Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొత్త జోన్లకు ఆమోదం

-రైతులకు రూ. 5 లక్షల జీవిత బీమా -రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు -రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీజోన్ల వ్యవస్థ ఏర్పాటు -పదోన్నతుల ద్వారానే రాష్ట్ర క్యాడర్ పోస్టుల భర్తీ -నాలుగేండ్లు ఒకచోట చదివితే లోకల్ -ఉద్యోగాల్లో 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ క్యాటగిరీ -ఒక్కో రైతుకు రూ. 2,271 ప్రీమియం -ఏడాదికి వెయ్యి కోట్ల చెల్లింపు -పంద్రాగస్టు నుంచి బీమా పత్రాల పంపిణీ -జూన్ రెండు నుంచి నామినీ పత్రాల స్వీకరణ -43 లక్షల మంది రైతులకు ప్రయోజనం -రైతు సమన్వయసమితికి ఎండీతో పాటు ఇతర సిబ్బంది మంజూరు -వైద్యశాఖలో బోధనా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు 65 ఏండ్లకు పెంపు -550 కోట్లతో గట్టు ఎత్తిపోతల -3277 కోట్లతో లింగంపల్లి రిజర్వాయర్ -దేవాదుల-తుపాకులగూడెం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు -ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ -రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలకు చర్యలు -నేడు ప్రధాని, హోం మంత్రితో భేటీ!

రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ క్యాటగిరీలుగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకానికి కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకాన్ని పంద్రాగస్టున ప్రారంభిస్తారు. వీటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా క్యాబినెట్ తీసుకొన్నది. వైద్య ఆరోగ్యశాఖలో బోధనా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో స్థానికత ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఖరారుచేసింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కనీసం నాలుగేండ్లపాటు ఒకేచోట చదవటాన్ని స్థానికతకు ప్రామాణికంగా తీసుకొంటారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధిలో అత్యంత కీలకమైన భూమిక నిర్వహిస్తున్న రాష్ట్ర రైతు సమన్వయ సమితికి మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు సిబ్బందిని నియమించాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. నీటిపారుదల రంగానికి సంబంధించి రెండు ముఖ్యమైన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రూ. 550 కోట్లతో ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, తుపాకులగూడెం బరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.

ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు, రైతు బీమా పథకాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం క్యాబినెట్ ఈ రెండు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. జోనల్ వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రివర్గ సమావేశానికి టీఎన్జీవోల గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి తెలియజేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 పేరాపై మరో సమావేశంలో చర్చిద్దామని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. జోనల్ వ్యవస్థకు క్యాబినెట్ ఆమోదం తెలుపడం పట్ల సంఘం నేతలు మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

జోగుళాంబ జోన్‌లోనే వికారాబాద్ జోనల్ వ్యవస్థపై చర్చ సందర్భంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపాలని వస్తున్న డిమాండ్‌పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. వికారాబాద్ గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతమని, దీనిని అర్బన్ ప్రాంతమైన చార్మినార్ జోన్‌లో కలిపితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రివర్గం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అర్బన్ ప్రాంత విద్యార్థులతో గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లు పోటీపడటం కష్టమని, ఉద్యోగాలు ఎక్కువశాతం అర్బన్ ప్రాంతాలవారికే వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికారాబాద్ జిల్లాను జోగుళాంబ జోన్‌లోనే కొనసాగించడం సరైందని మంత్రివర్గం తీర్మానించింది.

స్థానికత ఖరారు రాష్ట్రంలో స్థానికతపై కూడా మంత్రివర్గం స్పష్టత ఇచ్చింది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో ఆ ప్రాంతాన్ని స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తించాలని నిర్ణయించారు. ఏ కారణంతోనైనా కొందరు విద్యార్థులు నాలుగేండ్లు ఒకచోట చదువలేకపోతే విద్యార్థి తల్లిదండ్రుల స్థానికతను పరిగణనలోకి తీసుకొంటారు. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

జూన్ రెండు నుంచి నామినీ ప్రతిపాదనల స్వీకరణ రైతు బీమా పథకం కింద ఒక్కో రైతుకు రూ.2,271 వార్షిక ప్రీమియం చెల్లిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా పత్రాలను రైతులకు పంపిణీచేస్తారు. జూన్ రెండో తేదీ నుంచి రైతుల దగ్గరి నుంచి నామినీ ప్రతిపాదనలను స్వీకరిస్తారు. రైతులకు ఏడాదికి రూ.976 కోట్ల ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నది.

మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు -రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటు -జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు -పదోన్నతుల ద్వారా రాష్ట్ర క్యాడర్ పోస్టుల భర్తీ -1నుంచి 7వ తరగతి వరకు కనీసం నాలుగేండ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం అవుతుంది -అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ క్యాటగిరీలు ఉంటాయి. -రాష్ట్రంలోని 18-60 ఏండ్ల వయస్సున్న ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా పథకం వర్తిస్తుంది. ప్రతి రైతుకు రూ.2,271 చొప్పున ప్రతి ఏడాది ప్రీమియాన్ని ప్రభుత్వమే కడుతుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. -వైద్య ఆరోగ్యశాఖలో బోధనా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితి 58 నుంచి 65 ఏండ్లకు పెంపు -రాష్ట్ర రైతు సమన్వయసమితికి ఎండీతోపాటు ఇతర సిబ్బంది నియామకం -జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ఎత్తిపోతలకు ఆమోదం -దేవాదుల ప్రాజెక్టులో భాగంగా లింగంపల్లి రిజర్వాయర్‌కు ఆమోదం -దేవాదుల-తుపాకులగూడెం బరాజ్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు -కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పెరిగిన వ్యయానికి ఆమోదం

మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది రైతుబంధు పథకం అద్భుతమైన పథకం. రైతులను చాలా ప్రభావితం చేసింది. రైతుబంధు పథకంపై ఏమనుకొంటున్నారనే విషయంపై సర్వే చేయించాను. గొప్ప పథకమని, రైతులకు ఏ ప్రభుత్వంకూడా ఈ విధంగా చేయలేదని చెప్తున్నారు. పార్టీల చర్చనే లేదు. చాలామంది రైతులు ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. రైతుబంధు గురించి హైదరాబాద్‌లోకూడా మంచి చర్చ జరుగుతున్నది. – మంత్రివర్గ సహచరులతో సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.