Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొడంగల్‌ను దత్తత తీసుకుంటా

-టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతా
-కాంగ్రెస్ రాకుంటే రేవంత్.. నువ్ తప్పుకొంటావా..
-కేసీఆర్‌ను తిడితే పెద్దవారవుతారా..
-రేవంత్ ఓ బిల్డప్ రాజా.. మాటలే తప్ప.. చేతల్లేవ్
-కృష్ణా జలాలతో కొండగల్ ప్రజల పాదాలు కడుగుతాం
-కొడంగల్ రోడ్‌షో, మద్దూరు బహిరంగసభలో మంత్రి కేటీఆర్
-సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేస్తా

కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని.. సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేస్తానని మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి ఓట్లేసి.. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిన రేవంత్‌రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొడంగల్‌లో రోడ్‌షో, మద్దూరు మండలంలో జరిగిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. అంతకుముందు పరిగిలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటావా? అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ పింఛన్లను రూ.1000 నుంచి రూ. 2016కు, రూ.1500ల నుంచి రూ.3016లకు పెంచుతామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.70 పింఛన్ మాత్రమే వచ్చేదని, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఇచ్చేవారని గుర్తుచేశారు. దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణవైపు చూసేలా రూ.43 వేల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేశామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు చీకటైతయ్, ఆగమైతయ్ అని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, కానీ ఎవరు ఆగమయ్యారో ప్రజలందరికీ తెలిసిందన్నారు. కూటమి, టీఆర్‌ఎస్‌లు రెండు గట్లు అనుకుంటే.. టీఆర్‌ఎస్ గట్టున పేదల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఉన్నాయి.. కూటమి గట్టున సంక్షోభం, అవకాశవాదం, అధికారదాహం ఉన్నాయి. మీరు ఏ గట్టున ఉంటారో తేల్చుకోండి అని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

నీళ్లు కావాలా.. కన్నీళ్లు కావాలా…
తెలంగాణకు నీళ్లివ్వకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని కేటీఆర్ తెలిపారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ జుట్టు ఆయన చేతిలోనే ఉంటుందని, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చెప్పారు. పాలమూరు జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రస్తుత కొల్లాపూర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థులు హర్షవర్ధన్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుల్లో 30కి పైగా కేసులు వేశారని, వాటివల్లే పాలమూరు – రంగారెడ్డి పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోతుందని చెప్పారు. కృష్ణాజలాలను తీసుకొచ్చి కొడంగల్ రైతుల పాదాలను కడుగుతామని కేటీఆర్ తెలిపారు. నీళ్లు కావాలో.. కన్నీళ్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

టీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారని, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ రావాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న లీడర్లంతా సీఎం అభ్యర్థులేనని ఎద్దేవాచేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచే అరుణ, చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి సీఎంగా కలలు కంటుంటే.. రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో ఊహించలేమన్నారు. రేవంత్‌రెడ్డి బిల్డప్ రాజా అని.. టీవీ, పేపర్లలో పోజులిచ్చుకుంటూ.. కొడంగల్ ప్రజలకు అన్యా యం చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు అభివృద్ధి చేయడం చేతకాదని, దానిని ఎలా అడ్డుకోవాలనేదే ఎప్పుడూ ఆయన మదిలో మెదలుతూ ఉంటుందని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అభివృద్ధి దేవుడెరుగు.. గ్రామాల్లో సమస్యలు కూడా తెలుసుకోలేదని విమర్శించారు. నరేందర్‌రెడ్డి కొడంగల్ వచ్చాకనే అభివృద్ధి పనులు జరిగాయన్నారు.

రోడ్ షోకు జన ప్రభంజనం…
కొడంగల్ పట్టణంలో కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. కొడంగల్ మొత్తం గులాబీమయంగా మారింది. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు 30 వేలకుపైగా పాల్గొనడంతో పట్టణంలోని అంబేద్కర్ కూడలి జనంతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వెళ్లే రహదారులు 5 కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి. కొడంగల్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాలో బాబుకు అడ్రస్ ఉండదు : హోం మంత్రి నాయిని
తెలంగాణ ఎలక్షన్ల కోసం చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చిండంట. ఆ డబ్బులతో కాంగ్రెస్సోళ్ళు ఓట్లు కొంటారంట. బాబూ నీకు తెలంగాణలో ఏం పని. ముందు నీ ఆంధ్రా సంగతి చూసుకో. ఆంధ్రలో నీ అడ్రస్ లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు. అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండ సీఎం సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎప్పటికి గడ్డంకుమార్‌గానే మిగిలిపోతాడని పేర్కొన్నారు.

అనైతిక పొత్తులను ప్రజలు నమ్మరు: మంత్రి హరీశ్‌రావు
అనైతిక పొత్తులను ప్రజలు నమ్మరని భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో బుధవారం సీఎం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అమరావతి, ఢిల్లీకో గులాంలు కొట్టడానికి తెలంగాణ తెచ్చుకోలేదన్నారు. రాహుల్ గాందీ కన్నుకొట్టే సిద్ధాంతం, చంద్రబాబు రెండు కండ్ల సిద్దాంతం మనకొద్దు.. తెలంగాణకు వెలుగులిస్తున్న కేసీఆర్ పాలననే మనకు ముద్దు అని పేర్కొన్నారు. పొత్తులతో వస్తున్న కూటమిలో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని విమర్శించారు.

కాంగ్రెస్,టీడీపీ రైతు వ్యతిరేక పార్టీలు : ఎంపీ జితేందర్ రెడ్డి
కాంగ్రెస్,టీడీపీ పార్టీలు రైతు వ్యతిరేకులుగా నిలిచారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సీఎం సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేండ్లలో ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయనీయకుండా కేసులు వేసిన సందర్భాలను ఎంపీ గుర్తు చేశారు. జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను సాగనివ్వకుండా కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చగొట్టాయని విమర్శించారు.

కూటమికి పరాభవం తప్పదు : ఎంపీ గుత్తా
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష నేతలంతా కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఎన్నికల్లో మహా కూటమికి పరాభవం తప్పదు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్ జతకట్టింది.. ఆ రెండు పార్టీల కుట్రలను భగ్నం చేయాలి. అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవరకొండ సీఎం సభలో ఆయన మాట్లాడుతూ 24గంటల కరెంటునిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని వివరించారు.

ఆడబిడ్డగా ఆదరించండి.. అభివృద్ధి చేస్తా :పద్మాదేవేందర్‌రెడ్డి
తనను ఆడ బిడ్డగా ఆదరించి గెలిపించాలని ప్రజలకు సేవ చేస్తానని మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ సీఎస్‌ఐ మైదానంలో బుధవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలో ఆమె మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో మెదక్ సెగ్మెంట్ అభివృద్ధి చెందిందని చెప్పారు.

ఆత్మగౌరవానికి, దళారులకు మధ్య ఎన్నికలు : వేముల వీరేశం
డిసెంబర్ 7 న జరిగే ఎన్నికలు ఆత్మగౌరవానికి, దళారులకు మధ్య జరుగుతున్నవని, తెలంగాణ ఆత్మగౌవాన్ని నిలపెట్టిన టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నకిరేకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన నకిరేకల్ నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధికి నోచుకుందని, రూ.2800కోట్ల అభివృద్ధిని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధమన్నారు. డిసెంబర్ 12న దళారీ సోదరులకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు.

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : రమావత్ రవీంద్రకుమార్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ప్రచార సభలో రవీంద్రకుమార్ మాట్లాడారు. దేశంలోనే అత్యధిక రిజర్వాయర్లు కలిగిన ప్రాంతంగా దేవరకొండ నిలిచిపోనుందని చెప్పారు.

దేశం గర్వించదగిన సీఎం కేసీఆర్ : పైళ్ల శేఖర్‌రెడ్డి
దేశం గర్వించదగిన సీఎం కేసీఆర్ అని భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి సభలో ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ర్టాల వారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారని పేర్కొన్నారు. మరోసారి ఆదరిస్తే రెట్టింపు అభివృద్ది చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.