రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. ఉదయం పదకొండు గంటలకు రాజ్‌భవన్ లాన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, సీ లక్ష్మారెడ్డి,అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ నూతన మంత్రులను ఒక్కొక్కరుగా వేదికపైకి పిలిచారు. -ఆరుగురితో ప్రమాణం చేయించిన గవర్నర్ -రాజ్‌భవన్ వద్ద గులాబీ శ్రేణుల సందడి
తొలుత తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అరగంటలోపే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసింది. అనంతరం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రివర్గ సభ్యులు గ్రూప్ ఫోటోలు దిగారు. తర్వాత గవర్నర్ ఆహూతులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రులు టీ రాజయ్య, మహమూద్‌అలీ, మంత్రులు టీ హరీష్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, టీ పద్మారావు, జోగురామన్న, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కే కేశవరావు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారితో పాటు పలువురు ఉన్నతాధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు.
తలసాని శ్రీనివాసయాదవ్ ప్రమాణస్వీకారం సమయంలో రాజ్‌భవన్ బయట ఆయన మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. పలువురు మంత్రులు ప్రమాణం చేస్తున్నప్పుడు వారి అనుచరులు నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్ నుంచి మంత్రులు బయటకు రాగానే అప్పటిదాకా వారికోసం వేచి ఉన్న అనుచరులు, సన్నిహితులు ఆత్మీయ అభినందనలు తెలియచేశారు. తలసాని శ్రీనివాసయాదవ్‌ను పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. ఇదిలా ఉండగా నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.
గులాబీమయమైన రాజ్‌భవన్ రోడ్డు గులాబీమయమైంది. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలనుంచి వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతో పాటు తెలంగాణ వాదులు రాజ్‌భవన్ వద్ద సందడి చేశారు. ఆనందోత్సాహాల మధ్య బాణసంచా కాల్చారు. గులాబీ జెండాలను పట్టుకున్న కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చందులాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చారు.
వారి వెంట గులాబీ జెండాలతో అలంకరించిన ద్విచక్ర వాహనాలపై శ్రేణులు ర్యాలీగా రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుంచి మంత్రిగా ప్రమాణం చేసిన శ్రీనివాస్ యాదవ్ భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రాజ్‌భవన్ రహదారికి ఇరువైపులా మంత్రుల ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. పోలీసులు రాజ్‌భవన్ వైపుకు వస్తున్న ప్రజానీకానికి, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగు చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటివరకు 12 మంది సభ్యులున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొత్తగా ఆరుగురు చేరారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చెర్లకోల లక్ష్మారెడ్డి, అజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావులతో గవర్నర్ నరసింహన్ మంగళవారం రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ తోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు ప్రముఖులు, పార్టీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రుల బయోడేటా -రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసినవారి జీవిత విశేషాలు క్లుప్తంగా..
తుమ్మల నాగేశ్వర్‌రావు, రోడ్లు, భవనాలు, మహిళా శిశు అభివృద్ధిశాఖ ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో రాజకీయాల్లో ప్రవేశించిన తుమ్మల నాగేశ్వర్‌రావు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి.. 2009లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. గతంలో భారీ నీటిపారుదల, రోడ్లు భవనాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు కొంతకాలం క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ న్యాయస్థానంలో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. 1985లో టీడీపీలో చేరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అల్లోల 1987లో జిల్లా పరిషత్ చైర్మన్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 1991లో ఆదిలాబాద్ లోక్‌సభాస్థానం నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన ఇంద్రకరణ్.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావుకు అండగా నిలిచేందుకు 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 1999, 2001, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీనుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్‌రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బీఎస్పీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్, వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కీలకమైన తలసాని శ్రీనివాస్ యాదవ్.. సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు, సనత్ నగర్ నుంచి ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలుత 1994లో సికింద్రాబాద్‌నుంచి గెలిచిన తలసాని.. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేశారు. 1999లో రెండోసారి ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తలసాని.. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
సీ లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి రాజకీయ ప్రస్థానం1988లో అవంచ గ్రామ సర్పంచ్‌గా ప్రారంభమైంది. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండో అధ్యక్షుడిగా, 1996లో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 1999లో స్వతంత్య్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలైన లక్ష్మారెడ్డి 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేశారు. 2014లో సొంత రాష్ట్రంలో జడ్చర్లనుంచి ఎన్నికయ్యారు.
అజ్మీరా చందూలాల్, గిరిజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ అజ్మీరా చందూలాల్ రాజకీయ ప్రస్థానం వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ సర్పంచ్‌గా ప్రారంభమైంది. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరిన చందూలాల్.. 1985 మధ్యంతర ఎన్నికల్లో తొలిసారి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2004ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యే అయ్యారు.
జూపల్లి కృష్ణారావు, పరిశ్రమలు,చక్కెర, చేనేత జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తొలుత బ్యాంక్ ఉద్యోగి. 1999లో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచి, వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం 2011లో మంత్రి పదవిని త్యజించిన జూపల్లి.. 2011 అక్టోబర్‌లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి గెలుపొందారు.