Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి ఎకరాల దిశగా..

‘బెంగాల్ నేడు ఏం ఆలోచిస్తే.. రేపు దేశం అదే ఆలోచిస్తుంది’ అనేది ఒకప్పటి నానుడి! ఇప్పుడు దృశ్యం మారుతున్నది. ‘ఈ రోజు తెలంగాణ చేస్తున్నది.. ’ రేపు దేశం చేయబోతున్నది.. అనేలా కొత్త దృశ్యం యావత్ దేశమంతా వ్యాప్తిచెందుతున్నది! ఇంటింటికీ తాగునీరిచ్చే మిషన్ భగీరథ ఇందుకొక నిలువెత్తు ఉదాహరణ! చిన్నతరహా జల వనరులకు తిరిగి ప్రాణంపోసే మిషన్ కాకతీయ మరో నిదర్శనం! డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకం ఒక విప్లవం! ప్రపంచంలోనే ఒకానొక అత్యుత్తమ పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్.. ఒక సంచలనం! తెలంగాణ అంధకారమైపోతుందని శాపనార్థాలు పెట్టిన నోళ్లు మూయిస్తున్న విద్యుత్ వెలుగులు ఒక ప్రభంజనం! ఇవాళ సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్! అభివృద్ధిలో అగ్రగామి! రాష్ట్రంగా ఆవిర్భవించిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకూ సమయంలేని రాష్ర్టాలు.. నేతలు ఇప్పుడు తెలంగాణను దర్శించుకుని అచ్చెరువొందుతున్న సందర్భం!! అవును.. ఇది అపురూప సమయం! తెలంగాణ ఆత్మగౌరవ పతాక రెపరెపలకు ఇప్పుడు రెండేండ్లు! యాచించే స్థితి నుంచి.. శాసించే దశకు చేరుకుని వేయబోతున్న ముచ్చటైన మూడో అడుగు! ఈ స్వల్ప సమయంలోనే నెరవేర్చాల్సిన ఆకాంక్షలు.. తీర్చాల్సిన గోసలు.. పరిష్కరించాల్సిన చిక్కుముళ్లు.. నిజం చేయాల్సిన కలలు..! సగటు రాష్ట్రవాసి మొదలుకుని.. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఆఖరుకు మేధావులదాకా! అందరిలోనూ ఎన్నో అంచనాలు! అన్నింటినీ అధిగమించింది తెలంగాణ ప్రభుత్వం.

CM-KCR

నాడు ఉద్యమ సారథిగా సమస్యలనెరిగి.. నేడు ముఖ్యమంత్రిగా వాటి పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తున్న.. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు తీస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన.. మున్ముందుకు దూసుకుపోతున్న స్టార్టప్ రాష్ట్రం!! కుతంత్రాలు కత్తులు నూరుతున్నా.. సహకరించాల్సిన చేతులు ముళ్లు విసురుతున్నా.. బేఖాతర్ చేస్తూ.. తెలంగాణ విజయవంతం చేస్తున్న పథకాల తీరుతెన్నులేమిటి? వాటితో ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటి? ఆ ప్రయోజనాలు రేపటి భవిష్యత్తుకు వేస్తున్న పునాదులేమిటి? ఆ పునాదులపై తెలంగాణ అధిరోహిస్తున్న శిఖరాలేమిటి?.. తెలంగాణ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై వివరమైన.. విశ్లేషణాత్మక కథనాలు నేటి నుంచి..

-పట్టాలెక్కిన సాగునీటి ప్రాజెక్టులు -ఏటా 26వేల కోట్ల బడ్జెట్, నెలకు రూ.2వేల కోట్ల పనులు -దేశంలోనే అత్యధిక బడ్జెట్ -ఈ ఖరీఫ్‌నాటికే 7.32 లక్షల ఎకరాలకు నీరు -1.25లక్షల కోట్లతో ఐదేండ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు -సమాంతరంగా ఆన్‌గోయింగ్, రీడిజైనింగ్ ప్రాజెక్టులు -గరిష్ఠంగా 3-5 సంవత్సరాల్లో పూర్తికి కసరత్తు

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. పచ్చని మాగాణాల్లో సిరుల పంట పండాలి..2001లో మలిదశ ఉద్యమంలో పుట్టిన ఈ గీతం కొన్ని లక్షలసార్లు పదిజిల్లాల రైతుల గుండెల్లో ప్రతిధ్వనించి ఉంటుంది. జీవనదుల నీళ్లు గలగలా ప్రవహించి తెలంగాణ పంటపొలాలను తడిపే అపురూప దృశ్యం కనిపించి ఉంటుంది. అందుకే ఎక్కడ ఉద్యమ సభ జరిగినా లక్షల మంది రైతులు కనిపించేవారు. పంట పొలాలకు నదుల నీళ్లు తెలంగాణ కల..ఆకాంక్ష! అందుకే పునర్నిర్మాణంలో కోటి ఎకరాలకు సాగునీరు అన్న బృహత్తర లక్ష్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో సాహసంతో స్వీకరించింది. నెలల తరబడి చర్చలు, విశ్లేషణలు, నిర్ధారణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, రీడిజైనింగ్‌లు.. బహుశా దేశ చరిత్రలో మరెక్కడా జరగనంత భారీ కసరత్తు చేసింది. ఉత్తరాన కాళేశ్వరం, దక్షిణాన పాలమూరు, పశ్చిమాన రామదాసు.. నల్లగొండకు డిండి ఇలా..ప్రతి ఎకరానికి నీరు లక్ష్యంగా ప్రాజెక్టులను పట్టాల కెక్కించింది. ఎంత కాలం కావాలి..ఎంత డబ్బు కావాలి.. అనే నోళ్లకు రూ25వేల కోట్ల బడ్జెట్‌తో సమాధానం చెప్పింది. సాగునీటి రంగంలో రెండేండ్ల పునర్నిర్మాణ పునాదుల సత్తా ఏమిటో; టీఎంసీలు..ఎకరాల లెక్కల్లో కాదు.. పక్క రాష్ట్రపు నాయకుల దీక్షలు..శోకాలు..పెడబొబ్బల్లో స్పష్టంగానే కనిపిస్తున్నది!

ప్రోగ్రెస్ రిపోర్ట్ – సమైక్యపాలనలో ఇచ్చింది రూ.40వేల కోట్లు – స్వరాష్ట్రంలో ఏటా రూ.26వేల కోట్లు – గత ఏడాది 2.73 లక్షల ఎకరాలకు నీరు – అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు లైన్ క్లియర్ – పాలమూరు పనులు ప్రారంభం.. టెండర్ల ప్రక్రియలో కాళేశ్వరం -డిండికి టెండర్లు, ఎస్సెల్బీసీకి పెండింగ్ నిధులు – ఈ ఖరీఫ్‌కే భక్త రామదాసు నీరు

గుండాల కృష్ణ:సమైక్య రాష్ట్రంలో దశాబ్దకాలమంతా కలిపి తెలంగాణ ప్రాజెక్టులకు రూ.40 వేల కోట్లు కేటాయిస్తే..స్వరాష్ట్రంలో ఒక్క సంవత్సరానికే కేసీఆర్ ప్రభుత్వం రూ.26 వేల కోట్లు ఇచ్చింది. వచ్చే ఐదేండ్లపాటు ఇంతే మొత్తం కేటాయిస్తామని ప్రకటించింది. ఇది రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో సుమారు 40 శాతం. దేశ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం లేదు. సాగునీటి రంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాథమ్యమిది. 14 లక్షల ఎకరాల పాలమూరు, 30 లక్షల ఎకరాల కాళేశ్వరం ఏకకాలంలో పట్టాలెక్కిస్తూనే ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్‌కు7.3 లక్షల ఎకరాల అదనపు సాగుకు కసరత్తు చేస్తున్నది. ప్రతి ఏటా రూ.26వేల కోట్ల బడ్జెట్, ప్రతి నెలా రూ.2వేల కోట్ల మేర పనులు..ఇదీ సాగునీటి ప్రాజెక్టుల రోడ్ మ్యాప్. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్ల దశనుంచి పనుల దశకు చేరుతుండగా. డిండి ఎత్తిపోతల టెండర్లు దశకు, కాళేశ్వరంలో బ్యారేజీ, పంపుహౌజ్ నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇదీ సాగునీటి రంగం ప్రోగ్రెస్ రిపోర్ట్!

ఈ ఏటి లక్ష్యాలు.. 2016-17లో ఎనిమిది ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిగా… మరో 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి కొత్తగా 7.32 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో పూర్తయ్యే ప్రాజెక్టుల కింద 1.23 లక్షలు, పాక్షికంగా పూర్తయ్యే వాటి కింద 6.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటిలో ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ప్రాజెక్టు ఉంది. పాక్షికంగా పూర్తి చేయాలనే ప్రాజెక్టుల జాబితాలో తొమ్మిది భారీ ప్రాజెక్టులు, రెండు మీడియం ప్రాజెక్టులున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్‌కి 3.81 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నది.

శరవేగంగా ఆధునీకరణ పనులు… రూ.2123.77 కోట్లతో నాగార్జునసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సత్వర సాగునీటి ప్రయోజన పథకం -ఏఐబీపీ- కింద గతంలో రెండు మేజర్, ఒక మీడియం ప్రాజెక్టు చేపట్టగా ఆ పనులు పూర్తయి… 4,04,670 ఎకరాలకు సాగునీరు అందింది. ప్రధానమంత్రి రిలీఫ్ ప్యాకేజీ కింద చేపట్టిన 13 ప్రాజెక్టులపై 2015, నవంబర్ నాటికి రూ.14,020.60 కోట్లు ఖర్చు చేయగా 2015 డిసెంబర్ నాటికి 10,03,963 ఎకరాలకు నీరందించారు.

భూసేకరణలో వేగం… ప్రాజెక్టులు గరిష్ఠంగా 3-5 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చెల్లించే పరిహారం నయాపైసాతో సహా బాధితుడి చేతుల్లోకి వెళ్లేందుకు జీవో 123 -ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ప్రవేశపెట్టింది. రైతుల నుంచి బయటి మార్కెట్ రేటు ప్రకారం భూమిని సేకరించడం ద్వారా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు టెండర్లు పూర్తి కాకముందే భూసేకరణ పూర్తయింది.

ఇవీ మన ప్రాజెక్టులు.. పాలమూరుకు భారీగా నిధులు మహబూబ్‌నగర్ జిల్లా దారిద్య్రం పోవాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. 2016-17 బడ్జెట్‌లో రూ.7,860.88 కోట్లు (22.30% నిధులు) కేటాయించారు. రూ.35,250 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు గత మార్చిలో రూ.29, 333.09 కోట్ల విలువైన పనులకు 18 ప్యాకేజీలుగా టెండర్లు పూర్తయి, పనులు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్‌లో ఏడు లక్షలు, రంగారెడ్డి,-నల్లగొండ పరిధిలో ఐదున్నర లక్షల ఎకరాలకు నీరు లభిస్తుంది. రెండున్నర ఏండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.

కాళేశ్వరం టెండర్లకు సిద్ధం.. 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 2016-17 బడ్జెట్‌లో రూ.6,286 కోట్లు కేటాయించారు. రూ.83వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రూ.5813 కోట్లతో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీ నిర్మాణానికి… రూ.7998 కోట్లతో మేడిగడ్డ నుంచి మూడు దశల్లో ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేందుకు పంపుహౌజ్‌ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సిద్ధమైంది.

దేవాదులకు జీవం… దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయి వినియోగంలోకి తెచ్చేందుకు చేసిన రీడిజైన్‌లో భాగంగా తుపాలకుగూడెం బ్యారేజీకి రూ.200 కోట్లు, దేవాదులకు రూ.695 కోట్లు కేటాయించింది. గత ఏడాది రికార్డు స్థాయిలో 4.981 టీఎంసీలను లిఫ్టు చేసి 60 చెరువులను నింపి, వరంగల్ పట్టణ దాహార్తిని కూడా తీర్చారు. తాజా బడ్జెట్‌లో కేటాయింపులతో మూడో దశ పనులు పూర్తయి లక్ష్యం మేర ఆయకట్టుకు సాగునీరు అందేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఏడాదిలోనే రామదాసు నీరు.. ఖమ్మం జిల్లాలో రీడిజైనింగ్‌లో భాగంగా తీసుకున్న సీతారామ, భక్త రామదాసు ఎత్తిపోతల పథకాలకు ఈ బడ్జెట్‌లో 1151.59 కోట్లు కేటాయించారు. ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకాలకు రూ.7969 కోట్ల వ్యయం అంచనా వేశారు. సీఎం కేసీఆర్ గత ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేయగా ఈ నెలాఖరున టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ నాటికే భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 58,958 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నది ప్రభుత్వం.

టెండర్లకు సిద్ధమైన డిండి.. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) పథ కం, డిండి ఎత్తిపోతల పథకాలకు రూ.1417.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో ఫ్ల్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లందించే డిండి లిఫ్టునకు రూ.780 కోట్ల కేటాయింపు జరిపింది. త్వరలోనే టెండర్ల దశకు చేరనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ 50 వేల ఎకరాలతో సహా దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పైగా నీరు అందనుంది. ఎస్సెల్బీసీ పథకంలో ఇప్పటికే కాంట్రాక్టరుకు పెండింగు బిల్లులు చెల్లించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు లైన్ క్లియర్. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న లెండి, లోయర్ పెన్‌గంగ, ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చర్చలు జరిపి కొలిక్కి తెచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో లోయర్ పెన్‌గంగకు రూ.124.69 కోట్లతో పాటు లెండి ప్రాజెక్టుకు రూ.19.32 కోట్లు కేటాయించింది. లోయర్ పెన్‌గంగలో భాగంగా చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఈనెల 21న మహారాష్ట్ర ప్రభుత్వం చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణానికి అటవీ, వన్యమృగ సంరక్షణ, గనులకు సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేసింది.

ఆర్డీఎస్‌పై అలుపెరగని పోరాటం… బచావత్ ట్రిబ్యునల్ 15.90 టీఎంసీలను కేటాయించినా నాలుగైదు టీఎంసీల కంటే ఎక్కువ నీటి వాటా దక్కని మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాల ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తున్నది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ మంత్రులతో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడారు. అయినా ఆర్డీఎస్ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ మోకాలడ్డుతుండటంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వంతో కర్ణాటక సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

సమైక్యంనుంచి స్వరాష్ట్రం దాకా..ఎవరెంత ఇచ్చారు సాగునీటి రంగానికి సమైక్య పాలకులు ఇచ్చిందెంత? స్వరాష్ట్రంలో మనం కేటాయించుకుంటున్నదెంత? తెలుగుదేశం రెండు పర్యాయాలు అధికారంలో ఉండగా తెలంగాణ సాగునీటి రంగానికి ఖర్చు పెట్టింది కేవలం రూ.4312.23 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పదేండ్లలో రూ.42198.29 కోట్ల కేటాయించి అందులో రూ. 36894.55 కోట్ల మేర ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి కేవలం గుత్ప, అలీసాగర్ అనే రెండు చిన్న లిప్టులు మాత్రమే.

దేశంలో 2014-15 సంవత్సరానికి సంబంధించి సాగునీటి రంగంపై 5.58 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గత దశాబ్దకాలంగా సాగునీటి రంగంపై దేశంలోని వివిధ రాష్ర్టాలు వెచ్చిస్తున్న పెట్టుబడులను పరిశీలిస్తే… తెలంగాణ రాష్ట్రం గణనీయంగా పెట్టుబడుల్ని పెంచినట్లుగా అసోచామ్ అధ్యయనంలో తేలింది. 2004-05లో పెట్టుబడులు 5.7 శాతంగా ఉంటే… 2014-15కి అది 11.6 శాతం (రెట్టింపు)గా ఉండటం రికార్డు. దశాబ్దకాలంలో పెరుగుదల పరంగా దేశంలోని 21 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించడం ఒక విశేషమైతే… 2014-15లో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉండటం మరో విశేషం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.