-రాష్ట్రానికి నష్టం జరిగితే క్షమించం -సీమకు నీళ్లు గోదావరి నుంచి తీసుకోండి -చిల్లర పంచాయితీలతో సాధించేదేమీ లేదు -సీమకు నీళ్లు గోదావరి నుంచి తీసుకోండి -‘పోతిరెడ్డిపాడు’ వివాదంపై సీఎం కేసీఆర్

నదీజలాల విషయంలో రాష్ర్టానికి నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ అన్నారు. నీళ్ల విషయంలో తనకు స్పష్టమైన, స్ఫటిక సదృశమైన అవగాహన ఉందని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీజలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై తాను చేసినట్టుగా ఎవరూ పోరాటం చేయలేదని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు డైవర్షన్ కెనాల్ విస్తరణపై తమ వ్యూహాలు తమకున్నాయన్నారు. సోమవారం క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశంలో నదీజలాలపై సీఎం కేసీఆర్ స్పందన ఆయన మాటల్లోనే..
అరివీరభయంకరంగా కొట్లాడింది నేనే.. పోతిరెడ్డిపాడుపై మా పాలసీ మాకు ఉంది. నీటివాటాలకు సంబంధించి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన, స్పటిక సదృశమైన అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన కేటాయింపుల మేరకు మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. దానిప్రకారమే అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. అంతకుమించి కాంట్రవర్సీలకు పోను. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా. నీళ్ల గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతారా! పనికిమాలినవన్నీ మాట్లాడి ప్రతిపక్ష నేతలు పరువు తీసుకోవడం ఎందుకు? నాదాన్ దుశ్మన్ పదేపదే చెప్తున్నా. వారు మాట్లాడితే నాకు మైలేజ్ రాదయ్యా.. పోతిరెడ్డిపాడు మీద అరివీర భయంకరంగా కొట్లాడినోడు ఎవరు? నాడు చెంచాగిరీ, ఆంధ్ర సీఎంల సంచులు మోసింది ఎవడయ్యా? నేను నోరుతెరిస్తే బాగుండదు. వాళ్లకు అంశాలు ఎత్తుకోవడం తెలుస్తలేదు. నాకు అధికారికంగా సమాచారం వచ్చిన ఐదునిమిషాల్లో సమావేశం ఏర్పాటుచేసిన. ప్రొటెస్ట్ చేశాం. వుయ్ ఆర్ ఫైటింగ్. దాని గురించి మాట్లాడాలంటే ప్రతిపక్ష నేతలకు ఇంగితం ఉండాలి.
అల్లాటప్పాగా మాట్లాడను.. పాలమూరు ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. మేం కొట్లాడినం.. తీర్పు ఇచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు పొమ్మన్నారు. అప్పుడు ఇంకొకరు ముఖ్యమంత్రి ఉండె. నేను కూడా హాజరయ్యాను. మాట్లాడినం.. ఆయన ఒప్పుకొని పోయిండు.. మీది మీరు కట్టుకొండి.. మాది మేం కట్టుకుంటామన్నాం. అట్లనే కట్టుకుంటున్నాం. ఆ సమావేశ మినిట్స్ ఉన్నాయి. అప్పుడు ఉమాభారతి కేంద్రమంత్రిగా ఉన్నారు. మా ప్రజలకు న్యాయం చేయడానికి మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఎక్కడా ఉల్లంఘనలకు పాల్పడలే దు. అతిక్రమించలేదు. వివాదాలకు పోదల్చుకోలేదు. నేను ధైర్యమున్న మనిషిని. పిచ్చిపిచ్చిగా అల్లాటప్పాగా మాట్లాడేవాన్ని కాదు. నాకు విషయ పరిజ్ఞానం ఉంది. భౌగోళిక పరిజ్ఞానం ఉంది. ప్రజల అవసరాలపై కన్సర్న్ కూడా ఉంది.
భేషజాలెందుకు..? ప్రజలు ఎక్కడివారైనా ప్రజలే. ఎవరో చిల్లరగాడు అన్నా డు.. నువ్వు రాయలసీమకు నీళ్లు పోవాలని అనలేదా అని..! ఎందుకు అనలేదు.. అన్నాను. వందశాతం అన్నాను. ఇప్పు డు కూడా చెప్తున్నా.. రాయలసీమకు ఎందుకు నీళ్లు పోవద్దు? గోదావరిలో నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అవి తీసుకుపొమ్మని చెప్పిన.. తప్పా? మిగులు జలాలు ఉ న్నాయి.. వాటిని మలుపుకొని తీసుకుపోండని చెప్పినం. అది మంచిమాటే కదా! పిచ్చిలొల్లి పెట్టం. అట్లాంటి చిల్లర అవసరాలు లేవు.. మేం పర్ఫెక్ట్గా ఉంటాం. ప్రజలు మాకు వందశాతం మద్దతిస్తున్నారు. వీళ్ల (ప్రతిపక్షాలు) గురించి పట్టించుకోవద్దని ప్రజలు చెప్తున్నారు. మీ టైం వేస్ట్, మా టైం వేస్టని ప్రజలే అంటున్నరు.
రాష్ట్రమంతా పిలిచి భోజనం పెట్టి, బేసిన్లు లేవు, భేషజాలు లేవు. బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి.. మీరు వాడుకోండి, మేం వాడుకుంటామని చెప్పాం. రెండు రాష్ట్రాల అవసరాలకు సరిపోను మరో 1000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బస్తీమే సవాల్ అన్నారు. ఏం సాధించారు? కృష్ణాలో ఒక్క టీఎంసీ సాధించారా? పచ్చజెండాలు కర్ణాటక బార్డర్ మీదికి పోవడం.. మాట్లాడితే తొడకొట్టి సుప్రీంకోర్టుకు పోవడం.. ఏమైనా తెచ్చారా..? బాబు బాబ్లీ పంచాయితీ పెట్టిండు.. బోగ స్ పంచాయితీ.. ఏమైనా వచ్చిందా..? ఇవాళ మేం తెచ్చాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా వారిని కన్విన్స్ చేసి అర్థమయ్యేలా చెప్పినం. 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగారు. మహారాష్ట్ర సీఎం నాకన్నా వయసులో చిన్నవాడైనా ఏడుసార్లు పోయాను. సాధించుకొచ్చాను. కాళేశ్వరంనుంచి వందల టీఎంసీల నీళ్లు బాజాప్తా తీసుకుంటున్నాం. ఇట్ల చేసుకొమ్మని చెప్పినం. ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేదు.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తేలేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ల ప్రపోజల్.. వాళ్ల ఇష్టం. రాయలసీమకు నీళ్లు కావాలంటే గోదావరి నుంచి తీసుకుపోండని మనమే చెప్పినం. మేం తీసుకుంటం.. మీరూ తీసుకోవాలని చెప్పినం. సింపుల్ విషయం అది. అదికాదు మేము వేరేరకంగా తీసుకుంటామంటే, మన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్కక్షణం కూడా క్షమించే ప్రశ్నేలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీపడే ప్రసక్తేలేదు. ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా నీళ్లు గోదావరిలో ఉన్నయి. వాటిని ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఎక్కడికి తీసుకుపోయినా అభ్యంతరం లేదని గొప్ప హృదయంతో మేం చెప్పాం. నాకు రెండు నాలుకలు లేవు. ఏపీతో వివాదాలేం లేవు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. అన్యోన్యంగా కలిసే ఉన్నాం. ఇక మీదట కూడా ఉంటాం. వాళ్లు నీళ్లు తీసుకుంటే మేం ఊకుంటమా. వింటే మంచి మాట. లేదు కొట్లాట.. దానికేముంది.
650 టీఎంసీల మిగులు జలాలు అడిగాం గోదావరి మీద నేను ఈ మధ్యనే నిపుణుల కమిటీ వేశాను. మా వాటా పోను మాకు 650 టీఎంసీల మిగులు జలాలు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. ఎందుకోసం అంటే మాట్లాడితే గోదావరి, కావేరీ అంటున్నరు. తాగు, సాగు, పరిశ్రమలకైనా గోదావరి తప్ప ఇంకో దిక్కులేదు మాకు. గోదావరి బేసిన్లో ఉన్నాం. 500 కిలోమీటర్ల పై చిలుకు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తున్నది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దాంట్లో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది. మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరో 650 టీఎంసీల మిగులు జలాలు కేటాయించాలని కోరుతున్నాం. ఎప్పుడో కోరాం ఇప్పుడు కమిటీ వేసి మళ్లీ అడుగుతున్నాం.