Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొత్త రాష్ట్రంలో కొత్త పాలన

-విద్యార్థులకు తాజాగా ధ్రువీకరణ పత్రాలు -తెలంగాణ రాష్ట్రం పేరిట ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు -కొత్తగా ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు -తెలంగాణ పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు -కార్డుల జారీలో లోపాలకు అధికారులదే బాధ్యత -నవంబర్ మొదటివారం నుంచి పింఛన్లు -లబ్ధిదారులు ఈ నెల 15లోగా దరఖాస్తులివ్వాలి -వికలాంగులకు సర్టిఫికెట్లకోసం ప్రత్యేక శిబిరాలు -15లోగా రుణమాఫీ వందశాతం పూర్తికావాలి -కొత్త రుణాలు అందించేందుకు కృషి చేయండి -అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే -కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్

KCR Review meet with District Collectors

రాష్ట్రంలో పాలనను వేగవంతంచేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కొత్తగా ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ రాష్ట్రం పేరుతో అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఈ నెల 15లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతుల రుణమాఫీని ఈ నెల 15లోగా వందశాతం అమలు చేయాలని, రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఆహార భద్రత చట్టం అమలులో భాగంగా తెలంగాణ స్టేట్ ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్డు కేవలం నిత్యావసర వస్తువుల సరఫరాకేనని, గతంలోని రేషన్ కార్డుల్లా ఇతర సంక్షేమ పథకాలకు వర్తించదని స్పష్టంచేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన పింఛన్లను నవంబర్ మొదటివారంలో అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇవ్వాలనికూడా సీఎం నిర్ణయించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న కేసీఆర్.. అందుకోసం ఎక్కడ భూములు ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశించారు.

దసరా నుంచి దీపావళిలోపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు మొదలవుతుందని గతంలోనే చెప్పిన సీఎం.. ఇప్పుడు వాటిని ఆచరణలోకి తెస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలుపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంతో ఉద్వేగంగా మాట్లాడిన కేసీఆర్.. తాను ప్రజల గోస తెలిసివాడిగా చెప్తున్నానని అన్నారు. భవిష్యత్‌తరాలకు నష్టం కలుగకూడదన్నదే తన లక్ష్యమని స్పష్టంచేశారు. తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కలెక్టర్లను కోరారు.

శంకరన్‌వంటి ఐఏఎస్ అధికారిని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన పనితీరే కారణమన్న ముఖ్యమంత్రి.. శంకరన్‌లా ప్రతి ఐఏఎస్ అధికారి పని చేయాలని అభిలా షించారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరందించేందుకు ఉద్దేశించిన మంచినీటి గ్రిడ్ పనులను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు సర్కార్ తీసుకుంటున్న చర్యలను జిల్లాస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. రాబోయే మూడేండ్లలో 12వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించాలన్నారు.

మూడేండ్ల తర్వాత రాష్ట్రంలో కనురెప్ప మూసిన వ్యవధిలో కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. జిల్లాస్థాయిలో కళాకారులు, కవులు, క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాల అమలు బాధ్యత కూడా కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి చెప్పారు.

నెలాఖరుకల్లా సర్టిఫికెట్లు ఇవ్వాలి: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పేరుతో విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్లన్నింటినీ ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తెలంగాణ విద్యార్థులకు కోసం ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకం లబ్ధికోరేవారు ఈ నెల 15లోగా సర్టిఫికెట్లకోసం తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఎమ్మార్వోలు సదరు దరఖాస్తులను పరిశీలించి, అక్టోబర్ నెలాఖరుకల్లా సర్టిఫికెట్లను అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన పింఛన్లను నవంబర్ నుంచే అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. పెన్షన్లకోసం దరఖాస్తులను ఈ నెల 15లోగా వీఆర్వోలకు అందించాల్సి ఉంటుందని తెలిపారు.

వికలాంగులకు వైకల్య సర్టిఫికెట్లు అందించేందుకు ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.15లోపు రుణమాఫీ పూర్తి చేయాలి: ఈ నెల 15లోగా పంట రుణాల మాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. బ్యాంకర్లకు చెల్లించాల్సిన మొదటి విడత రూ.4,250 కోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరాయని పేర్కొన్నారు. రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఫుడ్ కార్డులు: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర సరుకులు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు, 5 ఎకరాలకు పైగా భూమి కలిగినవారు, వ్యాపారవేత్తలకు మినహాయించి, మిగతా పేదలందరికీ ఈ కార్డులు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. అక్టోబర్ 15లోగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులకోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

నిరుపేద కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 5కిలోల చొప్పున బియ్యం ఇచ్చేందుకు సీఎం సూత్రపాయంగా అంగీకరించారు. లబ్ధిదారుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకోసం ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో ఇద్దరు రెవిన్యూ అధికారులను కేటాయించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఫుడ్ సెక్యూరీటీ కార్డులు, పెన్షన్లు, ధ్రువీకరణ పత్రాలు అన్నీ తహశీల్దార్ల పర్యవేక్షణలో జరగాలని, డివిజన్ల వారీగా ఫ్లయింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు. క్షుణ్ణంగా పరిశీలించాక సర్వే వివరాల వెల్లడి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటి వివరాలను అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

సర్వే వివరాలను ఆధారం చేసుకుని తెలంగాణలోని పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇవ్వాలని కూడా అదేశించారు. వివిధ సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తుల వివరాలను సర్వే వివరాలతో సరిపోల్చుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తద్వారా అనర్హులకు సంక్షేమ పథకాలు వెళ్లకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకోనున్నారు. పింఛన్లు అందజేసే క్రమంలోనూ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. దళితులకు భూ పంపిణీ నాకు సవాల్: రాష్ట్రంలోని దళితుల కుటుంబాల్లో వెలుగు చూడాలనుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.

దేశానికి ఎంతో సేవచేసిన దళితులకు ఇప్పుడు ప్రభుత్వం సేవచేయాలని నిర్ణయించుకుందని వ్యాఖ్యానించారు. దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ పథకాన్ని తాను ఎంతో ఇష్టపడి రూపకల్పన చేశానని చెప్పారు.

ముఖ్యమంత్రిగానే కాకుండా, వ్యక్తిగతంగాకూడా ఈ పథకం తనకు సవాల్ అన్నారు. నిరంతర ప్రక్రియగా సాగే దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాదినుంచి మరింత ఉధృతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకంకోసం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయాల్సి ఉందన్న కేసీఆర్.. ఎక్కడ భూమి దొరికినా వెంటనే కొనాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఐలకు, హైదరాబాద్‌లాంటి నగరాల్లో స్థిరపడినవారికి, వ్యాపారులకు కూడా గ్రామాల్లో భూములు ఉన్నాయని, అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి భూములను అమ్మితే ప్రభుత్వం మంచి ధర చెల్లిస్తుందని ప్రకటించారు. కలెక్టర్లుకూడా ఇలాంటి భూములను గుర్తించి, వాటి యజమానులతో చర్చించాలని సూచించారు. నిరుపేద దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఉండాలన్నది తన లక్ష్యమని, ఆ భూమిలో లాభసాటి వ్యవసాయం చేసి, దళిత కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డప్పుడే తనకు తృప్తి ఉంటుందని తెలిపారు. దళితులకు ఇచ్చిన భూమిలో బోరు, మోటారు, కరెంటు కనెక్షన్ కూడా ప్రభుత్వ ఖర్చులతోనే సమకూర్చాలని కలెక్టర్లకు సూచించారు.

ఆ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని, భూగర్భ జలాలను పరీక్షించాలని, వాటి ఫలితాలను బట్టి ఏ పంట వేయాలనే విషయంపై రైతులకు సూచనలు చేయాలని కోరారు. పంచిన భూముల్లో ఏం జరుగుతున్నదీ కలెక్టర్లు మూడు నెలలకోసారి పరిశీలించాలని సూచించారు. తాను కూడా జిల్లాల్లో పర్యటనలు జరిపి దళితులకు ఇచ్చిన భూమిని పరిశీలిస్తానని చెప్పారు.

అడవుల రక్షణకు కఠినంగా వ్యవహరించండి: రాష్ట్రంలో అడవుల రక్షణకు కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. అటవీభూముల వివరాలను డీఎఫ్‌వోల ద్వారా తెప్పించుకుని, పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలని చెప్పారు. మంచివాళ్లకు మంచిగా, స్మగ్లర్లు, చెడ్డవాళ్లపట్ల కాలయముళ్లుగా కలెక్టర్లు వ్యవహరించాలని అన్నారు. వానలు మళ్లీ వాపసు రావాలన్నా, తెలంగాణ అడవులతో కళకళలాడాలన్నా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అటవీశాఖ, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకప్పుడు తెలంగాణ దట్టమైన అడవులతో పచ్చగా కళకళలాడేదని చెప్పారు.

కానీ.. అంతులేని ఆక్రమణలతో, గత పాలకుల నిర్లక్ష్యంతో అడవులు అంతరించే దశకు చేరుకున్నాయని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో హరితహారంకోసం రూ.500కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మొక్కలకు నీరందించేందుకు అవసరమైతే రెండు లేదా మూడు కిలోమీటర్లకు ఒక బోర్‌కూడా వేయాలని సూచించారు. జులై మొదటి వారాన్ని పూర్తిగా హరితహారం కార్యక్రమానికే అంకితం చేస్తామన్నారు. ఇదొక ఉద్యమంలా సాగుతుందని స్పష్టంచేశారు.

సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావు, సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వీ నాగిరెడ్డి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి జోషి, సీనియర్ అధికారి రాజా, జిల్లా కలెక్టర్లు రాహుల్ బొజ్జా, శ్రీధర్, జీ కిషన్, ఇలంబర్తి, చిరంజీవులు, ప్రియదర్శిని, రొనాల్డ్ రాస్, జగన్మోహన్, వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.