Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి కుటుంబాలకు మీటర్ల కాటు

-కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే విద్యుత్తు సబ్సిడీలు ఉండవ్‌
-ప్రతి కరెంటు కనెక్షన్‌కు ప్రీపెయిడ్‌ మీటర్‌ పెట్టాల్సిందే
-విద్యుత్తు ఉద్యోగులారా.. 20 లక్షల కొలువులు ఊడుతయ్‌
-ఆర్టీసీనీ అమ్మేయాలని కేంద్ర సర్కారు లేఖలు రాస్తున్నది
-అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరిక

మీటర్లపై బొంకుతున్న బీజేపీ నాయకులు అన్ని రంగాలనూ అమ్మేసిన ప్రధాని మోదీ ఎవుసం, విద్యుత్తును వ్యాపారులకు ఇచ్చే కుట్ర విద్యుత్తు బిల్లును వెంటనే వాపస్‌ తీసుకోండి లేదంటే 20 లక్షల మంది ఉప్పెనై ఉద్యమిస్తరు చెత్తను వినియోగించే తెలివి విశ్వగురువుకు లేదు బీజేపీ పాలనావిధానాలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌ కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు నేడు అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న కేసీఆర్‌.

నిన్ను చంపనే చంపేస్తా.. నీవు మీటరు పెట్టే తీరాల అంటే ఏం చేయాలె? ఏమి చేసైనా సరే తెలంగాణలో కరెంటు బంద్‌ చేపియ్యాలనుకుంటున్నరు. అరే ఏ క్యా బాత్‌ హోగయా బై. నేను చాలా బాధతో చెప్తున్న. తెలంగాణ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త.. మేము విద్యుత్తును 24 గంటలపాటు ఇస్తున్నం. మీకు (కేంద్రం) చేతకాకుంటె.. దానికి మేమేం చేయాల? మిమ్మల్ని ఒక్కరూపాయి అడిగినమా మేము? సబ్సిడైజ్‌ చేయమన్నమా? మా డబ్బులు, మా ప్రభుత్వ బడ్జెట్‌లోనుంచి మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నం.
– సీఎం కేసీఆర్‌

విద్యుత్తు సంస్కరణల్లో ఒక ఆర్డర్‌ పాస్‌ చేసిన్రు. మీరు రూ.4వేలకు కొనే బొగ్గు బంద్‌ పెట్టాలె. 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలె. ఆ బొగ్గు టన్నుకు 35 వేల వరకు ఉంటది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చి అమ్మించేందుకు, ఆయన వ్యాపార మిత్రులకు లాభం కలిగించేందుకు ఈ ఘనత వహించిన విశ్వగురువు విద్యుత్తు సంస్కరణ పేరిట తెచ్చిన ఆర్డర్‌ ఇది. హి ఇజ్‌ ది మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫ్‌ దిస్‌ కంట్రీ.

ఈ దేశ ప్రభుత్వాన్ని నిందించాల్సి రావడం నా బ్యాడ్‌లక్‌. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఇలాంటి దుష్ట సమయం రావొద్దు. అసెంబ్లీలో ఒక సీఎం లేచి కేంద్రాన్ని విమర్శించే దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు? దానికి ఎవరు బాధ్యులు? నేను దుఃఖంతో, బాధతో ఈ విషయం చెప్తున్న.

ఇప్పటికి 11 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోశారు. చెప్పుకోవడానికి సిగ్గుండాలె. తెలంగాణలో మూడు తోకలు లేవు. కూలగొడతం అంటరు. పోగాలం వచ్చింది కాబట్టే అట్ల మాట్లాడుతున్నరు. ప్రజలకు తెలుసు ఎవరిని తీసేయాలనేది.

రెండు చేతులు జోడించి కేంద్రాన్ని కోరుతున్నా.. దయచేసి రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక కరెంటు సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోండి. మీ ఏకపక్ష పోకడలతో ప్రజలను ఇబ్బంది పెట్టకండి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చేసిన గెజిట్లో విస్పష్టంగా పేర్కొన్నదని.. కేంద్రం చెప్పినట్టుగా మీటర్లు పెడితే.. తెలంగాణలోనే దాదాపు కోటి కుటుంబాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇకపై ప్రతి కనెక్షన్‌పై ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాల్సి వస్తుందని.. ఇదే జరిగితే పేదలకు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీలు ఉండబోవని, దేశ విద్యుత్తు రంగంలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. కేంద్ర విద్యుత్తు బిల్లు పర్యవసానాలు అన్న అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

మీటర్లు పెడితే కోటి కుటుంబాలపై ప్రభావం
మీటర్లు పెడితే రాష్ట్రంలో సుమారు 98 లక్షల కుటుంబాలకు.. అంటే ఇంచుమించు కోటి కుటుంబాలకు దెబ్బ తగులతది. దళితులకో, గిరిజనులకో, రైతులకో, రజకులకో, నాయీ బ్రాహ్మణులకో, పౌల్ట్రీ ఇండస్ట్రీకో, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీకో, ఇతర చిన్న పరిశ్రమలకో.. వారిని బతికించాలనే ఉద్దేశంతో విద్యుత్తులో కొంత సబ్సిడీ ఇస్తాం. కేంద్ర చెప్పిన సంస్కరణలను తెలంగాణలో యథాతథంగా అమలు చేస్తే తక్షణమే వీటన్నింటికీ మీటర్లు పెట్టాల్సిందే. ఈ సబ్సిడీలు అన్నీ పోతయి. ఈ దేశంలో విద్యుత్తు రంగంలో 20 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నరు. వీళ్లంతా కూడా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వినాలి. వీళ్ల నౌకర్లు కూడా గ్యారంటీగా పోతయి. బిల్లులో మీటర్లు పెట్టాలనే పదం లేదంటూ రఘునందన్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పెద్ద తప్పు. చాలా క్లియర్‌గా కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో ఉన్నది. ‘నో కనెక్షన్‌ షల్‌ బి గివెన్‌ వితౌట్‌ ఏ మీటర్‌. అండ్‌ సచ్‌ మీటర్‌ షల్‌ బి స్మార్ట్‌ ప్రీపేమెంట్‌ మీటర్‌’ ఇది కేంద్రం నిన్నగాక మొన్న ఇచ్చిన గెజిట్లోనే ఉన్నది. మీటర్ల గురించి ఇంత స్పష్టంగా ఉంటే బీజేపీ నేతలేమో ‘మోటర్లకు మీటర్లు పెట్టాలని లేదు.. మేం అనలేదు’ అని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో మోటర్లకు మీటర్లు పెడితే అక్కడి రైతులంతా కలిసి, వాటన్నింటినీ తీసుకొచ్చి కుప్పపోసి ధర్నా చేసిన్రు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అవుతదని, ప్రాణం పోయినా సరే దీన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఏపీలో వాస్తవాలు తెలుకొన్నాం. యూపీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్తు ఇస్తామని తియ్యటి మాటలు చెప్పిన్రు. ఇప్పుడు అక్కడ మీటర్లు పెడితే రైతులందరూ వాటిని తెచ్చి కరెంట్‌ ఆఫీసుల ముందు పోసి ధర్నాలు చేస్తున్నరు. పైకి ఒకటి చెప్తూ.. లోపల మరొకటి చేస్తున్నరు. తమ పార్టీ మీటర్లు పెట్టదని రఘునందన్‌రావు అంటున్నారు. మీటర్లు పార్టీ పెట్టదు.. ప్రభుత్వం పెడుతుంది. అంటే పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్‌ ఉన్నదా? మీపై మీకు అపనమ్మకం ఉన్నదా? వాస్తవం కండ్ల ముందు కనిపిస్తున్నది. ఒక్క అగ్రికల్చర్‌ కనెక్షన్‌ మాత్రమే కాదు.. ఏ రకమైన విద్యుత్తు కనెక్షన్‌ అయినా. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్‌ ఫిక్స్‌ చేయకుండా ఇవ్వడానికి లేదని శాసించి, దీనికి వ్యతిరేకంగా వెళితే తొక్కి సంపుతామన్నట్టు మాట్లాడుతున్నరు. ఇది సంస్కరణ కాదు… రైతులను, పేదలను దోచుకొనే దుర్మార్గం. దీనికి సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగారు. వీటిని అమలు చేసిన వారికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5% పెచుతామని అని కేంద్రం చెప్పింది. ఇది అన్యాయమని నేను చెప్పిన.

8 ఏండ్ల తర్వాత తలసరి విద్యుత్తు వినియోగం
-తెలంగాణలో 1156 యూనిట్లు
-దేశంలో 298 యూనిట్లే
-విశ్వగురువు నరేంద్రమోదీ సాధించిన ఘనత ఇదీ..

కరెంటు బందు పెట్టాల్నా?
‘నిన్ను చంపేస్తా.. నువ్వు మీటర్‌ పెట్టి తీరాల’ అంటే ఏమి చేయాల? తెలంగాణలో కరెంటు బంద్‌ చేపియ్యాల. తెలంగాణ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త. మేం ఇచ్చిన వాగ్దానం ప్రకారం విద్యుత్తు 24 గంటలు ఇస్తున్నం. ఇందుకు మిమ్మల్ని (కేంద్రాన్ని) ఒక్క రూపాయి అడిగినమా? సబ్సిడైజ్‌ చేయమన్నమా? గ్రాంట్‌ ఇవ్వమన్నమా? మా ప్రభుత్వ బడ్జెట్‌లో నుంచి మా రైతాంగానికి ఇచ్చుకొంటున్నం. సమైక్య రాష్ట్రంలో చెదిరిపోయిన మన రైతాంగం మల్ల గ్రామాలకు చేరాలె. రూపాయి ఎక్కువైనా మంచిదే.. కడుపునిండా వాళ్లకు నీళ్లు రావాలె. మిషన్‌ కాకతీయ చేసుకొని, భూగర్భ జలాలు పెంచి, వాగుల మీద, వంకల మీద నాలుగు చెక్‌డ్యాంలు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగ కొన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు తెచ్చి, దీన్ని కొంచెం సదురుకుందాం రా బాబూ అంటే కండ్లల్ల నిప్పులు పోసినట్టు ఇదేమి దుర్మార్గం? మేం రైతులకిచ్చేది నిజమైన ఉద్దీపన. నేను గర్వంగ చెప్తున్న. చరిత్రలో మొదటిసారి ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడినయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. వానకాలం సాగు 1.30 కోట్ల ఎకరాలు దాటిపోతున్నది. మీరు మా వెంట ఎందుకు పడుతున్నరు? తెలంగాణ వచ్చిన్నాటికి విద్యుత్తు ఉత్పత్తి 7 వేల మెగావాట్లు. ఇప్పుడు 17 వేల మెగావాట్లు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్‌ చేస్తే.. ఎన్టీపీసీ పెట్టి 4 వేల మెగావాట్లు ఇయ్యమంటే.. ఇయ్యాల్టికి 4 మెగావాట్లు ఇయ్యలే. 8 ఏండ్లు చాలదా విశ్వగురువు గారికి? భట్టి విక్రమార్క చెప్పిన్రు ఇందాక. వారు సైప్లె చెయ్యకపోతే.. ఎక్కువ ధరకు ఏడెనిమిదొందల కోట్లు అదనంగా ఖర్చుపెట్టి అప్పులు తెచ్చి, వడ్డీలకి తెచ్చి పవర్‌ కొని ప్రజలకు సైప్లె చేసినం. అవైతే మాట్లాడరట. ఏపీ నుంచి బకాయి ఇప్పియమని అడిగినం. విద్యుత్తు మంత్రిపోయి చెప్పిండు స్వయంగ. అవేవీ వినలేదు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో పొలం వద్ద మీటర్‌ రీడింగ్‌ తీస్తున్న సిబ్బంది (ఫైల్‌)

18% మిత్తితో ఏపీకి కట్టుమంటున్నరు..
ఇప్పుడేంది.. తెలంగాణ ముఖ్యమంత్రేమో మీటరు పెట్టా అంటున్నడు. కాబట్టి ఏపీకి మనం మూడు వేల కోట్లు బాకీవున్నమని లెక్క దీసి, దానికో మూడువేల కోట్లు మిత్తి.. ప్రపంచంలో ఎక్కడలేని 18% మిత్తితోటి 6 వేల చిల్లర కోట్లు 30 రోజుల్లోపు కడతవా? లేకుంటే చర్యలు తీసుకోవాల్నా? అంటున్నరు. ఏం చర్యలు? మనకు వచ్చే దాంట్లో ఆపుతరు. ఎక్కువ డబ్బులు పెట్టినందున కాస్ట్‌వేరియేషన్‌ రూ.2,466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం. కేంద్రం మన ఫిర్యాదు పట్టించుకోకపోవడం వల్ల జరిగిన నష్టం. రఘునందన్‌ రావు తాను తెలంగాణ ఎమ్యెల్యేనే అనుకొంటే.. మనకు ఏపీ నుంచి రావాల్సింది రూ.17,828 కోట్లు. అందులో 6 వేల కోట్లు మినహాయించుకొని కడమయి ఇప్పియ్యాలి. నేను అసెంబ్లీ ద్వారా చెప్తున్నా.. ఇది అబద్ధమైతే నేను ఒక్కటే నిమిషంలో రాజీనామా చేస్త. ఇవి అధికారిక లెక్కలు. అబద్ధాలు చెప్పేవి కావు. ఇవన్నీ మన ఇన్వెస్ట్‌మెంట్లు, మన ఎంప్లాయీస్‌ డబ్బులు, ట్రస్టు ఫండ్స్‌.

బడా వ్యాపారులకు అప్పజెప్పే కుట్ర
వందకు వంద శాతం దీని వెనుకున్న కుట్ర ఏందంటే మొత్తం డిస్కాంలను, ట్రాన్స్‌కోను, జెన్‌కోను.. ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతున్నది. ఇయాల మొత్తం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు లక్షల కోట్ల ఆస్తులున్నయ్‌. వీటిని ప్రైవేటుకు వట్టిగనే ఇయ్యాల్నట. ఈ మీటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల దగ్గర్నే కొనుక్కోవాల్నట. అది ఎట్ట తిరుగుద్దో మరి. హెలికాప్టర్‌ పంకా తిరిగినట్టు తిరుగుద్దో, ప్రజలు కండ్లు తిరిగి అడ్డంపడిపోవాల్నో.. ఎట్ల తిరుగుద్దో అర్థం కాదు. స్మార్ట్‌ మీటర్లను డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ఎవడైతే బిల్లు వసూలు చేస్తడో వాడికాడనే కొనుక్కోవాల్నట. అందులో ఒక దందా ఉంటది. విద్యుత్తు సంస్కరణల పేరిట చేస్తున్న దగా ఇది. దేశం మేల్కొని బెబ్బులిలాగ అడ్డుకోవాల. ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రాణాలు పోయినా సరే.. అధికారాలు శాశ్వతం కాదు ఎవరికీ. ఉంటే ఉంటం, పోతే పోతం. కచ్చితంగా తెగించి, ఎక్కడిదాకైనా పోరాడి దీన్ని నిలువరిస్తం. ఊకుండే సమస్య లేనే లేదు.

విమానాలు పాయే, ఓడరేవులు పాయే, రైళ్లు పాయే, రైల్వే స్టేషన్లు పాయే.. అన్నీ పోతున్నయి. ఇప్పుడు కేంద్రం ఎవుసానికి, కరెంటుకు సూటి పెట్టింది. ఈ రెండు రంగాలను కూడా బడా వ్యాపారులకు అప్పజెప్పే వరకు మేం నిద్రపోమన్నది కేంద్ర ప్రభుత్వ శపథం. దీనికి తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ. చూడటానికి మంచిగనే అనిపిస్తది. రైతులు తమ పంటను లాభమున్న చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటరు. బాన్సువాడ రైతులు వడ్లు తీసుకెళ్లి పంజాబ్‌లో అమ్ముతరా? ఇది అయ్యే పనేనా? దుబ్బాక రైతులొచ్చి సిద్దిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదు. వచ్చే ఆ నాలుగు పైసలు కూడా కేంద్రం పెంచిన డీజిల్‌ కిందకే పోతయి. ఎకరం పొలం దున్నాలంటే ట్రాక్టర్‌కు గతంలో ఎంత ఉండే.. ఇప్పుడెంత ఉన్నది? ట్రాన్స్‌పోర్ట్‌ చేసుకొని ఎక్కడైన అమ్ముకోవచ్చనే మాట ఎంత దగా, ఎంత మోసం? దీని పేరుపై ప్రస్తుత వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. అసలు సంగతేంటంటే.. ఎరువులు ధరలు పెంచాలె.. డీజిల్‌ ధరలు పెంచాలె.. దున్నే ధరలు పెంచాలె.. కోసే ధరలు పెంచాలె.. విద్యుత్తు బిల్లు పెంచాలె.. మీటర్‌ పెట్టాలె.. చివరికి రైతు ఎవుసం బంద్‌ చేసి తట్టపార కింద పెట్టాలె! ఇగ ఈ ఎవుసం మాతో కాదని రైతులు సాలిచ్చుకోవాలె. ఇగ అప్పుడు సూట్‌కేసులు పట్టుకొని కార్పొరేట్లు దిగుతరు. ‘మీతో ఎవుసం కాదు. మేం కార్పొరేట్‌ కంపెనీలం రెడీగా ఉన్నం. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నయి. మీరు పక్కకు జరిగి ఈ భూములన్నీ మా కంపెనీలకు అప్పచెప్పండి. ఈ భూముల్లోనే మీరు కూలీ పనులు చేయండి’ అని దిగుతరు. అంతేకాదు.. ఆహార సబ్సిడీలన్నింటినీ ఖతం పట్టించేసి, ఫుడ్‌ సెక్టార్‌ను కూడా కార్పొరేట్‌కు కట్టపెడుతరు. వాస్తవాలను ప్రజలకు చెప్పక తప్పదు.

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ
ఉమ్మడి ఏపీలో కరెంటు, సరఫరా గురించి ఎన్ని బాధలు ఎదుర్కొన్నమో మనందరం ప్రత్యక్షసాక్షులమే. తెలంగాణ వచ్చినంక ఘోరాతి ఘోరంగా మోదీ ప్రభుత్వం తన మొట్టమొదటి క్యాబినెట్‌ మీటింగ్‌లోనే అప్రజాస్వామికంగా, తెలంగాణ గొంతు పిసికేలా ఏడు మండలాలు లాక్కోవడం, మరీ ముఖ్యంగా 460 మెగా వాట్ల సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ను కూడా అప్పగించడం దారుణం. తెలంగాణకు విద్యుత్తు సమస్య ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు వినియోగం ఎక్కువ. తెలంగాణ గతి మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పినా పట్టించుకోలేదు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాలేదు కాబట్టి ప్రజలంతా బోర్లు వేసుకున్నారు. తెలంగాణలో ఉన్నన్ని బోర్లు దేశంలో మరే రాష్ట్రంలో లేవు కాబట్టి తెలంగాణకు విద్యుత్తును ఎక్కువగా కేటాయించాలని కోరితే కొంత కేటాయించారు. ఇందులో భాగంగానే లోయర్‌ సీలేరు ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారు. సింగరేణి కాలరీస్‌ కూడా తెలంగాణలో ఉండాలని నిర్ణయించి కేటాయించారు. ఈ ప్రధాని మోదీ.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారి మొదటి క్యాబినెట్‌ మీటింగ్‌లోనే ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. వాస్తవానికి అది ఆర్డినెన్స్‌ ద్వారా చేయాల్సిన పని కాదు. శాసనసభలు ఒప్పుకొన్నా లేకున్నా.. ఈ అంశాన్ని శాసనసభకు రిఫర్‌ చేయాలి. కానీ అలా చేయకుండా కర్కశంగా, క్రూరంగా ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును మన నుంచి లాగేసుకొన్నారు. దేశంలో మోదీని విమర్శించిన తొలి వ్యక్తిని నేనే. ఆయన ఈ దేశ పెద్ద ఫాసిస్ట్‌ ప్రధాన మంత్రి అని ఆనాడే చెప్పాను. ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాను. అప్పుడు నాపై విమర్శ కూడా చేశారు. ‘మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు.. ప్రమాణం మాత్రమే చేయాలి. ఈ దశలో అధికారంలో ఉంటూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తారా?’ అంటూ విమర్శించారు. ఇస్తం తప్పదని చెప్పిన. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి.. బంద్‌ పాటించినం. ఆ తర్వాత అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. మండలాల సంగతి అలాగే ఉన్నా.. కనీసం మా పవర్‌ ప్రాజక్టైనా మాకు ఇవ్వాలని కోరినం. ప్రధానికి నేను ప్రత్యక్షంగా ఉత్తరాలు రాసిన.. చెప్పిన. కానీ ఆయన కర్కశంగా వ్యవహరించారు.

మన దురదృష్టం అంబేద్కర్‌ బతికిలేరు…
అంబేద్కర్‌ ఉండి ఉంటే కేంద్రం నియంతృత్వ పోకడలపై ఎంత కొట్లాడునో? మన దురదృష్టం కొద్దీ ఆయన లేరు. ఆయన చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తిని ఈ కేంద్రం రోజుకింత కాలరాస్తున్నది. విద్యుత్తు అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నది. దురదృష్టవశాత్తు రాష్ర్టాలతో కనీస సంప్రదింపులు చేయకుండా వారికి ఇష్టమొచ్చిన పద్ధతిలో పార్లమెంట్‌లో ఎవరినీ మాట్లాడనీయకుండా మూకదాడులకు దిగారు. ఒక ప్రతిపక్ష సభ్యుడు లేస్తే.. వందమంది అధికారపక్ష సభ్యులు లేచి రకరకాల పేర్లతో అరవడం, వాళ్ల నోర్లు మూయించి బిల్లులను పాస్‌ చేయించుకున్నారు. పార్లమెంట్‌లో చర్చిస్తే అనేక పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పే అవకాశముంటది. టీఆర్‌ఎస్‌ తరఫున 5 రోజుల పాటు లోక్‌సభను స్తంభింపజేసినం. సమస్యకు ప్రశ్నలేదు, జవాబు లేదు, చర్చ లేదు, కనీసం ఎదుటివాళ్లు చెప్తే వినే సంస్కారం లేదు. బుల్డోజింగ్‌ చేసి దేశాన్ని నడిపే దుర్మార్గ పద్ధతి కొనసాగుతున్నది.

దారుణమైన పాలసీ
దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చిండు. వాటిని వాడే తెలివి కేంద్రానికి లేదు. బికాజ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ ఇరిగేషన్‌ పాలసీ.. బ్యాడ్‌ వాటర్‌ పాలసీ.. బ్యాడ్‌ పవర్‌ పాలసీ. వాళ్లకు సమజ్‌ కాదు, చెప్తే వినరు! సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాల ప్రకారమే దేశంలో స్థాపిత విద్యుత్తుశక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్లు. ఇందులో బేస్‌లోడ్‌ పవర్‌ అంటే 24గంటలు సప్లయ్‌ చేయగలిగే ఫర్మ్‌ పవర్‌ 2,42,890 మెగావాట్లు. ఇది ఎవరూ నమ్మలేని సత్యం. పీక్‌ లోడ్‌ అంటే దేశం అత్యధికంగా వినియోగించే విద్యుత్తు ఎంతంటే ఈ ఏడాది జూన్‌ 22న 2,10,793 మెగావాట్లు. 75 ఏండ్ల దేశ చరిత్రలో అతి ఎక్కువ కరెంటు వినియోగించింది ఈ ఏడాది జూన్‌ 22నే. అంటే పవన, జల, సౌర విద్యుత్తు కాకుండా బేస్‌లోడ్‌లో ఉండే పవర్‌ని కూడా ఈ దేశం ఏనాడూ వినియోగించని దుస్థితి. దీనికి అదనంగా 1.60 వేల మెగావాట్ల విద్యుత్తు ఉన్నది. ఇక్కడ అసెంబ్లీలో చెప్తున్న.. అన్ని రాష్ర్టాల సీఎం, సీఎస్‌ల సమావేశంలో కుండబద్దలు కొట్టి చెప్పిన.. అయ్యా ఈ పాసిబులిటీ ఉన్నది. ఇవి చెయ్యండి. మేము సహకరిస్తం అని. లక్షా 45 మెగావాట్ల జలవిద్యుత్తుకు పాసిబులిటీ ఉన్నదని ఎప్పుడో దశాబ్దాల కింద నివేదిక ఇచ్చిన్రు. ఇయ్యాల్టి వరకు ఎక్స్‌ప్లాయిట్‌ అయింది 40-41 వేల మెగావాట్లే. ఇంకా లక్ష మెగావాట్లకు ఉన్నది. దీంతో పాటు కోసీ, గండకి, భూటాన్‌, టిబెట్‌ నదుల ద్వారా వచ్చే నదుల నీళ్లది కూడా లెక్క జేస్తే, చిన్న డిప్లమాటిక్‌ స్టెప్‌ తీసుకుంటే.. చైనాలో త్రీగార్జెస్‌ డ్యామ్‌ తీసుకుంటున్నట్లు ఇంకో 50-60 వేల మెగావాట్లు వస్తది. దీన్ని వాడే తెలివిలేక, 24 గంటల కరెంటు ఇచ్చే తెలివిలేక, ఇచ్చే తెలంగాణ మీదపడి ఏమి ఏడుపిది? ఇది పద్ధతా? దీనికి మసిపూసి, మారేడుకాయజేసి వాళ్లకి అనుకూలమైన టీవీల్లో, పత్రికల్లో అసత్యమైన వార్తలు రాయించి.. ఎవర్ని మోసం చేయదల్చుకున్నరు?

4వేల బొగ్గు బంద్‌ పెట్టి.. 35వేల బొగ్గు కొనాల్నా?
మన దగ్గర ఉన్న సింగరేణి సంస్థకు నర్సింగరావు ఎండీగా ఉండేవారు. మునిగిపోయే సంస్థను కాపాడిన ఆయనను నాటి కేంద్రప్రభుత్వం కోల్‌ ఇండియాకు చైర్మన్‌ను చేసింది. సింగరేణికి ఎండీగా పనిచేసిన సుతీర్థ భట్టాచార్యకూ కోల్‌ఇండియా చైర్మన్‌ పదవి ఇచ్చిన్రు. మెట్‌పల్లికి చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌ సింగరేణి ప్రస్తుతం ఎండీగా ఉన్నరు. బ్రహ్మాండంగా సంస్థను నడుపుతున్నరు. మన రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ర్టాల్లోని విద్యుత్తు సంస్థలకు సింగరేణి కాలరీస్‌ నుంచి గరిష్ఠంగా రూ.4 వేలకు టన్ను బొగ్గు దొరుకుతది. కంపెనీని మనం రిక్వెస్ట్‌ చేస్తే ఒకటి, రెండు నెలలకు సరిపోయేంత నిల్వ పెట్టుమన్నా పెడుతరు. కేంద్రం ఇప్పుడు అందమైన ముసుగేసి తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణల్లో ఒక ఆర్డర్‌ పాస్‌ చేసిన్రు. మీరు రూ.3,800-రూ.4 వేలకు కొనే బొగ్గు బంద్‌ పెట్టాలె. 10 శాతం విదేశీ బొగ్గు విధిగా కొనాలె అని పెట్టిన్రు. ఆ బొగ్గు టన్నుకు రూ.25 వేల నుంచి 35 వేల వరకు ఉంటది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చి అమ్మించేందుకు, ఆయన వ్యాపార మిత్రులకు లాభం కలిగించేందుకు ఈ ఘనత వహించిన విశ్వగురువు విద్యుత్తు సంస్కరణ పేరిట తెచ్చిన ఆర్డర్‌ ఇది. రూ.4 వేలకు టన్ను దొరికే బొగ్గును బందువెట్టి.. రూ.30 వేలకు కొనుమనుడు విద్యుత్తు సంస్కరణనా? అగ్గువకు దొరికే కరెంటుకు మీటరు పెట్టి, ముక్కుపిండి చార్జీలు వసూలు చేయాలనడం విద్యుత్తు సంస్కరణనా? విదేశీ బొగ్గు కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సరఫరా ఆపేస్తమని బెదిరిస్తున్నరు. కేంద్రం పరిధిలో ఉండే విద్యుత్తులో ఎవరికి ఎంతవాటా పంపాలో ఎప్పుడో నిర్ణయమైంది. కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దాన్ని ఆపేస్తమంటే కుదురదు. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్తు సంస్కరణల్లోని ఒక్కో లైన్‌ అంతరార్థం వివరిస్తాను.

రైతులకు నిజం తెలియాలి…
కరెంట్‌ మీటర్ల వెనుక గల మాయ మశ్చీంద్ర ఏమిటనేది ప్రజలకు, రైతులకు కూడా తెలియాలి. ఈ బిల్లు ఏమిటీ, కేంద్రం ఎందుకు పెడుతున్నది.. రైతులు రోడ్డెక్కి ధర్నాలెందుకు చేస్తున్నరు? వారిని ఎవరు మోసం చేస్తున్నరో వంద శాతం తెలియాలి. 24 గంటల్లో రైతుల వద్దకు వెళ్లి పలకరించకుండా, ఎంత హార్స్‌పవర్‌ పెట్టుకున్నరని అడిగే పనిలేకుండా తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చే విషయం నిజం కాదా? టీఆర్‌ఎస్‌ వచ్చాక ఐదున్నర నెలల్లోనే అహోరాత్రులు పని చేసి కరెంట్‌ సమస్యను తొలగించినం. ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్‌గా నేనుండను సర్‌ అని ప్రభాకర్‌రావు అన్నారు. నేను ఒప్పుకోలేదు.. మీ అనుభవం అవసరమని చెప్పిన. ఎక్కడెక్కడి వాళ్లనో వెతికి తీసుకొచ్చి.. రిటైర్‌ అయినవాళ్లను ఈ సమయంలో వదిలి వెళ్లొద్దని కోరి, వాళ్లను సర్వీస్‌లో పెట్టి ఈ రోజుకు కూడా విద్యుత్తురంగాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాం. అవసరమైతే ఇతర ఖర్చులు, ఇతర సబ్సిడీలు తగ్గించుకొని విద్యుత్తుకు ఖర్చు చేస్తున్నాం. పెట్టుబడులకు, సంక్షేమానికి ఇది అతి ముఖ్యమైన రంగం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయాల్సిన రంగం కాదు. కేంద్రం మాత్రం ఒకేతీరున దీని వెంట పడింది. ‘మాకు చేతకాదు. మేం చెయ్యం. మాకు దూరదృష్టి లేదు, మాకు తెల్వదు’ అన్నట్టుగా కేంద్రం ఉన్నది.

పేరుకే మేకిన్‌ ఇండియా
మీటర్లు పెడితేనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5 శాతం పెచుతం.. అంటే 5 వేల కోట్లు. రూ.25 వేల కోట్లు అవసరమా? లేకపోతే మీకియ్యం అంటరు. మేం వద్దన్నం. రైతులకు కరెంటు ఫ్రీ ఇస్తామన్నం. కేంద్రం విధించిన అంక్షలు, అనుచిత విధానాల వల్ల ఈ రోజు రూ.25 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. సచ్చినా సరే మీటర్లు పెట్టమని చెప్పినం. ఎలాంటి కొత్త కనెక్షన్‌ కూడా ఇవ్వకూడదని ఇటీవలే కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మీటర్‌ కూడా ఇక్కడిది కాదు. చైనాకెళ్లి వస్తది. దాన్ల కూడా కమీషన్‌. మేకిన్‌ ఇండియా. అందరి కండ్లు చక్కెర అచ్చి అడ్డంపడ్డం. ఫలితం ఏందిరా అంటే పతంగి ఎగరేసే మాంజా చైనాదే. జాతీయ జెండా చైనాదే. గీసుకొనే బ్లేడు చైనాదే. గోర్ల కత్తెర కూడా చైనాదే. ఇదీ మేకిన్‌ ఇండియా. ఎన్ని రోజులు ఈ మోసం?

విశ్వగురువు మోదీ ఘనత ఇదీ!
ఈ విశ్వగురువు విశ్వరూపం ఏందో చెప్పుకుంటే దేశం పరువు పోతది. వేరే దేశాల్లో ఇంతవరకు మన ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపలేదు. కానీ.. శ్రీలంకలో లక్షలమంది యువకులు రోడ్ల మీదికొచ్చి అరుస్తున్నరు. ‘భారత ప్రధాని ఒత్తిడి చేస్తేనే అదానీ కంపెనీకి లైసెన్స్‌ ఇచ్చినం. వాళ్లు అధిక ధరలకు కరంటు అమ్ముతున్నరు’ అని శ్రీలంక పార్లమెంట్‌ కమిటీ ముందు ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌ చెప్పిండు. తెలంగాణ ఏర్పడి ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలోనే కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజున తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 970 యూనిట్లు. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం 957 యూనిట్లు. ఎనిమిదేండ్ల పాలన తర్వాత తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లు. అంటే దాదాపు 1,156 యూనిట్లు పెరిగింది. ఇది కేంద్రం ఆధీనంలోని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించిన లెక్క. జాతీయ సగటు 957 నుంచి 1,255 యూనిట్లకు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం తలసరి విద్యుత్తు వినియోగాన్ని 1,156 యూనిట్లు పెంచితే మహత్తరమైనటువంటి విశ్వగురు అని ప్రచారం చేసుకొనే మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత కేవలం 298 యూనిట్లు. ప్రజల కోసం, పేదల కోసం, దేశం కోసం పనిచేసే ప్రధాన మంత్రి అంటూ రఘునందన్‌రావు పొగిడిన మోదీ పెంచిన పెరుగుదల ఇది. మన తలసరి విద్యుత్తు వినియోగం 1,255 యూనిట్లు ఉన్నదంటే ఏది అభివృద్ధి? చిన్న దేశం ఐస్‌లాండ్‌ తలసరి విద్యుత్తు వినియోగం 51,696 యూనిట్లు, అమెరికాది 12,154 యూనిట్లు, జపాన్‌ 7,150, చైనా 6,312 యూనిట్లు. మన పక్కనున్న భూటాన్‌ అనే చిన్న దేశం తలసరి విద్యుత్తు వినియోగం కూడా 3,126 యూనిట్లు. అన్ని దేశాలు అభివృద్ధిని అనేక కొలమానాల ద్వారా చూస్తాయి. ఇందులో ప్రధానమైన సూచిక తలసరి విద్యుత్తు వినియోగం. ఏ దేశం, ఏ రాష్ట్రం ఎంత విద్యుత్తు ఉపయోగిస్తున్నదనే విషయం ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ 140 దేశాలను సర్వే చేస్తే అందులో మన దేశ ర్యాంకు 104. ఇది విశ్వగురు సాధించిన మహత్తర ఫలితం. విశ్వగురువు ఇలాగే పోతే దేశం విషం అయితదా.. కాదా? దేశ ప్రజలే ఆలోచించుకోవాలి.

ఉద్యోగులు సింహాల లెక్క జూలు విదిలించి పోరాడాలె
మరోసారి రెండు చేతులు జోడించి కేంద్రాన్ని కోరుతున్నా.. దయచేసి రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక కరెంటు సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోండి. మీ ఏకపక్ష పోకడలతో ప్రజలను ఇబ్బంది పెట్టకండి. చట్టాలు చేయడం, ఉపసంహరించుకోవడం కొత్త కాదు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. రైతులు ఉద్యమిస్తే ఉపసంహరించుకున్నారు. మూడు వ్యవసాయచట్టాలను తీసుకువచ్చారు. వాటిని కూడా వెనక్కి తీసుకున్నారు. రైతులకు స్వయంగా ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కూడా మా మాటలు వినండి. విద్యుత్తు సంస్కరణలను వెనక్కి తీసుకోండి. లేదంటే 20 లక్షల మంది విద్యుత్తు కార్మికులు సింహాల లెక్క జూలు విదిల్చాలె. ఉద్యోగులందరినీ, పట్టణాలన్నింటినీ కూడగట్టి కేంద్రం మెడలు వంచుతం. రూ.లక్షల కోట్ల విద్యుత్తు ఆస్తులను కాపాడటానికి భయంకరమైన యుద్ధం చేయాలె. బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంకో 17-18 నెలలు అంతే. వందశాతం ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపుతాం. తెలంగాణలో ఇస్తున్నట్టే దేశ రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇస్తాం. వ్యవసాయం, ఇరిగేషన్‌ రంగాలు కలిపి వాడుకుంటున్న కరెంటు 20.8% మాత్రమే. దానికి అయ్యే ఖర్చు రూ.1.45 లక్షల కోట్లే. ఎన్పీయేలు, ఉద్దీపనల పేరిట బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు ఇవ్వొచ్చుగానీ 15 కోట్ల రైతు కుటుంబాలకు ఉచిత కరంటు ఇవ్వలేమా? కేంద్రం వెంటనే విద్యుత్తు బిల్లును వాపస్‌ తీసుకోకుంటే, బాయిలకాడ మీటర్‌ పెడితే, భారత రైతాంగం మొత్తాన్ని ఉప్పెన లాగా లేపి, ఉద్యమించి బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. ఈ మధ్యే 28 రాష్ర్టాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చినరు. సార్‌ మీరు బయల్దేరండి, దేశంలో విప్లవం తెద్దాం అని ముక్తకంఠంతో కోరిన్రు. ఆ విప్లవం వస్తుంది జాగ్రత్త అని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా.

అందుబాటులో అద్భుతమైన విద్యుత్తు
దేశంలో అద్భుతమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నది. థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలు 2,04,080 మెగావాట్లు. గ్యాస్‌ ద్వారా 24,900 మెగావాట్లు. అణు విద్యుత్తు 6,780 మెగావాట్లు. అట్లనే లిగ్నైట్‌ ద్వారా వచ్చేది 6,620 మెగావాట్లు. డీజిల్‌ ఉపయోగించి చేసేది 510 మెగావాట్లు. ఇదంతా కూడా మాగ్జిమమ్‌ 99% కాంగ్రెస్‌, లేదంటే యూపీఏ హయాంలోనే స్థాపించినవే. బీజేపీ వచ్చాక ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చెప్పేదంతా గోల్‌మాల్‌. ఇప్పుడు పెట్టేది వేరే. బీజేపీ అనుకూల షావుకార్లు 50 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు పెడతమని తిరుగుతున్నరు. వాళ్ల కోసమే ఈ సంస్కరణలు. దేశంలో 43, 300 మెగావాట్ల కార్ఖానాలు, ఒడిశాలో, ఛత్తీస్‌గఢ్‌లో తయారై ఉన్నయి. అవి మొదలుకావు. ఇక వేరియబుల్‌ పవర్‌, ఇన్‌ఫర్మ్‌ 24 గంటలు ఉండదు. సౌరవిద్యుత్తు 57,974 మెగావాట్లు. జలవిద్యుత్తు 51,738 మెగావాట్లు. పవన విద్యుత్తు 40,893 మెగావాట్లు. బయోమాస్‌ అంటే తడిచెత్త ద్వారా 10,206 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నరు. విశ్వగురువు చెత్తను వాడుకున్నా బోలెడంత కరెంటు వచ్చేది. ప్రభుత్వాలను కూలగొట్టుడు. తొడగొట్టాల్సిన పనిలేదు. పడగొట్టాల్సిన పనిలేదు. లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఆ చెత్తను వినియోగించుకొనే తెలివి లేదు కేంద్రానికి. విదేశాలు వెలుగులు సృష్టిస్తుంటే మన దేశం చీకట్లకు పోతున్నది.

చూడటానికి మంచిగనే అనిపిస్తది. రైతులు తమ పంటను లాభమున్న చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటరు. బాన్సువాడ రైతులు వడ్లు తీసుకెళ్లి పంజాబ్‌లో అమ్ముతరా? ఇది అయ్యే పనేనా? దుబ్బాక రైతులొచ్చి సిద్దిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదు. వచ్చే ఆ నాలుగు పైసలు కూడా కేంద్రం పెంచిన డీజిల్‌ కిందకే పోతయి. ఎకరం పొలం దున్నాలంటే ట్రాక్టర్‌కు గతంలో ఎంత ఉండే.. ఇప్పుడెంత ఉన్నది? ట్రాన్స్‌పోర్ట్‌ చేసుకొని ఎక్కడైన అమ్ముకోవచ్చనే మాట ఎంత దగా, ఎంత మోసం?
– సీఎం కేసీఆర్‌

ఈ దేశంలో విద్యుత్తు రంగంలో 20 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నరు. వీళ్లంతా కూడా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వినాలి. వీళ్ల నౌకర్లు కూడా గ్యారంటీగా పోతయి. బిల్లులో మీటర్లు పెట్టాలనే పదం లేదంటూ రఘునందన్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పెద్ద తప్పు. చాలా క్లియర్‌గా కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో ఉన్నది. ‘నో కనెక్షన్‌ షల్‌ బి గివెన్‌ వితౌట్‌ ఏ మీటర్‌. అండ్‌ సచ్‌ మీటర్‌ షల్‌ బి స్మార్ట్‌ ప్రీపేమెంట్‌ మీటర్‌’ ఇది కేంద్రం నిన్నగాక మొన్న ఇచ్చిన గెజిట్లోనే ఉన్నది. మీటర్ల గురించి ఇంత స్పష్టంగా ఉంటే బీజేపీ నేతలేమో ‘మోటర్లకు మీటర్లు పెట్టాలని లేదు.. మేం అనలేదు’ అని చెప్తున్నారు.
– సీఎం కేసీఆర్‌

యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ తుది దశకు

నేను తెలంగాణ ప్రజలకు సంతోషకరమైన వార్త చెపున్న. ఏడాది ఏడాదిన్నరలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ పనులు దగ్గరపడతయి. ఇప్పుడున్న ఖరీదైన పవర్‌ కూడా బంద్‌ అయితది. ఈ కేంద్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో ప్రజలకు తెలవాల. రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అని రెండు సంస్థలు ఉంటాయి. ఎనకట కాంగ్రెస్‌ గవర్నమెంట్‌లో స్టార్ట్‌ అయినవి. అవి ఇవాళ రూ.లక్షల కోట్ల సంస్థలైపోయినవి. మహారత్న, నవరత్న స్థాయికి చేరుకున్నయ్‌. రెండింటి దగ్గర రూ.14-15 లక్షల కోట్ల ఆస్తి ఉన్నది. దేశంలో విద్యుద్దీకరణ కోసం.. ట్రాన్స్‌కోలు, జెన్‌కోలు.. విస్తరించుకోవడం, స్థిరీకరించుకోవడం కోసం, లేదా కొత్తది పెట్టుకోవడం కోసం ఈ సంస్థల దగ్గర అప్పులు తెచ్చుకొని పనిచేస్తయి. మనం కూడా అట్లనే తెచ్చుకొని చేస్తం. ఇప్పుడు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ మన వెంట పడ్డడు. హోంమంత్రి, పీఎంవోలో ఉన్న వ్యక్తులందరూ కలిసి ఆర్‌ఈసీ లోన్లన్నీ బంద్‌ చేయించిండ్రు. ఒప్పందాలు మధ్యలో మార్చి, కొత్త షరతులు పెట్టి, ట్రైపార్టీ అగ్రిమెంట్‌ పెట్టిన్రు. దాని మీద సంతకం పెట్టు.. లేకుంటే నీ లోన్‌ బంద్‌ అని బంద్‌ పెట్రిన్రు. ఇది కరెక్టు కాదు. ధర్మం కాదు.. తప్పు పద్ధతి. మీరు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నరు. తెలంగాణ ఒక మంచి పని చేసింది. పబ్లిక్‌ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌కే ఆర్డర్లు ఇచ్చింది. బీహెచ్‌ఈఎల్‌లో వేలమంది కార్మికులు పనిచేస్తున్నరు. వారు దెబ్బతింటరు.. టైమ్‌లీ రిలీజ్‌ చేసే ఫండ్స్‌ని ఆపితే పురోగతి దెబ్బతింటది. ఇది పెరిగే పవర్‌ డిమాండ్‌కు ప్రతిబంధకంగా పరిణమిస్తదని ఆర్కే సింగ్‌కు కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే ఉత్తరం రాశారు. ఇద్దరు కేంద్రమంత్రుల మధ్య వైరుధ్యమేందో, ఏమి జరుగుతున్నదో వాస్తవం తెలవాల.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.