Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

క్రమబద్ధీకరణకు ఆరు సూత్రాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆరు ప్రతిపాదనలను సిద్ధంచేశారు. అన్ని వర్గాలను, రాజకీయ పక్షాలను, ప్రజాస్వామికవాదులను ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రతిపాదనలను మంగళవారం సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు.ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

KCR in All Party Meeting

-125 చదరపు గజాల వరకు ఉచితంగా రెగ్యులరైజేషన్ -ఆ తర్వాత 300 గజాల వరకు నామమాత్రపు ధర -కబ్జా చేయాలంటే దడ పుట్టేలా చట్టం తెస్తాం -అఖిలపక్ష సమావేశంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు -ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించిన సమావేశం 125 చదరపు గజాల స్థలంలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయటం, 250-300 చదరపు గజాల స్థలంలో నివాసముంటున్న మధ్యతరగతి ప్రజలకు కొద్దిపాటి ధరతో క్రమబద్ధీకరణ, 500 చదరపు గజాలలోపు స్థలంలో నివాసముంటున్నవారికి 100 గజాల వంతున ధర పెంచుతూ క్రమబద్ధీకరణ, 500 గజాలకుపైగా ఆక్రమించుకొని నివాసాలు, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటుచేసుకున్న వారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి క్రమబద్ధీకరణ చేయటం, ఖాళీగా ఉన్న స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, 15 నుంచి 50 గజాలలోపు స్థలంలో నివాసముంటున్న వారందరినీ ఒక పూల్‌గా మార్చి వారికి బహుళ అంతస్తుల భవనాలు కట్టించి మెరుగైన నివాసాలుగా మార్చాలనే ఆరు సూత్రాలను సీఎం ప్రతిపాదించారు.

సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పేదలకు గృహ వసతి కల్పించడంలో ఔదార్యాన్ని చూపుతామని, అదే సమయంలో భూకబ్జాలకు పాల్పడేవారి భరతం పడుతామన్నారు. హైదరాబాద్‌లో భూ కబ్జాల దుకాణం బంద్ కావాలి. అది నా అభిమతం అని స్పష్టం చేశారు. కబ్జాల నిరోధానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం, సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. సామాన్యులు ప్లాట్లు కొనాలంటే పది సార్లు ఆలోచించుకోవల్సిన దుస్థితి నెలకొంది. దానిక్కారణం భూ వివాదాలే అని పేర్కొన్నారు. భూమిని ఆక్రమించాలంటే దడ పుట్టేలా కఠినమైన చట్టాలు కూడా తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

-నగరంలో నాలుగు రకాల ఆక్రమణలు హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి నాలుగురకాలుగా ఆక్రమణకు గురైందని సీఎం అన్నారు. వివిధ జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కట్టుకోవటానికి ప్రభుత్వ భూములని తెలియక మధ్యవర్తుల దగ్గర కొనుగోలు చేశారు. అలాగే పాఠశాలలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాల కోసం కొన్నిచోట్ల ప్రభుత్వ భూమిని వాడుతున్నారు. చివరగా కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకున్న భూములు. కబ్జాకు గురైన భూముల్లో కొన్నిచోట్ల్ల నిర్మాణాలున్నాయి. వీటన్నింటి విషయంలో ఒకే విధానం అనుసరించడం సాధ్యం కాదు అని తెలిపారు.

ఆక్రమించినవారికి భూములను క్రమబద్ధీకరించి నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే క్రమబద్ధీకరణను పరిశీలిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆరు సూత్రాలకు అనుగుణంగా ఎవరెవరు ఏ కేటగిరీ కిందికి వస్తారో నిర్ణయించడానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీలు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రమబద్ధీకరణలో రాజకీయ పట్టింపులకుపోకుండా అందరి అభిప్రాయాలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జీవో నం.166 ద్వారా అనేక అవకతవకలు జరిగిన అంశం కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన అన్ని అక్రమాలపైనా దృష్టి సారించాలని అఖిలపక్షం అభిప్రాయపడ్డట్లు సమాచారం.

సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు టీ పద్మారావు, పీ మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్లు భట్టి విక్రమార్క, నిరంజన్(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, నర్సిరెడ్డి (టీడీపీ), కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ (బీజేపీ), జాఫ్రీ, బలాలా(ఎంఐఎం), చాడ వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య (సీపీఎం), వేణుగోపాలచారి, రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), కే శివకుమార్ (వైఎస్సార్సీపీ), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీఆర్ మీనా, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి రేమాండ్ పీటర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, రెవెన్యూశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ సెక్రటరీ ఎం నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.