Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి ఎకరాల మాగాణి ఖాయం

– గోదావరి, కృష్ణా జలాల వాటాను పూర్తిగా వినియోగించుకుంటాం -కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్న పాపాత్ములు -పేదల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చుచేస్తాం -ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన, ఆయాచోట్ల ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు. ముందుగా ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో సమావేశమై పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం స్థానిక మార్కెట్‌యార్డులో జరిగిన సభలో మాట్లా డుతూ గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1200 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీలో నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్టించుకోలేదని, అంతర్రాష్ట్ర వివాదాల పేరుతో కొన్ని ప్రాజెక్టు నిర్మాణాలను దాటవేశాయని ఆరోపించారు. అంతకుముందు ఉట్నూర్‌లో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కుమారుడు రాహుల్ వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.కోటితో నిర్మించిన ఏసీ మీటింగ్ హాల్‌ను ప్రారంభించారు. జీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన బ్రాండ్‌తో తేనె బాటిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయసభలో ప్రసంగించారు. అమ్మ ఒడి పేరుతో ఆడబిడ్డలకు రూ.12 వేలు అందజేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

రైతుల రుణమాఫీ చరిత్రాత్మకం.. రైతుల రుణమాఫీ అనేది దేశంలోనే చరిత్రాత్మక ఘట్టమని మంత్రి కేటీఆర్ చెప్పారు. గతంలో యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.70 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తే, కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రం మూడేండ్లలోనే రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు తెలిపారు. రెండు పంటలకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున ప్రతి ఏడాది ఎనిమిది వేల రూపాయలు తమ ప్రభుత్వం పెట్టుబడికి అందజేస్తున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ నేతలు అప్పుడేం చేసిండ్రు.. అభివృద్ధి చూసి ఓర్వలేక దిక్కుతోచని కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటైతే అంధకారంలోకి వెళుతుందన్నారని, కానీ నేడు గృహ, వాణిజ్య అవసరాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, వ్యవసాయానికి తొమ్మిది గంటలు పగటిపూట విద్యుత్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో నిలబడేవారని, సిరిసిల్ల ప్రాంతానికి చెందిన మునిగె ఎల్లయ్య అనే రైతు నిలబడే చనిపోయాడని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో 20 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తే తాము ఈ మూడేండ్లలో 130 గురుకులాలు మంజూరు చేశామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు.

కాంగ్రెస్ పాలనలో కనీసం ప్రాజెక్టులు కట్టలేదని, తీరా ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకునేందుకు చచ్చిపోయినవాళ్ల పేరుతో కేసులు వేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం 25 ఏండ్లు అప్రతిహతంగా పని చేసిందని, ఆ రికార్డును తాము తిరగరాయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే మూడు దశాబ్దాలపాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు గడ్డం వివేకానంద, ఎంపీలు గొడాం నగేశ్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోవ లక్ష్మీ (ఆసిఫాబాద్), కోనేరు కోనప్ప(సిర్పూర్ కాగజ్‌నగర్), ప్రభుత్వ సలహాదారు వివేక్, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాళ్లు పసుల సునితారాణి, మామిడిశెట్టి వసుంధర పాల్గొన్నారు.

కార్మికులు సమ్మెకు దూరంగా ఉండండి వారసత్వం సాధించి తీరుతాం: కేటీఆర్ సింగరేణి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. పనికి మాలిన కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపును ఇచ్చాయని, సమ్మెలోకి వెళ్ల వద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఉద్యోగాలు పోగొట్టింది ఎవరో కార్మికులకు తెలుసన్నారు. కార్మికుల పిల్లలకు వచ్చే ఉద్యోగాలను జాతీయ కార్మిక సంఘాలు దూరం చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సమ్మె చేసే అర్హత వారికి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్ల సూరీళ్లు ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. వారి కోసం సకల జనుల సమ్మె వేతనంతో పాటు, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చామని, ఎప్పుడు లేని విధంగా బోనస్ సైతం అధికంగా ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఆయన వెల్లడించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో పాటు టీబీజీకెఎస్ నేతలు కృషి చేస్తున్నారని చెప్పారు. తాను సైతం ఎట్టి పరిస్ధితిలో ఆ హక్కును సాధించడం కోసం కృషి చేస్తానన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.