
-ప్రొటెంస్పీకర్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన సభ -శాసనసభ్యులుగా 114 మంది ప్రమాణం -తొలుత సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం -ఆంగ్లంలో ఎనిమిది మంది, ఉర్దూలో ముగ్గురు సభ్యులు.. -వేర్వేరు కారణాలతో హాజరుకాని ఐదుగురు సభ్యులు -ప్రతిపక్ష సభ్యుల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్
స్వరాష్ట్రంలో రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణంచేశారు. ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. అనంతరం సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించనున్నట్టు ప్రొటెంస్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటించారు. తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ లేవగానే సభ్యులంతా బల్లలుచరుస్తూ అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణం స్వీకరించారు. తర్వాత ప్రొటెంస్పీకర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. స్పీకర్ చైర్‌కు ఎడమవైపు నుంచి కిందకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి, తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు. అనంతరం మహిళాసభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తొలుత అజ్మీరా రేఖానాయక్ ఇంగ్లిష్‌లో ప్రమాణంచేశారు. తర్వాత సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ధనసరి అనసూయ, గొం గిడి సునీత, హరిప్రియ బానోత్, పద్మాదేవేందర్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొన్న అక్షరమాలను పరిగణనలోకి తీసుకొని వరుసగా ఒక్కోసభ్యుడితో ప్రొటెంస్పీకర్ ప్రమాణం చేయించారు. చాలామంది సభ్యులు దైవసాక్షిగా, కొందరు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణంచేశారు.
చివరి సభ్యుడిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తోనూ ప్రొటెం స్పీకర్ ప్రమా ణం చేయించారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక్కోసభ్యుడి పేరు పిలువగా, స్పీకర్ పోడియం ఎదుట ఏర్పాటుచేసిన మైక్ వద్దకు వచ్చి ప్రతిసభ్యుడు ప్రమాణపత్రాన్ని చదివారు. అనంతరం వారికి ఎమ్మెల్యే సర్టిఫికెట్ అం దజేశారు. ప్రమాణం అనంతరం ప్రతిసభ్యుడు సీఎం కేసీఆర్‌కు అభివాదంచేస్తూ ప్రొటెం స్పీకర్ చైర్ వద్దకు వెళ్లారు. ప్రొటెం స్పీకర్ వారికి అభినందనలు తెలిపాక రిజిస్టర్లో సం తకాలు చేశారు. సభ్యులందరికీ ప్రత్యేక మెటీరియల్‌తో కూ డిన బ్యాగ్‌లను అందజేశారు. బ్యాగ్‌లో భారత రాజ్యంగం, అసెంబ్లీ నియమ, నిబంధనలను తెలిపే పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అందించారు. ప్రత్యేక బ్యాగులో దాదాపుగా 17 రకాల వస్తువులు, పుస్తకాలు అందించారు. వీటితో పాటుగా తిరుపతి డైరీ, లడ్డూలు అందజేశారు. సభ్యుల సమాచారాన్ని సేకరించే బయోడేటా ఫారాలు, ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్స్ అందజేశారు. ప్రమాణం అనంతరం సభ్యులను సహచరులు అభినందించారు. సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదావేశారు. వివిధ కారణాలతో ప్రమాణ స్వీకారానికి ఐదుగురు సభ్యులు హాజరుకాలేదు. ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, బీజేపీ సభ్యుడు రాజాసింగ్, టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ సభ్యుడు మాధవరం కృష్ణారావు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వీరంతా శుక్రవారం ప్రమాణం స్వీకరించనున్నారు.
ప్రతిపక్ష సభ్యులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు సభామర్యాదలు పాటిస్తూ, సభ హూందాతనం పెంచేందుకు చొరవ తీసుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రత్యేకతను మరోమారు చాటుకున్నారు. గన్‌పార్క్‌వద్ద అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ఉదయం 11:25 గంటలకు అసెంబ్లీలోకి సీఎం కేసీఆర్ వచ్చారు. నేరుగా ప్రతిపక్ష సభ్యుల స్థానాల వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కరచాలనంచేసి శుభాకాంక్షలు తెలిపారు. మల్లు భట్టి విక్రమార్కతోపాటు ఇతర సభ్యులతో కరచాలనం చేసి, అభినందనలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులకు నమస్కరిస్తూ వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు.

పవిత్రహృదయం సాక్షిగా కేటీఆర్ ప్రమాణం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో కొందరు పవిత్ర హృదయంసాక్షిగా ప్రమాణం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఈటల రాజేందర్, చంటి క్రాంతికిరణ్, నోముల నర్సింహయ్య, పొదెం వీరయ్య, సోలిపేట రామలింగారెడ్డి, ధనసరి అనసూయ, జగదీశ్‌రెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, అంజయ్యయాదవ్, రసమయి బాలకిషన్, కాలె యాద య్య, జైపాల్‌యాదవ్ పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. మిగిలిన సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
ఎనిమిది మంది ఇంగ్లిష్‌లో, ముగ్గురు ఉర్దూలో.. తెలుగుతోపాటు ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లోనూ ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకరించారు. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కాలేరు వెంకటేశ్, షకీల్ అహ్మద్, ఎంఐఎం సభ్యుడు అహ్మద్బిన్ అబ్దుల్లా బలాల, అజ్మీరా రేఖనాయక్, హరిప్రియ బానోత్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంగ్లిష్‌లో ప్రమాణంచేశారు. ఎంఐఎం సభ్యులు కౌసర్ మొహినుద్దీన్, సయ్యద్ అహ్మద్ పాషాఖా ద్రీ, మహ్మద్ మోజంఖాన్‌లు ఉర్దూలో ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారంలో సైడ్‌లైట్స్ -అసెంబ్లీకి టీఆర్ఎస్ సభ్యులంతా గులాబీ కండువాలతో హాజరయ్యారు. సభ ప్రారంభానికి పదినిమిషాల ముందే తమ స్థానాల్లో అసీనులయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు తర్వాత వచ్చారు. సభ్యులకు స్థానాలు కేటాయించకపోవడంతో, ఎక్కడైనా కూర్చొవచ్చని ప్రొటెం స్పీకర్ సూచించారు. టీఆర్ఎస్ సభ్యలుంతా ఒకవైపు, కాంగ్రెస్ సభ్యులంతా మరోవైపు కూర్చున్నారు. -ప్రమాణస్వీకారం అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మరికొందరు సభ్యులు సీఎం కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లగా, సీఎం కేసీఆర్ వారితో కరచాలనం చేసి అభినందించారు. కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ సభ్యులు, టీఆర్ఎస్ సభ్యులంతా ప్రమాణం చేసిన తర్వాత సీఎం కేసీఆర్‌కు నమస్కరించారు. -అనారోగ్యం కారణంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వీల్‌చైర్‌లో సభకు హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ ముం తాజ్ అహ్మద్‌ఖాన్ అనుమతితో వీల్‌చైర్‌లో కూర్చొనే ప్రమాణం చేశారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం సభ్యులకు అభివాదం చేస్తూ బయటికి వెళ్లారు. -ప్రమాణం అనంతరం సభ్యులతో కేటీఆర్, హరీశ్‌రావు ఇతర సీనియర్ సభ్యులు కరచాలనం చేసి అభినందించారు. -కాంగ్రెస్ సభ్యుడు ఆత్రం సక్కు ప్రమాణం చేస్తున్న కమ్రంలో దైవసాక్షిగా అనే పదాన్ని పలుకలేదు. అసెంబ్లీ సిబ్బంది దైవసాక్షిగా అనే పదాన్ని చేర్చుతూ మరోమారు ఆత్రం సక్కుతో ప్రమాణపత్రాన్ని చదివించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను, శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశసార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని.. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.