల్ ప్రజలకు అండగా ఉంటానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు దీటుగా కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కొనసాగుతున్న పనులపై మంత్రి కేటీఆర్ సమీక్షిస్తూ, మూడు నెలల్లోగా అన్ని పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. డిపోల ఏర్పాటు యోచన లేకపోయినప్పటికీ కోస్గి బస్‌డిపో, బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల్లో రూ.50 కోట్ల నిధులతో సాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. రూ.4 కోట్లతో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల, రూ.5 కోట్లతో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా మంత్రి సబితారెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. దౌల్తాబాద్‌లో రూ.8 కోట్లతో కొనసాగుతున్న మినీ ట్యాంక్‌బండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. కొడంగల్, కోస్గి కేంద్రాల్లో 50 పడకల దవాఖానల నిర్మాణాకి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సెప్టెంబర్‌లో కొడంగల్‌లో పర్యటిస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తి అవుతున్నాయని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. కాగా మరిన్ని ట్యాంకులు, మిగిలిన కనెక్షన్లు, కొత్తగా అవసరమైన పైపులైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ల సిఫార్సు మేరకు పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు. నియోజకవర్గంలో రైతుబంధు, వ్యవసాయ పనులపై తోటి మంత్రులు, ఎమ్మెల్యేతో ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో జూనియర్ కాలేజీ ఏర్పాటు, మహబూబ్‌గర్, చించోలి, తాండూర్ రోడ్డుతోపాటు నియోజకవర్గంలోని పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకురాగా, తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాల్లో ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రయత్నం చేస్తామని ముగ్గురు మంత్రులు హామీనిచ్చారు. అంతేకాకుండా కరోనా కట్టడి, ప్రజలకు అవగాహన కల్పించడంపై కూడా మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు పౌసుమీ బసు, హరిచందన పాల్గొన్నారు.