Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమివస్తే శనే!

-టీఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం ఏదికావాలో ప్రజలే తేల్చుకోవాలి: మంత్రి హరీశ్‌రావు
-తెలంగాణపై మళ్లీ ఆంధ్రశక్తుల కుట్రలు
-బాబు, లగడపాటి రహస్య ఎజెండా ఏంది?
-వాళ్ల కుట్రలను తెలంగాణ ప్రజలే తిప్పికొట్టాలి
-కేసీఆర్‌కు మద్దతుతోనే బంగారు తెలంగాణ
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూటమి కొనగలదా?
-కోదండరాం.. 11న కేసీఆర్ సిక్సర్లు కొడుతుంటే నువ్వు టీవీల ముందు కూర్చొని చప్పట్లు కొట్టాలె
-ఆంధ్రోళ్ల చేతికి తెలంగాణ పోతే గోసపడుతం
-కేసీఆర్ అడుగులో అడుగేస్తే బాగుపడుతం
-ప్రజా ఆశీర్వాదసభల్లో మంత్రి హరీశ్‌రావు

కూటమికి ఓటేస్తే శనేశ్వరమేనని, అదే టీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే కాళేశ్వరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, మారుమూల ప్రాంతాలకు కూడా సాగునీరు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. చంద్రబాబు తొమ్మిదేండ్లు ఉంటే మన రాష్ర్టానికి కరువే కరువు. అటువంటి శనేశ్వరం మనకు కావాలా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కావాలో శనేశ్వరం కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. సబ్బండవర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ వివిధ పథకాలను అమలుచేస్తున్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలువడంతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయేది 100 శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఇల్లంద, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గంలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ, యాదాద్రిభువనగిరి జిల్లా అలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలు, భువనగిరి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మళ్లీ కుట్రలు మొదలు
తెలంగాణపై మళ్ల కుట్రలు ప్రారంభమైనయ్. బాబు, లగడపాటి బయల్దేరిండ్లు. ఆనాడు తెలంగాణను అడ్డుకోవటానికి బాబు, లగడపాటి ఎన్ని కుట్రలు చేసిన్లో తెలుసు. మళ్లీ ఆంధ్రాశక్తులన్నీ ఒకటై కుట్రలు పన్నుతున్నయి. ఏ పేపరు చూసినా ఫుల్‌యాడ్సే. టీవీ పెడితే కాంగ్రెస్.. కాంగ్రెస్! ఎక్కడివీ పైసలు? నోట్లకట్టలు ఆంధ్రా నుంచి బాబు పంపుతుంటే అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తుండ్లు. ఊర్లలో డబ్బులు పంచుతున్నరు. క్వార్టర్ సీసాలు పెట్టెలుపెట్టెలు దించుతున్నరు. ఎందుకు పంచుతున్నరు? బాబు, లగడపాటి రహస్య ఎజెండా ఏంది? వీళ్ల కుట్రల వెనుక ఏమున్నదో తెలంగాణ ప్రజలు గమనించాలె. లేకుంటే దెబ్బతింటం. కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే బాబు, లగడపాటి కుట్రలను తిప్పికొట్టాలి. ప్రాజెక్టులను అడ్డుకునే చంద్రబాబులాంటివారితో కాంగ్రెస్ కూటమి కట్టి మరోసారి తెలంగాణ ద్రోహానికి పాల్పడే కుట్రచేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్, చంద్రబాబు, కూటమి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కూటమి పార్టీలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతోపాటు పరాయిపాలనను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రాబాబు డబ్బులతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనాలనే కుట్ర చేస్తున్నారు. అది ముమ్మాటికీ సాధ్యం కాదు.

ఆరోజు నోరు మూసుకున్నది ఈ నేతలే
ఆనాడు తెలంగాణ ఇవ్వాలని అడిగితే, అప్పటి సీఎం వైఎస్.. తెలంగాణ ఏమన్నా బీడీనా.. సిగరెట్టా! అంటే వెనకబెంచీల కూర్చొని కిసకిస నవ్వింది పొన్నాల లక్ష్మయ్య. చప్పట్లుకొట్టింది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్పప్పుడు రాసిపెట్టుకో.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అన్నప్పుడు నోరుమూసుకుని కూర్చుంది ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలే. మళ్లీ ఇప్పుడు కూటమి గెలిచి ఆంధ్రోళ్ల చేతికి తెలంగాణ పోతే గోసపడుతం. కేసీఆర్ అడుగులో అడుగేస్తే బాగుపడతం. బాబు చేయి పట్టుకుంటే ఆగమైతం. కాంగ్రెసోళ్లది చేతులు కట్టుకుని నిలబడే బతుకు. మొన్న టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ కూటమి గెలిస్తే అమరావతి నుంచి తెలంగాణ పాలన చేస్తమన్నడు. తెలంగాణ తెచ్చుకున్నది అమరావతికి గులాంగిరీ చేయడానికా?

కరంటు ఉండాల్నంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి
కాంగ్రెస్ గెలిస్తే యాదాద్రి విద్యుత్ కేంద్రం మూసేస్తానని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటున్నడు. మన బావి దగ్గర 24 గంటల కరంటు రావాల్నంటే టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలి.. దొంగరాత్రి కరంట్ రావాల్నంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి. కాళేశ్వరం నీళ్లు వస్తే మూడు పంటలు పండించుకోవచ్చు. ప్రజల ఆశీర్వాదం, కేసీఆర్ దీవెనలతో కాళేశ్వరం పనులను నేనే చూస్తున్న. ఇప్పటివరకు మెజార్టీ పనులు పూర్తయ్యాయి. గత నీళ్ల మంత్రి పొన్నాల లక్ష్మయ్యలా హైదరాబాద్‌లో పండుకోలేదు. పెద్ద నీరడిలా పనిచేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కృషిచేస్తున్నా. పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు తక్కువైతయని కాళేశ్వరాన్ని ఆపాలని అడ్డుపడుతున్న చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకుంటడా? నోటికాడి బుక్కను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలి. తెలంగాణకు చంద్రబాబు అడ్డుపడుతున్నడనే కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నారు.

అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కిష్టయ్య ఆత్మ క్షోభించదా! సాగరహారం సందర్భంగా రబ్బర్ బుల్లెట్లు కాల్చి, లాఠీలు ఝళిపించి, ముళ్లకంచెలు వేసి ఉద్యమకారులను అణచివేసిన కాంగ్రెస్.. పవిత్రమైన ఆ ఆందోళనను మలినంచేసేలా మ్యానిఫెస్టోలో ఆ ఫొటో ముద్రించుకున్నది. దీనికి కూటమి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కూటమి పొత్తులు టీఆర్‌ఎస్ నెత్తిన పాలుపోశాయి. గద్దర్‌లాంటి వారు చంద్రబాబు బుల్లెట్లు దింపాడని చెప్పి.. ఇప్పుడు అదే చంద్రబాబు కడుపులో తలపెట్టడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. చంద్రబాబు అంటేనే నరహంతకుడు.. ఎన్‌కౌంటర్లు చేపించినవాడు. కరంట్ చార్జీలు తగ్గించాలని కోరితే.. ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపించాడు. అటువంటి చంద్రబాబుతో కోదండరాం పొత్తుకున్నందుకు మేధావివర్గం సిగ్గుపడుతున్నది. కేసీఆర్ ఇంజ్యూర్డ్ బ్యాట్స్‌మన్ కాదు మిస్టర్ కోదండరాం.. ఇరగదీసే బ్యాట్స్‌మన్. 11వ తేదీన డబ్బాలు ఇప్పిన తరువాత కేసీఆర్ సిక్సర్లు కొడుతుంటే.. టీవీ ముందు కూర్చుండి కోదండరాం చప్పట్లు కొట్టాలే. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుపడ్డ చంద్రబాబు మంచోడంటూ కోదండరాం చెప్పడం పెద్ద జోక్. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాట, కూటమిలో అవకాశవాదాలను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కూటమికి ఓటువేయడం వల్ల ఒరిగేదేమీలేదు.

పీఎఫ్ ఉన్న బీడీకార్మికులందరికీ పింఛన్లు
రాష్ట్రంలో 2014 నాటికే అందుతున్న బీడీ కార్మికుల పింఛన్లను అధికారంలోకి వచ్చిన తర్వాత పీఎఫ్ కార్డు ఉన్నవారందరికీ ఇవ్వబోతున్నం. వాళ్లకు కూడా రూ.2016 పింఛను అందించి ఆదుకుంటాం. కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయి.

వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు
వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీటితో ప్రజల కాళ్లు కడుగుతం. ప్రాజెక్టులు ఆపుతానంటున్న చంద్రబాబుకు తెలంగాణలో స్థానంలేదు. బాబుకు, ఆయన కూటమి పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాయి. ఇక్కడున్న పార్టీలకు అవి కనిపించకపోవటం విచారకరం. ఏపీలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీచేస్తానని చెప్పి మోసంచేశాడు. మాట తప్పేవారు కూటమి నాయకులైతే.. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తి సీఎం కేసీఆర్. కాంగ్రెసోళ్లు గెలిస్తే ఏసీ రూముల్లో ఉంటారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే కాల్వలు, వాగులు, చెలకల వద్దకు వచ్చి పనులు చేస్తారు.

టీడీపీకి ఆ మూడు పదవులు ఎందుకంటే..
కూటమి గెలిస్తే టీడీపీ మూడు పదవులు తీసుకుంటుందట! ఒకటి.. నీళ్ల మంత్రి.. ఇక్కడి ప్రాజెక్టులను పండబెట్టి.. ఆంధ్రకు నీల్లు మలపనీకి! రెండోది హోంశాఖనట! అంటే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపకుండా కాపాడుకునేందుకా! మూడోది పరిశ్రమలశాఖనట! ఇక్కడి పరిశ్రమలను మూతబెట్టి, నిరుద్యోగ యువతను రోడ్డున పడేసి, ఫ్యాక్టరీలు ఆంధ్రకు తీసుకెళ్లేందుకా? ఇందుకేనా కూటమి ఉన్నది?.

వాస్తవాలు తెలుసుకుని టీఆర్‌ఎస్‌ను ఆదరించండి: ఎంపీ కవిత
జగిత్యాల, నమస్తే తెలంగాణ/రాయికల్/మేడిపల్లి/ కథలాపూర్: నాలుగేండ్లలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను చూసి వాస్తవాలను తెలుసుకొని టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం రాయికల్, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆమె మాట్లాడుతూ పింఛన్‌దారుల వయసు 58 ఏండ్లకు కుదిస్తామని, బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన పనులన్నీ పేద ప్రజల కోసమేనని అలాంటి కేసీఆర్‌ను గద్దె దించడానికే కూటమి ఏర్పాటైందని, ఆ కూటమికి ఓట్లతో బుద్ధి చెప్పాలని సూచించారు. జగిత్యాలలో సంజయ్‌ని, వేములవాడలో రమేశ్‌బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఆంధ్రా పెత్తందార్లకు గుణపాఠం చెప్పాలి: మంత్రి ఈటల
శంకరపట్నం: ఆంధ్రా పెత్తందార్లకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం చింతగుట్ట, తాడికల్, లింగాపూర్, మెట్‌పల్లి గ్రామాల్లో రసమయి బాలకిషన్‌కు మద్దతుగా రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక రెప్పపాటు కరంటు పోకుండా చేయడం కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యపడిందన్నారు. 30 ఏండ్లు కాంగ్రెస్, 17 ఏండ్ల టీడీపీ పాలనలో ఏడు గంటల కంటే ఎక్కువ కరంటు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని, రసమయిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

ప్రజా కూటమికి బుద్ధి చెప్పాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆత్మకూర్.ఎస్: ఎన్నికల్లో ప్రజాకూటమికి తగిన బుద్ధిచెప్పాలని మంత్రి, సూర్యాపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం దుబ్బతండాలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. తండా మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను తట్టుకోలేక దొంగలు ఒక్కటై కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, వారిని గ్రామాలకు రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటువేసి గెలిపిస్తే పింఛన్లను రెట్టింపు చేస్తామన్నారు. కాళేశ్వరం ద్వారా నీరు తీసుకొచ్చి మండలంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.