-ట్రాన్స్మిషన్ కారిడార్ త్వరగా పూర్తి చేయండి – కేంద్రమంత్రి గోయల్‌ను కోరిన కేసీఆర్ – ప్రత్యేక దృష్టి సారిస్తానని కేంద్రమంత్రి హామీ

రాష్ట్రంలో నెలకొల్పే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. నార్త్గ్రిడ్నుంచి సౌత్గ్రిడ్కు విద్యుత్ సరఫరా అయ్యేలా ట్రాన్స్మిషన్ కారిడార్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. ఈ విషయాలపై తాను ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.
గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ కలిశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఏ విధంగా అధిగమించిందీ సీఎం ఆయనకు తెలిపారు. కేసీఆర్ చెప్పిన విషయాలపై ఆసక్తిగా చర్చించిన కేంద్రమంత్రి.. మొదటి ఏడాదిలోనే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడంపట్ల అభినందనలు తెలిపారు. దేశంలోనే మరే రాష్ట్రం చేయని విధంగా ఒకే ఏడాదిలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్ర సౌరవిద్యుత్ విధానాన్ని ప్రశంసించిన కేంద్రమంత్రి.. ఆ విధాన పత్రాన్ని తన వెంట తీసుకునివెళ్లారు. తమకు అవసరమైన బొగ్గు కేటాయించాలని కోరుతూ ఒక లేఖ, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మరో లేఖను కేంద్రమంత్రికి కేసీఆర్ అందజేశారు.
ఇదే విషయంపై ప్రధాని మోదీకి రాసిన లేఖలను అందించారు. ఛత్తీస్‌గఢ్‌నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్వరలో ఒప్పందం చేసుకుంటున్నామని కేంద్రమంత్రికి తెలిపారు. నార్త్గ్రిడ్నుంచి సౌత్గ్రిడ్కు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేలా లైన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం కోరారు. వార్థా-నిజామాబాద్- హైదరాబాద్, అంగూల్-పలాస-వేమగిరి-ఖమ్మం-హైదరాబాద్, వరోరా- వరంగల్ మార్గం లో 765 కేవీ లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని వివరించారు.
మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చుతున్నాం తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. జెన్కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్లు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామన్నారు. వీటికి అవసరమైన 29.70 మెట్రిక్ టన్నుల బొగ్గు కేటాయింపులు జరపాలన్నారు. గతంలో బీపీఎల్ కంపెనీకి మూడున్నర మెట్రిక్ టన్నుల బొగ్గు కేటాయంపు ఉందన్నారు. అయితే ఆ కంపెనీ విద్యుత్ ఉత్పత్తినుంచి తప్పుకున్నందున ఆ కేటాయింపులను రాష్ర్టానికి బదలాయించాలని కోరారు. దీనికికూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. వీధి లైట్లకు కచ్చితంగా ఎల్ఈడీ బల్బులనే వాడాలని, దీనివల్ల విద్యుత్ బాగా ఆదా అవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ ఏడాదిలోగా తమ రాష్ట్రంలోని అన్ని వీధిలైట్లకు ఎల్ఈడీ బల్బులు వాడటానికి ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే చాలా పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులతో వీధిలైట్లు ఏర్పాటు చేశామని వివరించారు.
సౌరశక్తి అపరిమితం ఇతర వనరులు ఎప్పుడో ఒకప్పుడు నశించినా, సౌరశక్తి మాత్రం నశించదని, రాబోయే రోజుల్లో సౌరవిద్యుత్ కోసమే ఎక్కువ ప్రయత్నాలు చేయాలని సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌లు తమ సంభాషణల్లో అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కేంద్ర విద్యుత్‌శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా తదితరులు పాల్గొన్నారు.