-అధికారులు, ఉద్యోగుల సర్దుబాటు
-ఉద్యోగుల బదిలీ కష్టాలకు చెల్లుచీటీ
-కొత్త జిల్లాలవారీగా సిబ్బందిపై స్పష్టత
-కలకాలం యువత గుండెల్లో కేసీఆర్
-ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అద్భుతం
-ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం
-ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు
-పలు సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

రాష్ట్రంలో ఉద్యోగ యంత్రాంగ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కొత్త రాష్ట్రంలో పరిపాలనపరంగా చేసిన మార్పు చేర్పులకు అనుగుణంగా, ఉద్యోగులను- పోస్టులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం, జిల్లాలను పునర్విభజించి, 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి రెండు జోన్లు (5, 6) మాత్రమే ఉండేవి. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించి ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటుచేసింది. పరిపాలన ప్రక్రియ పూర్తయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదంలో జాప్యం వల్ల ఉద్యోగుల పునః పంపిణీ మాత్రం జరగలేదు. కొత్త జోనల్ విధానానికి కేంద్రం కొద్ది రోజుల క్రితమే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ప్రస్తుతమున్న ఉద్యోగులు, సిబ్బందిని కొత్త జిల్లాలు- కొత్త జోన్ల మేరకు కేటాయింపు చేయాలని, ఉద్యోగ ఖాళీలను కూడా కొత్త జోన్లు- కొత్త జిల్లాల ప్రాతిపదికనే భర్తీ చేయాలని విన్నవించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టి సుదీర్ఘంగా, సమగ్రంగా చర్చించారు. ఉద్యోగుల విజ్ఞప్తిని మన్నిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పోస్టులను 33 జిల్లాలవారీగా పునః కేటాయించాలని ఉన్నతాధికారులను క్యాబినెట్ ఆదేశించింది. ఆ మేరకు అధికారులు- ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సత్వరమే చేపట్టాలని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి, కొత్త జిల్లాలు- కొత్త జోన్లు వచ్చినప్పటికీ ఉద్యోగులు దాదాపుగా ఎక్కడివారక్కడే పని చేస్తున్నారు. సమూల ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ (తాత్కాలిక) ప్రాతిపదికన ఉద్యోగులతో సేవలు పొందింది. ఇది పూర్తయితే ఆర్డర్ టు సర్వ్ పద్ధతి పూర్తిగా రద్దవుతుంది.
జిల్లాల్లో ప్రభుత్వశాఖల్లో పోస్టులవారీగా ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత వస్తుంది.
-ఉద్యోగుల కొరత సమస్య తీరుతుంది. ఉద్యోగుల సేవలను పూర్తిగా వినియోగించుకోవచ్చు.
-ఆర్డర్ టూ సర్వ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఆప్షన్లు ఇచ్చి, స్వస్థలాలు, లేదా సొంత జిల్లాలకు పంపిస్తారు.
-ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగస్థులైన భార్యభర్తల్లో కొత్త జిల్లాల ఏర్పాటుతర్వాత భార్య ఒక జిల్లాలో భర్త మరో జిల్లాలో పనిచేస్తున్నారు. తాజాగా భార్యభర్తలు ఒకే జిల్లాలో ఉండనున్నారు.
-అన్ని శాఖల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ క్యాడర్లో కొత్త పోస్టుల మంజూరుకు అవకాశం కలుగుతుంది.
-జిల్లాల్లో ఒకే అధికారి రెండు మూడు పోస్టులను నిర్వహిస్తున్నారు. కొన్నింటిలో ఇంచార్జీల పాలన కొనసాగుతున్నది. -ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఏర్పడుతుంది.
-పదోన్నతులు సత్వరమే కల్పించవచ్చు. అన్ని క్యాటగిరీల్లో, విభాగాలవారీగా పదోన్నతులు ఇవ్వవచ్చు.
-ప్రభుత్వ విభాగాలు, శాఖలు పటిష్ఠమవుతాయి. ప్రజలకు సత్వర సేవలందుతాయి.