Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొత్త సచివాలయం

-బైసన్‌పోలో గ్రౌండ్ స్థలంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ, -హెచ్‌వోడీల సముదాయం, కళాభారతి -కేంద్రం అనుమతి రాగానే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన -అసెంబ్లీలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటన

నూతన సచివాలయం ప్రతిపాదనను ఉపసంహరించుకునేది లేదని, కచ్చితంగా కట్టి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుమేరకే నూతన సచివాలయాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు. కేంద్రం అనుమతి ఇచ్చిన వెంటనే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి, రాష్ట్ర ప్రజలకు చారిత్రాత్మక సచివాలయ భవనాన్ని అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రజాకోర్టులోకి వెళుతామని, ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. నూతన సచివాలయ నిర్మాణంపై బుధవారం శాసనసభలో బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత సచివాలయ దుస్థితి, నూతన సచివాలయ నిర్మాణ ఆవశ్యకతను సుదీర్ఘంగా వివరించారు. నూతన సచివాలయ నిర్మాణంపై వితండవాదం చేయొద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు.

ఇంత చెత్త సచివాలయం ఎక్కడాలేదు దేశంలో ఉన్న 29 రాష్ర్టాల్లో మన దగ్గరున్నంత చెత్త సచివాలయం మరెక్కడా లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఏ ఒక్క బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదు. అనుమతులు తీసుకోలేదు. హంకర్.. బంకర్‌గా ఇష్టమొచ్చినట్టుగా కట్టినరు. అగ్నిప్రమాదం సంభవిస్తే ఏం జరుగుతుందో తెల్వదు. సీ బ్లాక్‌లో సీఎం, సీఎస్, క్యాబినెట్ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్.. అన్నీ ఒక్క బిల్డింగ్‌లోనే. అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజిన్ ఆపరేట్‌చేసే స్థలంలేదు. ఇప్పుడున్న సీ భవనం వెనుక రెండు అడుగుల స్థలముంది. అక్కడే ఎయిర్ కూలర్లవీ ఉంటయి. మనిషి నడువడం కూడా కష్టం. గతంలో పనిచేసినోళ్లు ఏ ఒక్కరూ మైండ్ ఓపెన్ చేసి చూడలె. బీ బ్లాక్, ఎల్ బ్లాక్‌లలో చాలాసార్లు అగ్నిప్రమాదాలు జరిగినయి. పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు వచ్చినయి. సచివాలయంలో ఉండే ఫైళ్లు అమూల్యమైనవి. ఇప్పటివరకు వాటిని భద్రంచేసే వ్యవస్థలేదు. ఐటీలో మంచి బ్యాక్‌అప్ లేదు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లేదు అన్నారు.

విదేశీ ప్రతినిధులు ఇదేం సచివాలయం అన్నరు సచివాలయం అంటె ఎట్ల ఉండాలె? నేను సీఎం అయిన తర్వాత విదేశీ ప్రతినిధులు వచ్చినపుడు నా మొహం మీదనే ఇదేం సచివాలయం? కొత్త రాష్ట్రమంటున్నరు.. బ్రహ్మాండమైన సచివాలయం కట్టుకోవచ్చు కదా! అన్నరు. సీఎం కార్యాలయానికి రావాలంటె వంకర్లు తిరిగి, నాలుగు చక్కర్లు కొట్టి రావాలె. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించినపుడు భోజనం చేద్దామంటే.. తిండి పెట్టేందుకు స్థలం లేదు. అందరం వెళ్లి మారియట్ హోటల్‌లో తినొచ్చినం. ఇప్పుడున్న సచివాలయంలో ఏ ఒక్క బిల్డింగ్‌కు కూడా జీహెచ్‌ఎంసీ అనుమతి లేదు. ఫైర్ సేఫ్టీ లేదు. అందుకే ఆధునిక సౌకర్యాలతో కొత్త సచివాలయం నిర్మిస్తం. పాతదానిని ఎలా వినియోగించుకోవాలో తర్వాత ఆలోచిస్తం అని చెప్పారు.

నగరంలో 19 మైదానాలున్నయి హైదరాబాద్‌లో క్రీడామైదానాలే లేవు అన్నట్టు వితండవాదం చేస్తున్నారని సీఎం విమర్శించారు. బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం.. ఇట్ల 19 మైదానాలున్నయి. గచ్చిబౌలి స్టేడియంలో ఎప్పుడో ఏషియన్ గేమ్స్ జరిగినయి. అక్కడ 14 అంతస్తుల బిల్డింగ్ వృథాగా పడిఉంది. అక్కడ బీజేపీకి చెందిన కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ కూతురు పెండ్లి చేసినరు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఉప్పల్ స్టేడియంలు ఏం చేస్తున్నం? బైసన్‌పోలో క్రీడా మైదానం కాదు. ఆర్మీ గ్రౌండ్. అయినా బీజేపీ సభ్యులు అదేదో అందరూ వాడుకునేదన్నట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నరు. హకీంపేట దగ్గర తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు 200 ఎకరాలుంది. అంతకుముందు అది కబ్జా అయితే.. మేమొచ్చిన తర్వాత స్వాధీనం చేసుకొని దశలవారీగా ప్రహరీగోడ నిర్మిస్తున్నాం అని సీఎం చెప్పారు.

వితండవాదం వద్దు కొత్త సచివాలయం అంశంపై కొందరు విచిత్ర, వితండవాదం చేస్తున్నరు. ఎస్సీ హాస్టళ్లకు ప్రాధాన్యమివ్వాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి అంటరు. ఎస్సీలకు మేమిచ్చినంత ప్రాధాన్యం చరిత్రలో ఎవ్వరూ ఇయ్యలె. 504 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసినం. టాప్ ప్రయారిటీ ఇస్తున్నం. నూతన సచివాలయం నిర్మిస్తే హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ అవుతుందని బీజేపీ సభ్యు డు లక్ష్మణ్ అంటున్నరు. అది వాళ్ల ఆలోచనస్థాయి. ఆలోచన లేకుంటే పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిపక్షాలకు ప్రతిదీ వివాదం అని సీఎం విమర్శించారు. కొత్త సచివాలయాన్ని వాస్తుకోసమే నిర్మిస్తున్నామన్న వాదనను సీఎం కొట్టిపారేశారు. కేవలం ఒక్క వాస్తు కోసమే కొత్త సచివాలయం కడుతలేం. అది ఒక కారణం మాత్ర మే. బైసన్‌పోలో స్థలం సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీల సముదాయం, ఉత్తర తెలంగాణకు జీవనాడిలాంటి రాజీవ్ రహదారి విస్తరణ కోసం అడిగినం. ఉత్తర తెలంగాణ నుంచి వచ్చేవాళ్లు అల్వాల్ వరకు గంట, గంటన్నరల వస్తే.. అక్కడినుంచి సిటీలోకి రావడానికి రెండు గంటలు పడ్తది. పెండ్లిళ్ల సీజన్‌లో హకీంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర స్ట్రక్కయితే అంతే. అందుకే అన్ని అవసరాలకోసం ఆ డిఫెన్స్ ల్యాండ్ ఇస్తే ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇస్తమని కేంద్రానికి చెప్పినం. అది తప్పా అని కేసీఆర్ అన్నారు.

ఆర్మీపై గౌరవంతోనే దేశంలో 54 కంటోన్మెంట్‌లు ఉన్నయి. కానీ హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌కున్న ప్రత్యేక చరిత్ర దేనికీ లేదు. వాస్తవంగా నిజాం ఆర్మీ లంగర్‌హౌజ్, గోల్కొండ ప్రాంతంలో ఉండేది. అది కులీకుతుబ్‌షా, కాకతీయ రాజుల కాలంలో ఉన్న ఆర్మీది. బ్రిటీష్‌కాలంలో మద్రాస్ రెసిడెన్సీని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ల లక్ష్యం హైదరాబాద్. అందుకే అప్పటి నిజాం రాజు వాళ్లకు సరెండర్ అయి, మా రాజ్యాన్ని ఆక్రమించుకోకండి అని కోరినడు. తర్వాత నువ్వు మా మీద తిరుగుబాటు చేయవని గ్యారంటీ ఏంది? అని అప్పుడు.. వాళ్లు కొన్ని కండిషన్ల మీద ఒప్పుకున్నరు. హైదరాబాద్‌ల మా రెసిడెంట్ కమిషనర్ ఉండి.. మిమ్మల్ని డే టు డే మానిటర్ చేస్తడు అని చెప్పిండ్రు. అట్ల ఏర్పడిందే బొల్లారం కం టోన్మెంట్. ప్రధాని మొదలు మొన్నటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఇప్పుడున్న నిర్మలా సీతారామన్ వరకు ఇవన్నీ చెప్పినం. బ్రిటీష్ ఆర్మీకోసం నిజాంరాజు స్థలం ఇచ్చిండేగానీ ధారాదత్తం చేయలేదు. ఇప్పటికీ అది మన ప్రభుత్వం పేరునే ఉంది. పోలీస్ యాక్షన్ తర్వాత భారత ప్రభుత్వం ఆ భూమి ని తీసుకుంది. దేశ రక్షణ చూసే ఆర్మీ ఉన్నందున మనం గౌరవంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచినం. బైసన్‌పోలో, దానిపక్కన జింఖానా మైదానం రెండు కలిపి 71-72 ఎకరాలుంటయి అని సీఎం చెప్పారు.

కేంద్రం స్పందన తర్వాత చర్యలు బైసన్‌పోలోకు సంబంధించి తీసుకునే 151 ఎకరాలను ఒకటి సచివాలయం, రెండోది హెచ్‌వోడీల సముదాయం.. మూడోది అసెంబ్లీ 10-15 ఎకరాల్లో.. నాలుగోది తెలంగాణ కళాభారతితోపాటు రాజీవ్ రహదారి విస్తరణకు వినియోగించుకుంటం. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే లాంటిది, స్కైవేలు నిర్మించాలనుకుంటున్నం. అందుకే వితండవాదం, వాదోపవాదాలు వద్దు. కేంద్రం లీజు కింద రూ.30 కోట్లు కోరితే ఇవ్వబోమని చెప్పినం. ఏం సమాధానం వస్తుందో చూసి తదుపరి చర్యలు తీసుకుంటం అని సీఎం వివరించారు.

నిజాం కాలంనాటి భవనం శాసనసభ భవనాన్ని నిజాంకాలంలో కట్టినరు. ఇప్పుడు మనం ఉన్న భవంతికి 1978లో చెన్నారెడ్డి శంకుస్థాపన చేసినరు. మీరు (స్పీకర్), నేను వెళ్లే పోర్టికో దారి ఎలా ఉంది? శాసనసభ నుంచి శాసనమండలికి ఎలా వెళ్లాలి? నా వాహ నం అక్కడ నిలిపితే మీ వాహనాన్ని మరో దగ్గర ఎండకు ఉంచాలి. స్పీకర్, సీఎం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వాహనాలు వరుసగా అక్కడ పెట్టి ఉంచినరు. అది చాలా గొప్పగా ఉందా? మన అసెంబ్లీ భవనం 15 ఎకరాలనుకున్నా.. హార్టికల్చర్ కార్యాలయం, ఇతరత్రా అన్నింటికిపోను ఏడు ఎకరాలు నెట్‌గా ఉంది. ఇందులో మనం ఎఫెక్టివ్‌గా ఐదెకరాలు వాడుకుంటున్నం అని సీఎం చెప్పారు.

వ్యయం రూ.500 కోట్లకు మించదు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయం 9.16 లక్షల చదరపు అడుగులుంది. ఇప్పుడు మనకు 5-6 లక్షల చదరపు అడుగులు కావాలనుకున్నా.. చదరపు అడుగుకు 3వేలు వేసుకున్నా నూతన సచివాలయ నిర్మాణానికి రూ.180 కోట్లు, చదరపు అడుగుకు రూ.4వేలు వేసుకున్నా రూ.240 కోట్లు అవుతయి. మిగిలిన అన్ని సముదాయాలు కట్టినా రూ.500 కోట్లకు మించి కాదు. ముందు సచివాలయం, శాసనసభ, ఆ తర్వాత మిగిలినవి కట్టుకుంటం అని కేసీఆర్ వివరించారు.

కొత్త అవసరాలకే పాత భవనాలు తెలంగాణ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. యంగెస్ట్ స్టేట్. ఈవోడీబీలో, ఎస్వోఆర్‌లో నంబర్‌వన్. హైదరాబాద్‌లో అన్ని హెచ్‌వోడీలు, ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరుచోట్ల 270 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నయి. కొన్ని విలువైన స్థలాలున్నయి. వాటిని ఎస్సీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల కోసం, ప్రజలకోసం వినియోగిస్తం. అమ్మి సొమ్ము చేసుకోం. ప్రజా అవసరాలకు ఆలోచించి వాడుకుంటం అని చెప్పారు. సచివాలయాన్ని మార్చాలనుకోవడం కొత్తకాదని సీఎం గుర్తుచేశారు. 1969 ముందు నీలం సంజీవరెడ్డి మార్చాలనుకున్నరు. ఎర్రమంజిల్ ప్రాంతంలో పరిశీలన చేసినట్టు రికార్డులున్నయి. ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి కూడా ప్రయత్నించినరు. కానీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా రావడంతో మార్చలేదు. దేశ రాజధాని మినహాయిస్తే 29 రాష్ర్టాల్లో ఐదు రాష్ర్టాల్లోనే చారిత్రాత్మక నగరాలున్నయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై. అంతర్జాతీయస్థాయిలో ఉండే ఈ సౌభాగ్య నగరం ఉండటం మన అదృష్టం. కానీ దీనికి ఒక కల్చరల్ సెంటర్ అనేది ఉందా? ఎప్పుడో కట్టిన రవీంద్రభారతి తప్ప ఇంకోటి లేదు. ఒక అంతర్జాతీయస్థాయి నగరానికి తగిన సెంటర్ ఉందా? ఆ ఇమేజ్ ఉండొద్దా? అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఎక్కడ నిర్వహిస్తున్నరు? ఒక మ్యూజిక్ ఫెస్టివల్ చేయాలన్నా ఒక సెంటర్ ఉందా? సోకాల్డ్ జింఖానా మైదానం కూడా మనది కాదు. కేంద్రం దగ్గర రాష్ట్ర క్రీడల విభాగం లీజుకు తీసుకుంది అని సీఎం అన్నారు.

ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు నూతన సచివాలయ నిర్మాణంపై ప్రధానిని కలిసినపుడు చర్చించినం. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు గాంధీనగర్‌లో అద్భుతమైన రాజధాని నిర్మించినరు. గొప్ప నిర్మాణాలంటూ అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్నరు. అట్లనే ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో సచివాలయం నిర్మించాలని అనుకుంటున్నమని చెప్పినపుడు ఆయన.. ఆప్‌కో ముబారక్ బాత్ దేతుం.. హైదరాబాద్‌మే సుందర్ సెక్రటేరియట్ బనావత్ అని శుభాకాంక్షలు తెలిపారు అని సీఎం చెప్పారు.

ప్రజాతీర్పుకు కట్టుబడి ఉంటాం ప్రభుత్వంగా మేం ఏం చేయాలనుకున్నమో అది చేస్తం. చేయొద్దు.. మేం చేయనీయం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కేంద్రం అనుమతి రాగానే ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన చేయించి, కచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చారిత్రాత్మక సచివాలయ భవనాన్ని అందిస్తం. వంద సంవత్సరాలు మంచిగా ఉండేలా.. వంకర టింకరలు లేకుండా నిర్మిస్తం. మీరు చెప్పిందే చేయాలంటే మేమెందుకున్నట్టు ? మేం ప్రజలకు చెప్తం.. వాళ్లకు జవాబుదారీగా ఉంటం. నూ తన సచివాలయ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోం. ప్రజానీకం ఏ తీర్పునిస్తే దానికి కట్టుబడి ఉంటం. హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా నూతన సచివాలయం నిర్మాణ ప్రతిపాదనను వందల సభలు, ఉపన్యాసాల్లో చెప్పినం. మీరు, మేము.. ఇద్దరం పోటీ చేసినం. ప్రజలు ఎవరికెన్ని సీట్లు ఇచ్చినరో దేశమంతా తెలుసు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకే మేం నూతన సచివాలయాన్ని నిర్మించి తీరుతం… వెనుకకు పోయే ప్రసక్తే లేదు అని సీఎం స్పష్టంచేశారు.

ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా ఉండాలె తమిళనాడు, మహారాష్ట్రల్లో సచివాలయాలు వాళ్ల ప్రభుత్వానికి గౌరవంగా, అస్థిత్వానికి ప్రతీకగా ఉన్నాయి. బెంగళూరులోని విధానసభ ఒక ల్యాండ్ మార్క్‌లా ఉంటది. దానిముందు నేను కూడా ఫొటో దిగిన. రాష్ట్రంగా మనకు ఒక స్వప్నం ఉండాలి. అనవసర ఖర్చని మాట్లాడుతున్నరు. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? ఇప్పుడున్న సచివాలయంలో ఏపీ, తెలంగాణ భవనాలున్నది కలిపితే 9.16 లక్షల చదరపు అడుగులు. సిబ్బంది 1720-2000 మంది. హెచ్‌వోడీల్లో ఆరు వేలమంది పనిచేస్తున్నరు. ఒకటి మాసబ్‌ట్యాంక్‌ల ఉంటె, ఇంకోటి తార్నాకల.. హెచ్‌ఎండీఏ ఇంకో దగ్గర విసిరేసినట్టు ఉంటయి. కొన్ని నాంపల్లిలో ఉంటయి. సీఎం సమీక్ష నిర్వహించినపుడు ఏదైనా విషయం అడిగితే… ఫైల్ తేలేదు సార్ అంటరు. మళ్లీ అది తేవాలంటే ఎలా? నాం పల్లి, సికింద్రాబాద్ పోవాలె. మంత్రుల చాంబర్లు, శాసనసభ, హెచ్‌వోడీల సముదాయం అన్నీ ఒక్క దగ్గర ఉంటె ప్రొడక్టివ్ వర్క్ జరుగుతది. సచివాలయం అనేది ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా ఉండాలె అని సీఎం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.