Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటిమంది బాబులొచ్చినా పాలమూరునాపలేరు

హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చినా.. కోటిమంది చంద్రబాబులు అడ్డంపడినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నీ కండ్ల ముందే పాలమూరు కట్టి చూపిస్తా..ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పనులు చేయిస్తా అని చంద్రబాబుకు సవాలు చేశారు. కృష్ణానదీ జలాలు ఎవడి అబ్బసొత్తు కాదు.. అవి తెలంగాణ ప్రజల జన్మహక్కు అని కేసీఆర్ తేల్చి చెప్పారు. గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను ఆవిష్కరించిన కేసీఆర్, సాయంత్రం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి అనుమతి లేదంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా నిప్పులు చెరి గారు. పట్టిసీమ, పోతిరెడ్డిపాడులకు అనుమతులున్నాయా? ఎవరిని అడిగి కట్టారు? అని కడిగిపారేశారు. ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేసిన కేసీఆర్, నాలుగేండ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి పాలమూరు రైతుల పాదాలు కడుగుతానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు జిల్లా ప్రజల ఆరాధ్యదైవం కురుమూర్తి పేరు పెడుతున్నట్టు సభావేదిక పైనుంచి ప్రకటించారు.

KCR-addressed-in-Mahabubnagar-public-meeting

-పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన -ప్రాజెక్టుకు జిల్లా ఆరాధ్యదైవం కురుమూర్తి పేరు.. -నిర్వాసితుల కడుపు నింపిన తర్వాతే పనులు – నీ కండ్లముందే ప్రాజెక్టు కట్టి చూపిస్తా.. – కృష్ణా జలాలు తెలంగాణ జన్మహక్కు – నాలుగేండ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తా -భూములు సేకరించం.. కొంటాం – ముంపు గ్రామాల్లో ఇంటికో ఉద్యోగం – భూత్పూర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలెంలో వ్యవసాయ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కృష్ణా జలాలు తెచ్చి పాలమూరు రైతుల పాదాలు కడుగుతానని కేసీఆర్ అన్నారు. ఇవాళ తనకెంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు. జీవితంలో మంచి పనులు చేసే అవకాశం , ప్రజల దుఖంలో పాలుపంచుకునే అవకాశం కొందరికే వస్తుందని అన్న సీఎం ఇవాళ తనకు ఆ అవకాశం దక్కిందని అన్నారు. బొట్టుబొట్టుకు పరితపించిన జిల్లా పాలమూరు అని గుర్తు చేశారు. ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లా పరిస్థితిని చూసి కంటనీరు పెట్టుకున్నానని, అలంపూర్ జోగులాంబ అమ్మవారి పాదాలకు మొక్కి గద్వాల వరకు పాదయాత్ర చేశానని వివరించారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మహబూబ్‌నగర్ ఎంపీగా తెలంగాణ సాధించానని తెలంగాణ సమాజంలో ఆ గౌరవం పాలమూరుకు చిరకాలం ఉంటుందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు ఆమోదం తెలపాలని కోరితే తమ మంత్రివర్గ సభ్యులంతా చప్పట్లు కొట్టి ఆమోదించారని చెప్పారు. నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. రానున్న మూడేండ్లలో 70 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు.

మోదీ నీకే కాదు మాకూ ప్రధానే. ప్రధాని మోదీ నీలాంటి కుక్కల మాట విని పాలమూరు ప్రజలకు నీరు ఇవ్వొద్దంటాడా? అని ప్రశ్నించారు. మైండిట్ చంద్రబాబు, మైండిట్ దేనినేని.. మీ ఆటలు సాగవు. ఎవరు అడ్డువచ్చినా పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతాం అని కేసీఆర్ అన్నారు. త్వరలో ఆర్డీఎస్ దగ్గర కూర్చొని పనులు చేయిస్తానని కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును ప్రధాని అడ్డుకుంటారనుకోవడం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో.. వారే ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు, దేవినేని ఉమ గుర్తుంచుకోవాలన్నారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు రాష్ట్రం వచ్చినా ఆంధ్రాపీడ ఇంకా పోవడం లేదని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు కట్టారని, అవి ఏ మాత్రం వినియోగంలోకి రాలేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసే అదృష్టం తనకు వచ్చిందని, 3 -4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. రూ. 35,200 కోట్లతో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. పాలమూరులో గత పాలకులు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు.

పరిహారం చెల్లించాకే పనులు.. ఈ ప్రాజెక్టు కింద కేవలం మూడు తండాలు మాత్రమే ముంపుకు గురవుతున్నాయని అని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే వారికి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెడతామన్నారు. మీ కడుపులు నింపాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం.. అందరికీ వెంటనే ఉద్యోగాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తాం అని చెప్పారు. మూడు తండాల్లో ముంపుకు గురైన వారికి పక్కా ఇండ్లు కూడా కట్టి ఇస్తామన్నారు. జిల్లా ప్రజలకు మంచి కలెక్టర్ దొరికారని, అందరూ వివరాలు అందజేయాలని కోరారు. కష్టపడితే కానీ ప్రాజెక్టు పనులు పూర్తి కావని, అందుకే ఇక్కడే ఓ గుట్టపై గెస్ట్ హౌజ్ కట్టుకుని, ప్రతి పదిహేను రోజులకోకసారి వచ్చి పనులను పరిశీలిస్తానని కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం కరివెనకు వస్తున్నప్పుడు ఓ గుట్టను కూడా అధికారులకు చూపించానని తెలిపారు. పాలమూరు లిఫ్ట్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌కు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తామని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. గట్టుకాల్వకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు, పాలెంలో వ్యవసాయ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతలకు ఓఎస్‌డీగా ఈ జిల్లా బిడ్డ రంగారెడ్డిని నియమించామన్నారు. పాలమూరుకు ఎంత చేసినా తక్కువేనని.. ప్రాధాన్యత క్రమంలో జిల్లాను అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.ఉద్యమ సమయంలో ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేస్తే దాన్ని బ్లాక్‌మెయిల్ యాత్ర అంటూ.. ఆర్డీఎస్ తూములు ధ్వంసం చేస్తానని సీమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించాడని గుర్తు చేశారు. కేసీఆర్ ఆటంబాంబు గా మళ్లీ ఆర్డీఎస్ దగ్గరకి వస్తాడు.. ఆర్డీఎస్ దగ్గరే కుర్చీ వేసుకుని పనులు చేయిస్తాడు అని సీఎం అన్నారు. చంద్రబాబు సీఎంగా పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా అని సీఎం ప్రశ్నించారు.

సంక్షేమంలో మనమే ఫస్ట్.. సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం తెలిపారు. వసతిగృహాల విద్యార్థులకు సన్నబియ్యం, వితంతవులకు రూ.వెయ్యి పింఛను ఇస్తున్నామని అన్నారు. కరెంటు కోతలను అధిగమించామని, వచ్చే మార్చి నుంచి రైతులకు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతర విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వస్తే అంధకారమే అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి మ్యాప్‌పై కట్టెపెట్టి మరీ చూపించాడని, అయితే ఇప్పుడు కోతలు లేకుండా కరెంటు ఇచ్చుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వాలలాగా డూప్టికేట్ పింఛన్లు ఇవ్వడం లేదని అన్నారు. మా దగ్గర వనరులున్నాయి. అందుకే పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.