Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కొత్త సచివాలయం

-ఛాతీ ఆస్పత్రి స్థలంలో ఏడాదిలోగా 150 కోట్లతో నిర్మాణం.. -రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

CM-KCR-Press-meet-after-cabinet-meeting-01

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సనత్‌నగర్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలోని విశాలమైన స్థలంలో రూ.150 కోట్లతో అధునాతన వసతులతో దీన్ని నిర్మించాలని, మొత్తం రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నింటిని ఇక్కడికి తరలించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సుదీర్ఘంగా ఏడు గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం మిగిల్చిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల కోసం రూ.862 కోట్ల విడుదలకు క్యాబినెట్ అంగీకరించింది. ఇక పేదపిల్లల చదువుల్లో ఏర్పడే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ పథకం విరమించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో 125 గజాల లోపు ఇండ్లు నిర్మించుకున్న పేదలకు వాటిని ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. జంటనగరాల్లో క్రమబద్ధీకరణపై వారం పది రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి ఫిబ్రవరి 20 నుంచి పట్టాల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది.

తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి 550 మంది కళాకారులను తీసుకోవాలని నిర్ణయించింది. వరంగల్ కార్పొరేషన్ స్థాయిని పెంచి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ చేయాలని, వరంగల్‌లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. తిరుపతి వేంకటేశ్వరస్వామి, వరంగల్ భద్రకాళి అమ్మవారు, కురవి వీరభద్రస్వామి, విజయవాడ కనకదుర్గ, తిరుచానూరు పద్మావతి ఆలయాలకు ఆభరణాలు సమర్పించాలని, అలాగే అజ్మీర్ దర్గా వద్ద యాత్రికులకు వసతిగృహం నిర్మించాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

క్రమబద్ధీకరణ గడువు పెంపు జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 125 గజాలలో గుడిసెలు వేసుకున్న, ఇండ్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. క్రమబద్ధీకరించే గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించామని చెప్పారు. తెలంగాణ ఏర్పడినరోజు జూన్ 2నాటి రిజిస్ట్రేషన్ ధరలనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే జీవో నంబర్ 58 కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా, జిల్లాలలో తక్కువగా దరఖాస్తులు వచ్చాయని, ఇంతవరకూ మొత్తం 1.77 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయని వివరించారు. ఇక జీవో 59 కింద కూడా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు లేవన్నారు. మొత్తం రూ.240 కోట్లకు కలిపి రూ. 60 కోట్ల ప్రాథమిక డిపాజిట్లు చెల్లిస్తూ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలు ఫీల్డ్‌లోకి వెళ్లినప్పుడు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు.

125 గజాల కన్నా ఏ మాత్రం ఎక్కువగా ఉన్నా అధికారులు ఉచిత క్రమబద్ధీకరణకు నిరాకరిస్తున్నారని, కాస్త అటు ఇటూ ఉన్నవారు తాము పేదలం కామా అని ఆవేదన చెందుతున్నారని వివరించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు కూడా 125 గజాల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నవారికి వెసులుబాటు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెప్పారు. ఈ అభ్యర్థనలన్నింటినీ పరిశీలించి ప్రస్తుతం అందిన 1.77 లక్షల దరఖాస్తులలో 150 గజాల వరకు ఆక్రమణలో ఉన్న వారి విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం మొదట 125 గజాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని, అంతకు పైగా ఉన్న స్థలం మీద 150 గజాలు మించకుండా 10శాతం నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని మంత్రి మండలి సమావేశం వెసులుబాటు కల్పించిందని తెలిపారు.

రంగారెడ్డి, హైదరాబాద్‌లలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇక్కడ వారం, పది రోజుల్లో వెరిఫికేషన్ చేసి ఫిబ్రవరి 20 నుంచి పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. క్రమబద్ధీకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. అందుకే వెరిఫికేషన్‌లో శిఖం భూములు, నాలా భూములు కానివి గుర్తిస్తారన్నారు. సీలింగ్ భూముల విషయంలో వివాదాలు లేనివాటికి పట్టాలు ఇస్తామన్నారు. ఇంకా కొన్ని భూముల ప్రతిపాదనలు మార్చాల్సి ఉంటుందని వీటిపై కలెక్టర్లు పరిశీలన చేస్తున్నారన్నారు. ఇదంతా మార్చి 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని చెప్పారు. క్రమబద్దీకరణ జీవో నంబర్ 59కి కొన్ని సవరణలు చేశామని సీఎం తెలిపారు. 126- 150 గజాల వరకు నోటిఫైడ్ మురికివాడల్లో బేసిక్ వ్యాల్యూ (రిజిస్టేషన్ ధర) పదిశాతం కడితే సరిపోతుంది, నోటిఫైడ్ స్లమ్ కానివారు 25 శాతం కట్టాల్సి ఉంటుందని వివరించారు.నిర్ణయించిన ధర చెల్లించడానికి గతంలో ఉన్న నాలుగు వాయిదాలను ఐదు వాయిదాలకు పెంచామని సీఎం తెలిపారు. దరఖాస్తు సమయంలోనే గతంలో 25 శాతం డబ్బులు కట్టాలని నిర్ణయించగా తాజాగా 12.5 శాతం కడితే సరిపోతుందన్నారు.

మొదటివిడత ఫిబ్రవరి 28, రెండోవిడత 12.5 శాతం ఏప్రిల్ 15వ తేదీలోగా, మూడోవిడత 25 శాతం జూన్ 30లోగా, నాలుగో విడత 25 శాతం సెప్టెంబర్ 30లోగా చెల్లించాలని చివరి విడత 25 శాతం డిసెంబర్ 31లోగా చెల్లించాలని ఆయన వివరించారు. కాగా 100 శాతం ధర ఒకేసారి చెల్లిస్తే మొత్తం ధరలో 5 శాతం మినహాయిస్తామన్నారు. ఈ పథకం రెగ్యులరైజ్ చేసుకునేవారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ నుంచి నూరుశాతం మినహాయింపు ఉంటుందని దీనివల్ల దాదాపు 6.5 శాతం పన్నుభారం తగ్గుతుందని చెప్పారు.కాగా ఇప్పటికే దరఖాస్తు చేసుకుని మొదటి విడత ఫీజు చెల్లించినవారికి సైతం కొత్త ధరలే వర్తిస్తాయని, వారు కట్టే రెండో విడతలో ఈ రేట్ల సవరణ ప్రకారం సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. భూముల క్రమబద్ధీ కరణ విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉందని, ఇప్పుడు కనుక ముందుకురాకుంటే స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ. 862 కోట్లు విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ. 862 కోట్లు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. గత సర్కారు నాలుగేండ్లుగా పీజుల బకాయిలు తమ నెత్తిపై పెట్టిందన్నారు. ఈ మొత్తాలు రూ.1650 నుంచి రూ.1800 కోట్ల వరకు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక ఫీజు చెల్లింపునకు కొత్త పథకంపై చర్చోపచర్చలు జరిగాయని తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన తరువాత పేద పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి కొంత ఉదారంగా ఉండాలన్న ఉద్దేశంతో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఫాస్ట్ (తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం) పథకం ఇక ఉండదని స్పష్టం చేశారు. 371(డీ) ప్రకారమే ముందుకు వెళతామని, దీనికి సంబంధించి ఎలాంటి వివాదం లేదన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన బకాయిలను దఫాలుగా చెల్లిస్తామని, ఇప్పటివరకైతే పాతబకాయిలు పూర్తిగా చెల్లిస్తున్నామని చెప్పారు. స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిందండ్రులు, కాలేజీలు, స్కూళ్ల యజమాన్యాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు.

వాస్తుదోషం కూడా ఉంది… సెక్రటేరియట్‌కు వాస్తుదోషం ఉంది. దీని చరిత్ర కూడా బాగాలేదు. తెలంగాణ రాష్ర్టానికి అలాంటి అధోగతి రావద్దు, పరిపాలనా సౌలభ్యం కావాలి, చెస్ట్ ఆసుపత్రిని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మార్చాల్సి ఉంది. ఆ స్థలం బాగుంది కాబట్టి అక్కడ సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వారసత్వ కట్టడాలపై నిబంధనలు ఉన్నాయని, ఆ నిబంధనల ప్రకారమే ముందుకు వెళతామన్నారు. భూమికూడా వారసత్వమే.. మరి భూమిపై ఎలాంటి నిర్మాణాలు చేయవద్దా? అని సీఎం ఎదురు ప్రశ్నించారు. వారసత్వ కట్టడాలకు స్పష్టంగా ఉన్న నిబంధనల ప్రకారమే తాము ముందుకు వెళతామని మరోసారి స్పష్టం చేశారు.

తెలంగాణ మొక్కులు తీర్చుకుంటాం.. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఎక్కని కోట లేదు. మొక్కని బండ లేదు, రాజకీయ పార్టీలు, పక్షాలను కలివిడి చేయడంతోపాటు హరిహర పుణ్యక్షేత్రాలకు మొక్కులు మొక్కాం, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఆ మొక్కులు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ మొక్కులు తీర్చేందుకు మంత్రిమండలి ఆమోదించిందన్నారు. ఆ మొక్కుల్లో భాగంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ. 5 కోట్లతో ఆభరణాలు చేయించి,తానే స్వయంగా వెళ్లి సమర్పించి ఆ మొక్కు తీరుస్తానన్నారు. ఇప్పుడు పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న ఎంజీ గోపాల్ టీటీడీ ఈవోగా పనిచేసి వచ్చారని, అలాగే రమణాచారి కూడా అక్కడ ఈవోగా పనిచేశారని, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ వారికి తెలుసునన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో ఆభరణాలు చేయించి సమర్పిస్తామన్నారు. అజ్మీర్ దర్గాకు కూడా మొక్కినం. మా తెలంగాణ రాష్ట్రం వస్తే రూ. 5 కోట్లతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికుల కోసం వసతిగృహం నిర్మించి ఇస్తామన్నాం. అజ్మీర్ దర్గాలో వసతి గృహాన్ని మక్కాలో ఉండే మక్కాభవన్ మాదిరిగా నిర్మిస్తామన్నారు. దీనికోసం త్వరలో అక్కడకు అధికారులు వెళ్లి భూమిని చూసి పనులు ప్రారంభిస్తారన్నారు. అజ్మీర్ దర్గాకు ప్రత్యేకంగా చాదర్ తయారు చేయించి తానే స్వయంగా తీసుకువెళ్లి ఇస్తానన్నారు. అట్లనే భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసం, విజయవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు చేయించి స్వయంగా వెళ్లి సమర్పిస్తామని, వీటిని మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వివరించారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి 550 మంది కళాకారులను తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారన్నారు. కళాకారుల ప్రతిభను దృష్టిలో పెట్టుకొని విద్యార్హతతో సంబంధం లేకుండా తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. వరంగల్ నగరాన్ని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ చేయాలని మంత్రిమండలిలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే వరంగల్‌లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు.

మార్కెట్లను బాగు చేస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు అధ్వానంగా ఉన్నాయి. కూరగాయలు, మాంసం నేలపైనే పెట్టుకుని అమ్ముతున్నారు. అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నేలకు 3 ఫీట్ల ఎత్తున ఉంటే బ్యాక్టీరియా చేరవు. ఇదే పద్ధతిలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల మార్కెట్లు, చేపల, మాంసం మార్కెట్లను ఆధునీకరిస్తాం. రూ. 100 కోట్లతో మున్సిపల్ పట్టణాల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఆధునీకరిస్తాం. దీనికి సంబంధించి నిజాం రాజు కట్టించిన మోండా మార్కెట్ అద్భుతమైనది. రేపు నేను, నలుగురు మంత్రులం మోండా మార్కెట్ వెళ్లి పరిశీలించి, శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌పై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నాం. నగరానికి కొత్త సొబగులు కావాలి. ఇక్కడ కూడా ఫిష్ మార్కెట్ కోసం కేంద్రం నుంచి రూ. 8.80 కోట్లు వచ్చాయి. వాటితో పనులు ప్రారంభిస్తాం. అలాగే మెహిదీపట్నం మార్కెట్‌నుకూడా ఆధునీకరిస్తాం. రేపటి సమావేశంలో హైదరాబాద్‌లో తీసుకునే ఆధునిక చర్యలపై చర్చిస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారు.

అవినీతిని సహించేది లేదు మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదని మంత్రులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ సమాజానికి ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వంలో పేదల ఇండ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణ నివేదికల్లో తేలిందని మంత్రులకు ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. అవినీతి, అక్రమాలలో సొంతపార్టీ నాయకులున్నా సహించేది లేదని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలంటే అందరూ నీతిగా, నిజాయితీగా పని చేయాలని, అవినీతిని సహించేది లేదన్న సంకేతాలు కిందిస్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశంలో కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు మినహా మంత్రులంతా పాల్గొన్నారు. కాగా మంత్రిమండలి సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటలరాజేందర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌లు పాల్గొన్నారు.

ఏడాదిలో కొత్త సచివాలయ నిర్మాణం… తెలంగాణ రాష్ట్రం కోసం రూ.150 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సనత్‌నగర్‌లోని చెస్ట్ ఆసుపత్రి ఆవరణలో దీన్ని నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదించడంతోపాటు నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. ఒక్క సంవత్సరంలోగా దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడున్న ఆస్పత్రిని వికారాబాద్‌లోని టీబీ శానిటోరియానికి తరలించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిజాం కాలంలో నిర్మించిన చెస్ట్ ఆస్పత్రి ఏరియా ఒక కుగ్రామమని, నిజాం తన కుమార్తె కోసం ఈ భవనం నిర్మించారని చెప్పారు. ఇవాళ చెస్ట్ ఆస్పత్రి చుట్టూ అనేక నిర్మాణాలు వచ్చాయని, వాతావరణం కూడా కలుషితమైందని అన్నారు. వాస్తవంగా టీబీ పేషెంట్లకు ప్రశాంత వాతావరణం కావాలన్నారు. చెస్ట్ ఆస్పత్రికి పేషెంట్లు ఎవరూ నేరుగా రారని, ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్ చేస్తేనే వస్తారని వివరించారు. రోగులకు ప్రశాంత వాతావరణం కావాలనే ఆసుపత్రిని తరలించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం చెస్ట్ ఆస్పత్రిలో 8 మంది రోగులుంటే 200 మంది సిబ్బంది, డాక్టర్లు ఉన్నారని తెలిపారు. ఈ రోగులను టీబీ శానిటోరియానికి తరలిస్తామన్నారు. ఉద్యోగులు, డాక్టర్లు అక్కడకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని, దీనికి పీజీ కాలేజీ కూడా ఉన్నదని వివరించారు.

ఈ విషయంపై తాను వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతానని తెలిపారు. అవసరమైతే వీరిని ఇక్కడి ఆసుపత్రులలో ఉంచి పని చేయిస్తామన్నారు. పీజీ కాలేజీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వికారాబాద్‌లోని అనంతగిరిలో ఉన్న టీబీ శానిటోరియానికి చిన్న, చిన్న రిపేర్లు ఉన్నాయని, వాటిని 10, 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. సనత్‌నగర్ చెస్ట్ ఆసుపత్రిని షిఫ్ట్ చేసి, కొత్తగా ఆ స్థలంలో సెక్రటేరియట్ నిర్మిస్తున్నామని తెలిపారు. అనువైన తేదీలు చూసుకొని భూమిపూజ చేసి పనులు మొదలు పెడతామన్నారు. ఈ సెక్రటేరియట్‌లో అన్నిశాఖల హెడ్డాఫీసులు కూడా ఉంటాయన్నారు. ఇప్పుడు ఒక ఆఫీసర్ మాసబ్ ట్యాంక్‌లో ఉంటరు, మరొకరు నాంపల్లిలో ఉంటరు, ఇంకొకరు ఎర్రమంజిల్‌లో ఉంటున్నారని అన్నారు. దీంతో టైమ్ అంతా వేస్ట్ అవుతుందన్నారు. అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండాలి, పరిపాలన సజావుగా జరగాలని అన్నారు.

ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు..

-గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా వరంగల్ -తెలంగాణ సాంస్కృతిక సారథికి 550మంది కళాకారులు -తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ. 5 కోట్లతో ఆభరణాలు -భద్రకాళి అమ్మవారికి స్వర్ణకిరీటం -కురవి వీరభద్రస్వామికి బంగారు మీసం -విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక -తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక -అజ్మీర్ దర్గా వద్ద రూ. 5 కోట్లతో వసతిగృహం -మీడియాకు వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -నేడు మోండా మార్కెట్ పరిశీలన..హైదరాబాద్‌పై ప్రత్యేక సమావేశం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.