Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొత్తకార్డలొచ్చేదాకా.. పాత కార్డులపైనే రేషన్

– కుటుంబంలో ఎందరున్నా ఒక్కొక్కరికి ఆరుకిలోల బియ్యం – ఆదాయ పరిమితి 60వేల నుంచి లక్షన్నరకు పెంచాం – ఆంధ్ర పత్రికలు, పార్టీల దుష్ప్రచారం నమ్మొద్దు – శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ – రేషన్‌కార్డులపై ప్రతిపక్షాల వాకౌట్

Etela Rajendar Addressing in Assembly

పెదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న కొత్త రేషన్‌కార్డులు వచ్చేవరకు పాత కార్డుల ద్వారానే సబ్సిడీ సరుకులు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గతంలో పింక్ కార్డులు ఇచ్చినా వాటిపై సరుకులు ఇవ్వకుండా కేవలం గుర్తింపుకార్డులాగే పరిగణించారని, ఇప్పుడు ఆధార్‌కార్డు వచ్చినందున పింక్ కార్డుల స్థానంలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో గురువారం రేషన్‌కార్డులపై బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వాలు పేదలకు సబ్సిడీ నిత్యావసర సరుకుల కోసం రూ.940 కోట్లు, పింఛన్ల కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.6000 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు తెల్లకార్డుపై కుటుంబంలోని ఒక్కొక్కరికి నాలుగు కిలోల బియ్యం చొప్పున గరిష్టంగా 20కిలోలకు సీలింగ్ విధించాయని, తమ ప్రభుత్వం మాత్రం కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇస్తుందని చెప్పారు. రూ.60 వేల వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు గత ప్రభుత్వాలు రేషన్‌కార్డు ఇవ్వలేదని, తాము మాత్రం ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో బీపీఎల్ కార్డులు 80.13 లక్షలు, పింక్‌కార్డులు 14.08 లక్షలు,

అంత్యోదయ కార్డులు 3 లక్షలపైగా ఉన్నాయని, బోగస్‌కార్డులు వెనక్కివ్వాలని కోరితే 12 లక్షల కార్డులు ప్రజలు తిరిగిచ్చారని తెలిపారు. పింఛన్లు గతంలో రూ.200 ఇస్తే తమ ప్రభుత్వం రూ.1000కి పెంచిందని, వికలాంగులకు 40శాతం వైకల్యం ఉన్నా రూ.1500 ఇస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1578 కోట్లు చెల్లిస్తున్నామని, గతంలో ఈ పథకానికి రూ.1700 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ.2700 కోట్లు కేటాయించామని వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీల కాళ్లకింద భూమి కదులుతున్నది. బీజేపీ-టీడీపీకి ఎన్నికల సమయంలో పొత్తు కుదిరింది కానీ, కాంగ్రెస్, టీడీపీకి ఎక్కడ బంధం కుదిరిందో తెలుస్తలేదు.

తెలంగాణవాళ్లకు పాలన రాదని, రాష్ట్రంలో కరెంటు లేదని ఈ వందిమాగధులతో కొందరు దుష్ప్రచారం చేయిస్తున్నారు. అణగారిన వర్గాలకు నిలయం ఈ తెలంగాణ రాష్ట్రం. ఎన్ని బాధలున్నా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తాం. ఆ జిమ్మేదారి మాది అని స్పష్టం చేశారు. ప్రజలను ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర పార్టీలు ఆందోళనకు గురి చేస్తున్నాయని, వారి పిచ్చిరాతలు, ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాం. ఎన్ని అడ్డంకులెదురైనా బంగారు తెలంగాణను నిర్మిస్తాం అని స్పష్టం చేశారు.

ప్రజలను భయపెడుతున్న ప్రతిపక్షాలు: కొత్తబట్టలేసుకుంటే రేషన్‌కార్డు రాదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. రేషన్‌కార్డులపై క్యాబినెట్ సబ్‌కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి పలు సూచనలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు నివేదిక ఇచ్చిందని, సీఎం వెంటనే దానిని ఆమోదించారని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి సంబంధం లేదని, అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రేషన్‌కార్డుతో సంబంధం లేదని అన్నారు. రాష్ట్రంలో అన్నమో రామచంద్రా అనే పదం వినిపించకుండా చేస్తామని తెలిపారు.

రేషన్‌కార్డులపై ప్రభుత్వం జారీ చేసిన 653జీవో కొత్తబట్టలేసుకున్నా కూడా రేషన్‌కార్డు రాదనే విధంగా ఉందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అనటంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అయినా ఎర్రబెల్లి ప్రసంగిస్తుండటంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. అనంతరం మరోసారి మైక్ ఇవ్వగా వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బయటకు వెళ్లిపోయారు. తెల్ల రేషన్‌కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్, వైఎస్‌ఆర్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు కోరారు. పేదలందరికీ రేషన్‌కార్డులివ్వాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

పేదవారికి అన్నం పెడుతున్నందుకా వాకౌట్?: హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంపై శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పేదవారికి ప్రభుత్వం అన్నం పెడుతున్నందుకు వాకౌట్ చేస్తున్నారా? కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరుకిలోల బియ్యం ఇస్తున్నందుకా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంటే ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పి వారితో కూడా చేయిస్తారని తాము భావించామని టీడీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీలో ఒక్కరికి కూడా కొత్తగా కార్డులివ్వకుండా 7లక్షల కార్డులు ఏరిపారేశారని, ఇంకా అక్కడ ఆదాయ పరిమితి గ్రామాల్ల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలే ఉందని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.