Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి ఎకరాలకు సాగునీరు

నాలుగేండ్లలో 1.25 లక్షల కోట్లు కేటాయింపు -అన్నీ అనుకూలిస్తే ఒకే విడతలో రుణమాఫీ -రెండున్నర ఏండ్లలో 24 గంటలు త్రీఫేస్ కరెంటు -14వేల కోట్లతో 2 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు -వర్సిటీలు, కాలేజీల విద్యార్థులకూ సన్నబియ్యం అన్నం -ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ -సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు శంకుస్థాపన

CM-KCR-addressed-in-Khammam

రాష్ర్టానికి ఈశాన్యంలో ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులకు శుభప్రదంగా శంకుస్థాపన చేసి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టామని, ఇక ఆరునూరైనా వచ్చే నాలుగేండ్లలో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించేదాకా విశ్రమించబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. యావత్ తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడాలన్న కలలు వందశాతం కచ్చితంగా సాకారమవుతాయని అన్నారు. గోదావరి, కృష్ణ జీవనదులను తెలంగాణకు మళ్లించి కోటి ఎకరాలు సాగులోనికి తీసుకురావటమే బంగారు తెలంగాణ లక్ష్యమన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం సాగునీటిరంగానికి, రైతాంగానికి నీళ్లు ఇవ్వటానికి రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చుపెట్టబోతున్నదని చెప్పారు.

మంగళవారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్ట్‌కు, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభల్లో సీఎం ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇపుడు తెలంగాణలో, తెలంగాణ బిడ్డల పాలనలో మన ప్రాజెక్టులు మనమే నిర్మించుకుంటున్నామని అన్నారు. సాగునీటితో పాటు మిషన్ భగీరథ పథకంతో తాగునీరు కూడా అందిస్తామని, వచ్చే రెండున్నర ఏండ్లలో 24 గంటలు త్రీఫేస్ కరెంటు కూడా సరఫరా చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు. అన్నీ అనుకూలిస్తే రుణమాఫీ రెండు బకాయలను ఒకే విడతలో చెల్లిస్తామని ప్రకటించారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో చేపడుతున్న పథకాలను చూసి దేశం ముక్కున వేలేసుకుంటున్నదని, అనేక రాష్ర్టాలు మన పథకాలను కాపీ కొడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. రెండేండ్ల పాలనలో ఒక్క చిన్న అవినీతి ఆరోపణకూడా లేకుండా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. వ్యతిరేక శక్తులు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయని వాటిని పట్టించుకోకుండా ముందుకు పోతామని, చిల్లర వేషాలు వేస్తే ఐరన్ హాండ్‌తో అణచివేస్తామని హెచ్చరించారు.

మన నీళ్లు మనమే పారించుకుందాం.. తిరుమలాయపాలెం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ స్వరాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..ఒక పక్క గోదావరి నది జిల్లాను ఒరుసుకుంటూ పారుతది.. ప్రతి సంవత్సరం నాలుగు వేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతయి.. చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు.. మా అంత గొప్పవాళ్లు లేరన్నరు.. ఏ ఒక్కరూ నీళ్ల గురించి పట్టించుకోలే.. ఖమ్మం జిల్లాను, ప్రజలను వారి ఖర్మకే వదిలేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్నా, మొన్నా నాతోని చెప్తా ఉన్నరు. ఆనాడు మున్నేరు మీద ఒక చెక్ డ్యాం కడితే ఆటంకం. పాలేరుకు మంచి చేద్దామంటే ఆటంకం. మీ ఖర్మ అంతే. సమైక్యరాష్ట్రంలో అది మన బతుకు. అప్పుడు ఒక్క పంటకూ నీళ్లు రాలే.. సాగునీరు కోసం, మంచినీటి కోసం అల్లల్లాడినం.ఆనాడు అది సమైక్యరాష్ట్రం. మన మాటలు చెల్లలే. కానీ ఇది తెలంగాణ రాష్ట్రం.. తెలంగాణ బిడ్డల రాజ్యం. ఇక మన ప్రాజెక్టులు మనమే కట్టుకుందాం. మన నీళ్లు మనం పారించుకుందాం. ఇవాళ తెలంగాణ రాష్ర్టానికి ఈశాన్యం వైపు ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి శుభప్రదంగా మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇక రాష్ర్టానికి తిరుగులేకుండా పోయింది. భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో ఈరోజు మనసునిండా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఆరోజు పిడికెలెత్తి జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నాం. నిన్నటి వరకు ఖమ్మం జిల్లాతోపాటు పాలేరు నియోజకవర్గానికి ఒక్క పంటకు సాగునీరు అందుతుండేది.

ఇక నుంచి సీతారామ ప్రాజెక్టుతో కలుపుకుంటే రెండు పంటలకు సాగునీళ్లు వస్తాయి. పాలేరు కింద సాగర్ ఆయకట్టుకు కృష్ణానదిలో నీళ్లు అయిపోయినా సీతారామ ప్రాజెక్టు ద్వారా వాళ్లకు కూడా నీళ్లిచ్చే అవకాశం ఉంది. మీకు ఇంకో శుభవార్త కూడాఉంది. రాబోయే డిసెంబర్‌లోపు పాలేరు రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథ కింద మంచినీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో మొట్టమొదట లబ్ధిదారులు తిరుమలాయపాలెం, పాలేరు నియోజకవర్గ ప్రజలు కాబోతున్నరు. డిసెంబర్ నుంచి శాశ్వతంగా మంచినీళ్ల బాధ కూడా పోతది. భగవంతుడు కరుణిస్తే ఆర్నెళ్లలో నేనే పాలేరుకు వచ్చి, వాటిని ప్రారంభిస్తా.

ఆరు నెలల్లో రెండు స్కీములు ప్రారంభం పాలేరు నియోజకవర్గం గడిచిన 60ఏండ్లలో కరువు ప్రాంతంగా ఉంది. రైతులు, ప్రజలు బాధపడ్డరు. ఇక నుంచి అలాంటి బాధలకు స్థానం లేకుండా చూసేటందుకు రామదాసు పథకాన్ని మంజూరు చేసినం. రూ.100 కోట్లు మంజూరు చేసినం. ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్‌లో వర్షాలు పడి పాలేరు జలాశయంలోకి నీళ్లు రాగానే కాలువలకు నీళ్లు వదిలేటట్లు ప్రాజెక్టును సిద్ధం చేసే బాధ్యత మంత్రులు హరీశ్‌రావుకు, తుమ్మల నాగేశ్వరరావులకు అప్పగిస్తున్నా.

రెండున్నరేండ్లలో 24గంటల పాటు త్రీఫేజ్ కరెంట్ ముప్పై ఏండ్లు మనల్ని ఏడిపించిన సమస్య కరెంట్ సమస్య. ఇప్పుడు చాలా వరకు తీర్చుకున్నం. రాబోయే రెండేండ్లలో రెప్పపాటు కరెంట్ పోకుండా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నం. కచ్చితంగా నాణ్యమైన త్రీఫేజ్ కరెంట్‌ను ఇవ్వాలని పనిచేస్తున్నం. కచ్చితంగా ఇచ్చితీరుతం, ఇప్పడు సింగిల్‌పేజ్‌కు 24గంటలు , పగలు 6 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నం. దేవుడు ఆశీర్వదిస్తే వచ్చే రెండు, రెండున్నర ఏండ్లలో త్రీ ఫేజ్ కరెంట్ 24 గంటలు ఇచ్చే బాధ్యత నాది.

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ముస్లింలు, బీసీలు బాగుపడాలి. దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు సంపూర్ణంగా బాగుపడ్డనాడే నిజమైన బంగారు తెలంగాణ. దేశంలో పేదవారి కోసం వెయ్యి రూపాయల పింఛన్, వికలాంగులకు పదిహేనువందల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పేదలు ఆత్మగౌరవంతో బతకాలె. ఇంతకుముందు పాలించిన ప్రభువులు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ పేదల ఆత్మగౌరవం చూడలే.

ఇండ్లు కావాలంటే డబ్బాలాంటి రూం కట్టించారు. కానీ ఈరోజు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తుంది. పాలేరు నియోజకవర్గంలో పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. రూ. 1000 పింఛన్ ఇస్తున్నామంటే, పేద ప్రజలు రెండు పూటల పప్పుచారు, అన్నం తినాలనేది మా ఆలోచన. కిలో బియ్యం రూపాయి చొప్పున ఇస్తున్నామంటే, పేదలకు అన్నానికి డోకా ఉండకూడదనే ఆలోచన. దళిత, గిరిజన, బీసీ, ముస్లిం,మైనార్టీలందరు నేటికి ఒక గది ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అది బాధాకరం. ఈరకమైన పరిస్థితి పోవాలి. ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు. కచ్చితంగా పేదలందరికి డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించాలని నిర్ణయం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 14వేల కోట్ల రూపాయలతో వచ్చే సంవత్సరం 2 లక్షల ఇండ్లను కట్టిచ్చి తీరుతాము. కుటుంబంలో ఆడపిల్ల పెండ్లి చేయడమంటే పేదలు గుండెల మీద కుంపటిగా బాధపడతారు. అందుకోసం కల్యాణలక్ష్మి పథకం తెచ్చినం. వచ్చే మార్చి తర్వాత బీసీలందరికీ తెలుపు రేషన్‌కార్డు ఉన్నవారందరికీ కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింప చేయనున్నాం. వచ్చే మార్చి 31 నుంచి యూనివర్సిటీలకు, కాలేజీలకు కూడా సన్నబియ్యమిస్తాం. దేవుడు దీవిస్తే ఏక మొత్తంలో రైతురుణమాఫీ చేసేందుకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తాం.

దేశం ముక్కున వేలేసుకుంటున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని చూసి, దేశం ఇవాళ ముక్కున వేలేసుకుంటున్నది. మిషన్ భగీరథను బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాపీకొడుతున్నయి. పశ్చిమబెంగాల్ వారు ఇక్కడ పాలన బాగుందని చూసిపోయినారు. ఇట్లాంటి పథకం మేం కూడా పెట్టుకుంటామని చెప్తా ఉన్నరు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణను చూసి అనేక రాష్ర్టాలు నేర్చుకునే పరిస్థితి ఉంది. మీ దీవెన, ఆశీస్సులతో ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నది. మీ అండదండలు ఉన్నంత వరకు ఏ శక్తులతో రాజీపడం, తప్పకుండా మీ కలలు నెరవేరుస్తాం. వ్యతిరేక శక్తులు ఎప్పుడు విమర్శలు చేస్తునే ఉంటాయి. అయినా పట్టుదలతో పనిచేస్తూ ముందుకు పోతాం. ఈ గడ్డపై పుట్టిన భక్త రామదాసు మాదిరిగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు ఎత్తిపోతల పథకం కోసం పట్టుపట్టారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలంటే మరికొన్ని కాలువలు తవ్వించాల్సి ఉంది. వారం రోజుల్లో వాటిని మంజూరు చేయించాలని హరీశ్‌రావుకు చెప్తున్నా. అని సీఎం కేసీఆర్ అన్నారు.

చిల్లర పనులు చేస్తే ఐరన్ హ్యాండ్‌తో డీల్ చేస్తా సంఘంలో, సమాజంలో మంచి జరుగుతుంటే కొన్ని శక్తులకు కంటగింపుగా ఉంటది. ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పథకాల ప్రారంభానికి నేను వస్తుంటే నలుగురు పీడీఎస్‌యూ పిల్లలు ఖమ్మం పట్టణంలో అడ్డంపడ్డరు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి వస్తుంటే బస్సుకు అడ్డుపడబోతున్నరు. వారిని తోసేస్తే, లాఠీ దెబ్బకొడితే రాద్ధాంతం చేయాలని చూస్తున్నరు. నేను అడుగుతా ఉన్న! ఈ పీడీఎస్‌యూ అనే సంస్థకు ఇది సంస్కారమా..? న్యూడెమోక్రసీ పార్టీ వాళ్లకు సంస్కారమిదేనా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇదేమైనా రాజకీయ సభనా..? ఓట్ల సభనా..? ఎవ్వరి సహనానికైనా సరే హద్దులుంటయ్. ఈ చిల్లర రాజకీయాలు, చీప్‌ట్రిక్స్ ఇక ముందు నడవయ్, జాగ్రత్త! నలుగురు పిల్లలు వచ్చి నాలుగు జెండాలు పట్టుకుని బస్సుకు అడ్డం కూర్చుంటే, అదో వార్త, అదో గొప్ప విషయమా? పాలేరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు నీళ్లు తెచ్చే కార్యక్రమం దానికి సందర్భమా? వెకిలి వేషాలు వేస్తే బాగుండదు. ఇప్పటి వరకు భరించినం. ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేదు. ఐరన్ హ్యాండ్‌తో డీల్ చేస్తం. తెలంగాణ జెండా పట్టినప్పుడు కూడా ఎన్నో విమర్శలు చేశారు. అవమానాలు చేశారు. మఖలో పుట్టిన పార్టీ పుబ్బలో పోద్ది అని హేళన చేసిండ్రు. కానీ మనం పుబ్బలో పోలే. మనం బలవంతులమై బ్రహ్మాండంగా తెలంగాణ తెచ్చుకుని, మనల్ని మనం పాలించుకుంటున్నం. విమర్శించినోళ్లే వెళ్లిపోయారు. నా ప్రాణం పోయిన సరే, నేను ఎవ్వరితో రాజీ పడను, పడాల్సిన అవసరం లేదు.

రైతును రారాజును చేస్తాం.. అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్ట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోళ్లపాడు చెరువు వద్ద ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగం ఇలా సాగింది…

పుట్టిందే తెలంగాణ కోసం..సాధించేంతవరకు నిద్రపోలేదు. రాష్ర్టాన్ని సాధించాం. మిగిలింది బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే. ఈరోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు. రోళ్లపాడుకు వందసార్లు వచ్చా. గుగూల్‌మ్యాప్‌లో వందల సార్లు చూశా. అప్పుడే రోళ్లపాడు పథకం మదిలో మొదలైంది. ఈ రోజు దానికి శంకుస్థాపన చేసినందుకు ఆనందంగా ఉంది. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఖమ్మం జిల్లాలోని 24 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. దుమ్ముగూడెం దగ్గర 365 రోజులు గోదారమ్మ పారుతూనే ఉంటుంది. 5లక్షల క్యూసెక్కులు సముద్రంలో ఉట్టిపుణ్యానికి కలుస్తున్నాయి. వాటిని మళ్లిస్తే ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుంది. ఆ మళ్లింపునకు సీతారామ ప్రాజెక్ట్‌తో అంకురార్పణ జరిగింది. దీనితో ఇల్లెందుతో పాటుగా కొత్తగూడెం, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం కలుగుతుంది. రోళ్లపాడు రైతును రారాజును చేస్తాం. ఇప్పటి వరకు పరిపాలించిన రెండు పార్టీలు వంకరటింకరగా మాట్లాడుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నాయి. పసికూన టీఆర్‌ఎస్ చేస్తున్న పరిపాలనను చూసి సిగ్గుతో తలవంచుకుంటున్నాయి.

ఎకరం రూ.20లక్షలైనా కొనిస్తాం రోళ్లపాడు ప్రాజెక్ట్‌కు రూ.8000 కోట్లు మంజూరు చేశాం. ఖమ్మం జిల్లా జలకళతో పచ్చదనం సంతరించుకుంటుంది. జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాలు సాగులోనికి రానుంది. ఇందిరారాజీవ్ సాగర్ పేరుతో చేసింది తప్పుడు డిజైన్. ఎక్కడా కనీసం అర టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. రోళ్లపాడు రైతులు రారాజుగా మారుతారు. వారిని తెలంగాణలో తలెత్తుకునేలా చేస్తాం. పరిహారాల విషయం. కేసీఆర్ మాటంటే మాటే. రైతు కుటుంబం నుండి వచ్చిన. నాకు అన్ని తెలుసు. రోళ్లపాడు నిర్వాసితులకు ఎకరం రూ.ఇరవై లక్షలు అయిన కొని ఇస్తాం. ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం.

బేతంపూడి పరిధిలోని రుక్మాతండా, బీల్యాతండా, రోళ్లపాడు గ్రామాల్లో 200 కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ,పురుషులతో కలిపి 817 మంది జనాభా ఉంది. 817 మందిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. ప్రాణం పోయినా మాట నిలబెట్టుకుంటా. రోళ్లపాడు రెండున్నరేండ్లలో పూర్తి అవుతుంది. పైపులైన్, గ్రావీటి కెనాల్‌కు ప్రతి ఒక్కరు సహకరించండి. అని సీఎం పిలుపునిచ్చారు.తిరుమలాయపాలెం, రోళ్లపాడు బహిరంగసభల్లో సీఎంతో పాటు భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్‌అంబ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరర్‌రెడ్డి, పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జేసీ డీ దివ్య, కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్, పలు ప్రభుత్వ శాఖల పాల్గొన్నారు.

నారాయణఖేడ్ ప్రజలు కొత్త చరిత్ర లిఖించారు: కేసీఆర్ మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ప్రజలు కొత్త చరిత్ర లిఖించి, టీఆర్‌ఎస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం తిరుమలాయపాలెం బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఖేడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పే బాధ్యత తనపై ఉందన్నారు. అహోరాత్రులు కష్టపడి ఈ విజయాన్ని సాధించిన యువనాయకుడు, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుకు, ఆయనతోపాటు పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని సీఎం అన్నారు. ఈ సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు వేదికపై సీఎం కేసీఆర్ పక్కనే ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.