-రాష్ట్ర విభజన వరకు ఆగండి -హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేసీఆర్ లేఖ

జూన్ 2 వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఏర్పడే వరకు జడ్జీ పోస్టుల భర్తీ ప్రతిపాదనలు చేపట్టవద్దని ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కోరారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నియమాకాలు చేపట్టవద్దన్నారు. ప్రస్తుత హైకోర్టులో 32 మంది న్యాయమూర్తుల్లో 24 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని, కేవలం 8 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని కేసీఆర్ తెలిపారు. 32 మందిలో 13 మంది కింది కోర్టు జడ్జీలు కాగా, పదోన్నతితో వారిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీఅయ్యాయని పేర్కొన్నారు. అందులో 11 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కాగా, ఇద్దరు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. స్థానికతపై గతంలో భారత రాష్ట్రపతి తీసుకున్న విధానం ప్రకారం వ్యక్తి జన్మస్థలమే కాకుండా, వారి తల్లిదండ్రుల జన్మస్థలాలను సైతం పరిగణనలోకి తీసుకునేవారని పేర్కొన్నారు. రెండు రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల జీతభత్యాలను జనాభా ప్రాతిపాదికగా రెండు రాష్ర్టాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. జీతాలు చెల్లించే విషయంలో తెలంగాణకు కేటాయించిన వాటాకు సరిపడా న్యాయమూర్తులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు లేరని లేఖలో పేర్కొన్నారు. వాటా ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ప్రాంత న్యాయమూర్తుల సంఖ్య 14గా ఉండాలని, కానీ కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని వివరించారు.
ఈ పరిస్థితుల్లో కొత్త న్యాయమూర్తులను ఎంపిక చేసిన పక్షంలో తెలంగాణ ప్రాంతానికి మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. రెండు హైకోర్టులు ఏర్పడిన తర్వాత ప్రస్తుత జడ్జీలనే రెండు హైకోర్టులకు విభజిస్తారని, దీంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉందని, ప్రజాప్రభుత్వం లేనందున న్యాయమూర్తుల ఎంపికకు ప్రతిపాదన చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. జడ్జీల భర్తీ ప్రతిపాదనలను పరిశీలించాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే పదవీ విరమణ చేస్తున్నారు. అదేవిధంగా జడ్జీ పోస్టులకు పేర్లను సిఫారసు చేసే రాష్ట్ర హైకోర్టు కొలీజియంలోని సీనియర్ న్యాయమూర్తి.. త్వరలోనే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని జడ్జీల భర్తీకి కొత్త ప్రతిపాదనలు పంపవద్దు అని జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తాకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ రాసిన ఈ లేఖను మంగళవారం మధ్యాహ్నం హైకోర్టుకు చెందిన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు సత్యంరెడ్డి, గండ్ర మోహన్‌రావు ప్రధాన న్యాయమూర్తికి అందచేశారు.