Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొలువుల భర్తీకి తొలిగిన అడ్డంకి

-కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం
-33 జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు
-ములుగు, నారాయణపేట జిల్లాలకు గుర్తింపు
-చార్మినార్‌ జోన్‌కు వికారాబాద్‌ జిల్లా
-గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
-జోన్ల ఆధారంగా క్యాడర్‌ కేటాయింపులు
-క్యాడర్‌ వర్గీకరణ అనంతరం నియామకాలు
-కొత్త జోన్ల ప్రకారమే కొత్త ఉద్యోగాల భర్తీ
-95% కొలువులు ఇక తెలంగాణ యువతకే

కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్‌ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలంగాణ ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారు. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. గ్రూప్‌-1 పోస్టులు కూడా మల్టీ జోనల్‌ స్థాయిలోనే నియమిస్తారు. దీనివల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే లభిస్తాయి. జిల్లా స్థాయి పోస్టుల్లో కూడా గ్రామీణ ప్రాంత జిల్లాల యువతకు ప్రాధాన్యం లభించే అవకాశం కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగింది. మల్టీ జోనల్‌ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి.

రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు ఇంతకాలంగా ఉన్న ప్రధానమైన అడ్డంకి తొలిగిపోయింది. జోన్ల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ములుగు, నారాయణపేట జిల్లాలను గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేశారు. దీంతో మొత్తం 33 జిల్లాలకు గుర్తింపు లభించింది. ఈ మార్పుల ఆధారంగా జోనల్‌ వ్యవస్థలో కేంద్రం మార్పులుచేసింది. సుదీర్ఘకాలంగా కేంద్ర హోంశాఖలో పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌ ఎట్టకేలకు క్లియర్‌ అయింది. కొత్త జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి సంతకం చేయడంతో కేంద్రం గెజిట్‌ను విడుదలచేసింది.

రెండు మల్టీ జోన్లు.. ఏడు జోన్లు తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటుచేసిన 33 జిల్లాల ప్రాతిపదికన కొత్త జోన్ల వ్యవస్థను ఏర్పాటుచేస్తూ.. 95% ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతి ఉత్తర్వులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహించి తొలుత 31 జిల్లాలతో కొత్త జోనల్‌ వ్యవస్థకు రూపకల్పనచేశారు. 2018 ఆగస్టు 29న ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో కొత్త జోనల్‌ వ్యవస్థ ఏర్పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ రెండు జిల్లాలతోపాటు జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్లో కలుపుతూ కొత్త సవరణలను 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఈ ప్రతిపాదనలపై రాజ్యాంగంలోని 371 డీలోని 1,2 క్లాజుల కింద సంక్రమించిన అధికారాలతో తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌ -2018 సంవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్రవేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

జోన్లవారీగా క్యాడర్‌ విభజన
ఉద్యోగ నియామకాలు జరగాలన్నా, పదోన్నతులు లభించాలన్నా క్యాడర్‌ స్ట్రెంత్‌ కీలకం. ఇప్పటిదాకా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పాత పద్ధతిలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించారు. జిల్లాలవారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ వర్గీకరణ జరుగలేదు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి రావడంతో కొత్త జోన్ల వ్యవస్థను అమలుచేయడానికి వీలుగా జిల్లాలవారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ నిర్ణయిస్తారు. జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా తుది కేటాయింపులు చేస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ)కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను నోటిఫై చేస్తూ జీవో విడుదల చేస్తారు. ఇందుకోసం ఫైల్‌ను రూపొందించి ముఖ్యమంత్రి వద్దకు పంపించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం కాగానే జీవో విడుదలవుతుంది. అనంతరం క్యాడర్‌ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలు రూపొందిస్తారు. రాష్ట్ర స్థ్దాయి పోస్టులు, మల్టీ జోనల్‌ పోస్టులు, జోనల్‌ పోస్టులు, జిల్లా పోస్టులుగా మొత్తం క్యాడర్‌ను విభజిస్తారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు, ఏ జోనల్‌కు ఎన్ని పోస్టులు, మల్టీ జోనల్‌ పోస్టులేమిటి, రాష్ట్రస్థాయి పోస్టులేమిటన్నదానిపై స్పష్టత ఇస్తారు. దీనివల్ల నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ సరళీకృతమవుతుంది. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌వారీగా క్యాడర్‌ వర్గీకరణ జరుగుతుంది. అనంతరం నియామకాలకు లైన్‌ క్లియర్‌ అవుతుంది.

నాన్‌ లోకల్‌ పేరుతో తెలంగాణలో తిష్ట
పాత జోనల్‌ విధానంలో ఉన్న జనరల్‌ కోటాను ఆంధ్రా నేతలంతా నాన్‌లోకల్‌ కోటా కింద మార్చి తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలను తమ ప్రాంతం వారికి కట్టబెట్టారు. నాన్‌లోకల్‌ కోటా పేరుతో నియామకమై తెలంగాణలోనే తిష్ట వేసిన వాళ్లు ఇప్పటికీ వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆరు జోన్లు ఉండగా, తెలంగాణలో 5, 6 జోన్లు ఉండేవి. ఉద్యోగ నియామకాలలో 20% ఓపెన్‌ కోటా కింద నియామకాలు జరిగేవి. నిజాయితీగా ఓపెన్‌ కోటా కింద ఈ 20% నియామకాలు చేపడితే తెలంగాణ, ఆంధ్రా వాళ్లందరికీ కలిపి ఉద్యోగాలు వచ్చేవి. కానీ నాడు ఓపెన్‌ కోటాను నాన్‌లోకల్‌గా మార్చి ఆంధ్రా వాళ్లే జిల్లా, జోనల్‌ క్యాటగిరీ పోస్టులను కొట్టేసి తెలంగాణలో తిష్ట వేశారు. ఇప్పుడు తెలంగాణలో 95% రాష్ట్ర యువతకే ఉద్యోగాలు వచ్చేలా జోన్ల వ్యవస్థ ఏర్పడింది. ఓపెన్‌ కోటాను 5 శాతానికి పరిమితంచేశారు. దీంతో ఆయా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పరిధిలో ఉన్న నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కొత్త జోన్ల ప్రకారమే నియామకాలు
కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్‌ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలంగాణ ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారు. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. గ్రూప్‌-1 పోస్టులు కూడా మల్టీ జోనల్‌ స్థాయిలోనే నియమిస్తారు. దీనివల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే లభిస్తాయి. జిల్లా స్థాయి పోస్టుల్లో కూడా గ్రామీణ ప్రాంత జిల్లాల యువతకు ప్రాధాన్యం లభించే అవకాశం కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగింది. మల్టీ జోనల్‌ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీచేయాలని నిర్ణయించారు. ఈ ఉద్యోగాలన్నీ కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే భర్తీ అవుతాయి.

ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపయోగ పడే విధంగా జోనల్‌ వ్యవస్థ లేక పోవడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ముఖ్యంగా గ్రూప్‌-1, గ్రూప్‌ 3 ఉద్యోగాల భర్తీ జరుగలేదు. ఒక్కసారి పాత జోనల్‌ విధానంలో గ్రూప్‌-2, గ్రూప్‌ 4 ఉద్యోగాలను భర్తీ చేశారు. 2018లో రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం గ్రూప్‌ 1 ఉద్యోగాలు కూడా మల్టీ జోనల్‌లోకి వచ్చాయి. జిల్లాల పునర్విభజన అనంతరం 31 జిల్లాలే అప్పటి ఉత్తర్వుల్లో చేర్చారు. తర్వాత ప్రజల కోరిక మేరకు మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో.. మరోసారి ప్రతిపాదనలు మార్చి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఆగిపోయాయి. తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో గ్రూప్‌1తోపాటు అన్ని గ్రూప్‌ ఉద్యోగాలు, ఉపాధ్యాయ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు భర్తీచేయడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు అధికారులు శాఖలవారీగా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించుకొని ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడింది.

సవరించిన ప్రతిపాదనల ప్రకారం జోనల్‌ విధానం ఇలా
మల్టీజోన్‌ జోన్‌ జిల్లా
మల్టీజోన్‌-1 కాళేశ్వరం జోన్‌-1 కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు
బాసర జోన్‌-2 అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల
రాజన్న జోన్‌-3 కరీంనగర్‌, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి
భద్రాద్రి జోన్‌-4 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్

మల్టీజోన్‌-2 యాదాద్రి జోన్‌-5 సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
చార్మినార్‌ జోన్‌-6 మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
‌ జోగులాంబ జోన్‌-7 మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్

‌ పోలీస్‌ జోన్లు
మల్టీజోన్‌ జోన్‌ పోలీస్‌ జిల్లా/కమిషనరేట్స్
‌ మల్టీ జోన్‌ 1 కాళేశ్వరం జోన్‌-1 జయశంకర్‌ భూపాల్‌పల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌, ములుగు
బాసర జోన్‌-2 అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, జగిత్యాల
రాజన్న జోన్‌-3 కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
‌ భద్రాద్రి జోన్‌-4 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్

మల్టీజోన్‌-2 యాదాద్రి జోన్‌-5 సిద్దిపేట, నల్లగొండ రాచకొండ పోలీస్‌ కమిషనరేట్
‌ చార్మినార్‌ జోన్‌-6 హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సంగారెడ్డి, వికారాబాద్‌.
జోగులాంబ జోన్‌-7 మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూల్

వికారాబాద్‌ కల నెరవేరింది
సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి కృతజ్ఞతలు
వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్లో కలపడం పట్ల చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వికారాబాద్‌ ప్రజల కల ఫలించిందని అన్నారు. భౌగోళికంగా తమకు సమీపంలో ఉన్న చార్మినార్‌ జోన్లో చేరడంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో వికారాబాద్‌ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.