Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు

నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది. ఈ ప్రాంతానికి ఉన్న సానుకూలతలు, నీటి లభ్యత తదితరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ 7600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్ కష్టాలకు తెరదించే ఈ బృహత్తర ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ జెన్‌కో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పూర్తికానుంది. నల్లగొండ జిల్లాలో థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణానికి వీలైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.

KCR-review-meet-on-Power-plants01

-దామరచర్లలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -కృష్ణపట్టెలో రానున్న భారీ థర్మల్ ప్లాంట్ -డీపీఆర్ రూపొందించాలని జెన్‌కోకు ఆదేశం -రూ.55 వేల కోట్లపెట్టుబడి అంచనా! -విద్యుత్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు -నల్లగొండ జిల్లాకు సరికొత్త పారిశ్రామిక కళ దామరచర్ల మండలం పరిధిలోని వీర్లపాలెం, దిలావర్‌పూర్ పరిసరాల్లో ఉన్న దాదాపు 7,800 ఎకరాల రిజర్వు ఫారెస్టు ప్రాంతాలను కొత్త పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలమైనవిగా ఖరారుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఒక హెలికాప్టర్‌లో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఎం అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఎన్టీపీసీ, ఇతర అధికారులు మరో హెలికాప్టర్‌లో దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుకున్నారు.

స్థానికంగా అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన మ్యాపులద్వారా భూముల వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి బృందం.. తదుపరి కాలికనడకన కలియతిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. దగ్గర్లోనే రైల్వే లైను సదుపాయం, కృష్ణానదినుంచి నీటి లభ్యత ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపించేందుకు అక్కడి స్థలం అత్యంత అనుకూలమైనదిగా నిర్ణయించారు. అనంతరం అరగంటపాటు ఏరియల్ సర్వే నిర్వహించారు. దామరచర్లతోపాటు మఠంపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను సైతం పరిశీలించారు.

సీఎం హెలికాప్టర్ నేరుగా మళ్లీ వీర్లపాలెం చేరుకోగా.. అధికారుల బృందం మాత్రం మఠంపల్లి మండలంలోని పెద్దవీడుకు వెళ్లి తిరిగి వచ్చింది. భూములతోపాటు పక్కనే ఉన్న కృష్ణానది, రైల్వే ట్రాక్, హైవేవంటి అంశాలను సీఎం ఏరియల్ సర్వేలో పరిశీలించినట్లు సమాచారం. రెండు గంటల వరకు భోజన విరామం తర్వాత ఉన్నతాధికారులతో పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 3.45 గంటలకు రెండు హెలికాప్టర్లలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాయి. సీఎంతోపాటు వచ్చిన మంత్రులు, అధికారులతోపాటు జిల్లా కలెక్టర్ చిరంజీవులు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జడ్పీ చైర్మన్ బాలూ నాయక్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు,

వేముల వీరేశం, గాదరి కిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ, మిర్యాలగూడ ఆర్డీవో కిషన్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నేతలు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు అంతర్గత సమీక్షలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాట్లపై సమీక్షించారు.

విభజనచట్టం ప్రకారం తెలంగాణలో ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలి. 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇప్పటికే కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద ఎన్టీపీసీ పనులు చేపట్టింది. మిగిలిన 2,400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్రాజెక్టును దామరచర్ల మండలంలో నెలకొల్పేందుకు వీలుగా ఎన్టీపీసీకి భూములు కేటాయించాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కొత్తగా ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పతి ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 1,080 మెగావాట్ల (4×270) సామర్థ్యం కలిగిన పవర్ ప్రాజెక్టు పనులను ఖమ్మం జిల్లా మణుగూరు సమీప రామానుజులపల్లిలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) చేపట్టింది. మరో రెండేండ్లలో పనులు పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయనున్నాయి. మిగతా దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు దామరచర్ల మండల భూములు అనుకూలమైనవని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక్కడ 4,000 మెగావాట్ల (5×800) యూనిట్లతో పాటు, మరో 1,200 మెగావాట్ల (2×600) యూనిట్లు స్థాపించాలని కూడా జరపాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 5,200 మెగావాట్లు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2,400 మెగావాట్లు మొత్తంగా 7,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్త థర్మల్ పవర్ స్టేషన్లను దామరచర్ల మండలంలో నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ రిజర్వు ఫారెస్టు భూములు కూడా ఉన్నందున సమీక్ష సమావేశం నుంచే కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం కేసీఆర్ టెలిఫోన్‌లో మాట్లాడారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా మరొక చోట భూములను ప్రభుత్వం కేటాయిస్తుందని, ప్రాజెక్టు నిర్మాణాల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు.

కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదనలు అందిన వారంలోగా అన్ని రకాల అనుమతులు ఇప్పిస్తామని జవదేకర్ హామీఇచ్చారు. దాంతో తానే స్వయంగా ప్రతిపాదనలు తీసుకుని జనవరి మొదటి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. అందుకు అనువుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పరిధిలోనే మరొకచోట రిజర్వు ఫారెస్టుకు భూముల కేటాయింపులకు వీలుగా ప్రతిపాదనలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులుకు సీఎం ఆదేశించారు.

కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు కృష్ణానదినుంచి నీటి కేటాయింపులు జరుపుతామని, విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వీలుగా తక్షణమే పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించాలని టీ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావును ఆదేశించారు. వెనుకబడి ఉన్న నల్లగొండ జిల్లాకు 7,800 ఎకరాల్లో 7,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టులు రావడంతో ఎంతో మేలు కలుగుతుందని సీఎం అన్నారు.

8 వేల ఎకరాల అటవీ భూమి దామరచర్ల మండలం వీర్లపాలెం-దిలావర్‌పూర్ గ్రామాల పరిధిలో సుమారు 7 నుంచి 8 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూమిని తీసుకుని నేరేడుచర్ల మండలంలో ఉన్న 10 వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లోంచి అటవీ శాఖకు బదిలీచేసే అవకాశం ఉంది. 7500 ఎకరాల భూమిలో రూ.55 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 7600 మెగావాట్ల భారీ పవర్ ప్లాంటు నిర్మాణం కోసం మధ్యమధ్యలో కొంత రైతుల నుంచి భూమిని తీసుకోవాల్సి ఉంటుంది.

ముందు 800 మెగావాట్లతో మొదలుపెట్టి దశల వారీ విస్తరణ ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ చర్యలు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించినట్లు సమాచారం. జెన్‌కోకు భూములు అప్పగించిన తర్వాత రెండేళ్లలో పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

నల్లగొండ జిల్లాలోనే అతి భారీ ప్రాజెక్టు ఇప్పటి వరకు జిల్లాలోని కృష్ణపట్టె ప్రాంతం సిమెంటు పరిశ్రమలు, రైస్ మిల్లులకు మాత్రమే పరిమితమై ఉండేది. సిమెంటు పరిశ్రమలకు అనుబంధంగా చిన్న చిన్న థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో 7600 మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండడంతో జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ పవర్ ప్రాజెక్టుతో జిల్లాకు కొత్త పారిశ్రామిక కళ సంతరించుకోనుంది. దీనిపై జిల్లావాసులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం 7500 ఎకరాల భూమిలో రూ.55 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో చేపట్టనున్నట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఇప్పటికే యాదగిరిగుట్టతోపాటు రాచకొండలోనూ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

శాశ్వతంగా రుణపడి ఉంటాం భాస్కర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో అతిపెద్ద పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయంతో ఆశ్చర్యపోయాం. ఒక్క రోజులోనే భూములను పరిశీలించి, 7600 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ఇక్కడి వాళ్లుగా మేమంతా శాశ్వతంగా రుణపడి ఉంటాం. ప్రాజెక్టుతోపాటు మెగాసిటీ వల్ల వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మా పూర్వజన్మ సుకృతం ఫలితంగానే ఇంతటి బృహత్ ప్రాజెక్టు మా ప్రాంతానికి దక్కింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.