-అవార్డు ప్రకటించిన స్కోచ్

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావును మరో అవార్డు వరించింది. ‘స్కోచ్’ సంస్థ 2020 కి గాను దేశంలో ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’ అవార్డును ప్రకటించింది. దీంతోపాటు తెలంగాణ ‘ఈ-గవర్నెన్స్’ విభాగంలో తెలంగాణలో అగ్రభాగంలో నిలిచిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ ప్రకటించారు. 2019లో ఈ గవర్నెన్స్ విభాగంలో తెలంగాణ పదో స్థానంలో ఉండగా 2020 నాటికి తొలి ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. ప్రజాసేవల విభాగంలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ఐటీ ఆధారిత సేవలను తెలంగాణ విస్తృతపరిచిందని, కరోనా సమయంలో ఐటీ సేవలను ఉపయోగించిందని ప్రశంసించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాసేవకు ఉపయోగించారని కొనియాడారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ ఐటీని అగ్రభాగంలో నిలిపారని, స్కోచ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డును రెండుసార్లు సాధించిన తొలి మంత్రిగా కేటీఆర్ నిలిచారని సమీర్కొచ్చర్ ప్రశంసించారు.