నిత్యం పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రయాణించే సీఎం కేసీఆర్..హఠాత్తుగా ఓ గ్రామ నడిబొడ్డున జనం మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని వారిలో ఒకరిలా మారిపోయారు. సమస్యలను సావధానంగా విని అప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆదివారం మెదక్ జిల్లా వర్గల్ మండలంలోని పాములపర్తిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం ఇదే మండలంలోని మర్కుక్ గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. తిరిగి వస్తుండగా పక్క గ్రామమైన పాములపర్తివాసులు తమ ఊరికి రావాలంటూ కాన్వాయ్ వెళ్తుండగా ఆహ్వానించారు. అనుకోని అతిథిలా హఠాత్తుగా సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గ్రామానికి వచ్చారు. చౌరస్తాలో చెట్టుకింద కుర్చీలో కూర్చుని ప్రజలతో సమావేశమయ్యారు.

-పాములపర్తిలో జనంతో మమేకమైన సీఎం కేసీఆర్ -ఆకస్మికంగా సందర్శన.. గ్రామ ప్రజలతో సంభాషణ -సమస్యలపై ఆరా.. నిధుల మంజూరుకు ఆదేశాలు -కృత్రిమ చేతులు పెట్టిస్తానని వికలాంగుడిని తీసుకెళ్లిన సీఎం గ్రామసభను తలపించిన కార్యక్రమంలో జనంతో 45 నిమిషాలు ముచ్చటించారు. గ్రామంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా, అప్పటికప్పుడే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీచేశారు. గ్రామంలో పశువైద్యశాల, రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్, ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణం, రూ.10 లక్షలతో వైకుంఠధామం, రెండు అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగు కాల్వల కోసం నిధులు మంజూరు చేశారు. మూడు బోర్లు, పంపుసెట్ల బిగింపు, పంచాయతీ భవనానికి రెండు అదనపు గదుల నిర్మాణం, రెండు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, బస్‌షెల్టర్, పోచమ్మ, బీరప్ప ఆలయాల వరకు మట్టి రోడ్ల నిర్మాణంతోపాటు పాతూరులో పైపులైన్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో 150 ఇండ్లతో బలహీన వర్గాలకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారు.
స్థలం సమకూరగానే మూడున్నర లక్షల రూపాయలతో పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేయాలని కోరారు. మీరు కోరిన పనులకు నిధులిస్తున్నా.. గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, సర్పంచ్ మ్యాకల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


వికలాంగుడికి భరోసా కల్పించిన సీఎం భువనగిరికి చెందిన కనకస్వామికి ఓ ప్రమాదంలో రెండు చేతులు పోయాయి. ఆదివారం పాములపర్తిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా గ్రామానికి సీఎం రావడంతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించాలని విజ్ఞప్తి చేశాడు. చలించిన సీఎం కేసీఆర్.. కృత్రిమ చేతులు అమర్చేందుకు అవసరమైన వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కనకస్వామిని కాన్వాయ్‌లో వెంట తీసుకువెళ్లారు. మరో ఇద్దరు వికలాంగుల భార్యలు బోయిని సావిత్ర, వడ్ల మమత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.