Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొలువుదీరిన మన హైకోర్టు

-ఎన్నాళ్లో వేచిన ఉదయం..
-సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
– రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
-హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకమైన తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకరించారు. అనంతరం హైకోర్టులో 12 మంది జడ్జీలు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జనవరి ఒకటో తేదీనుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఉనికిలోకొచ్చాయి. గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం తొలుత రాజ్‌భవన్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి విజయవాడలో ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో ప్రమాణం చేయించారు.

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకట్రాంరెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ప్రశాంత్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, డీజీపీ మహేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నల్సార్ యూనివర్సిటీ అధికారులు తదితరులు హాజరయ్యారు.

హైకోర్టులో 12 మంది జడ్జీల ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం అనంతరం హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్న చీఫ్ జస్టిస్ తొట్టథిల్ బీ రాధాకృష్ణన్.. అక్కడ 12 మంది హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. రాజ్యాంగం ప్రకారం తమకు కేటాయించిన విధులను భయం, పక్షపాతం లేకుండా నిర్వహిస్తామని జస్టిస్‌లు రాఘవేంద్రసింగ్ చౌహాన్, వీ రామసుబ్రమణియన్, పులిగోరు వెంకట సంజయ్‌కుమార్, ఎంఎస్‌ఆర్‌ఎస్ రామచంద్రారావు, ఎడవల్లి రాజశేఖర్‌రెడ్డి, పొనుగంటి నవీన్‌రావు, చల్లా కోదండరాంచౌదరి, బులుసు శివశంకరరావు, డాక్టర్ షమీమ్ అక్తర్, పొట్లపల్లి కేశవరావు, అభినందన్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్ ప్రమాణం చేశారు. న్యాయమూర్తుల ప్రమాణం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి తదితరులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత న్యాయమూర్తుల చాంబర్లను సీఎం సందర్శించారు. హైకోర్టులో జరిగిన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రామచంద్రారావు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ న్యాయవాదులు, తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు సునీల్‌గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంకే ముకీద్, మధుసూదన్‌రావు, జయకర్, లక్ష్మణ్‌కుమార్, అనంతసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు హరిప్రీత్, ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, సుంకరి జనార్దన్‌గౌడ్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, కల్యాణ్‌రావు, బాల్‌రాజ్, శ్రీనివాస్, భారీ సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు న్యాయవాదుల స్వాగతం

న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డికి తెలంగాణ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.