పక్కా ప్రణాళిక.. ముందే అపాయింట్‌మెంట్లు.. బిజినెస్‌లైక్‌గా సమావేశాలు! అనుకున్న షెడ్యూల్లో మిస్సయినవే లేవు! ఆడంబరాలు అసలే లేవు! పూర్తి హుందాతనం.. అడుగడుగునా వృత్తి నిపుణత! ఒక కార్పొరేట్ దిగ్గజం మరో కార్పొరేట్ దిగ్గజాన్ని కలిసినట్లే! వీలున్న చోట.. సమయానుకూలతనుబట్టి.. స్థానిక ఎన్నారైలు ఏర్పాటు చేసిన సమావేశాలే! అవి కూడా బ్రాండ్ తెలంగాణను ప్రపంచానికి చాటేవే! వాటన్నింటి ఫలితం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సొంత క్యాంపస్ నిర్మాణానికి హైదరాబాద్‌ను ప్రఖ్యాత సెర్చింజిన్ గూగుల్ ఎంచుకోవడం! గూగుల్ స్ట్రీట్‌వ్యూ సేవలు పొందే తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుండటం! హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు విశ్వ విఖ్యాత మైక్రోసాఫ్ట్ సై అనడం!
-అమెరికా పర్యటనకు అనూహ్య స్పందన
-వేల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగావకాశాలు
-వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు
-దిగ్విజయంగా ముగిసిన 2 వారాల పర్యటన
ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు హెచ్‌పీ కంపెనీ సిద్ధపడటం.. అడోబ్.. ఒరాకిల్.. అనేక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు హామీలు ఇవ్వడం! వేల కోట్ల పెట్టుబడులు.. వేల మందికి ఉపాధి అవకాశాలు!! ఇది రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండువారాలపాటు అమెరికాలో చేసిన పర్యటన సాధించిన ఘనత!
తెలంగాణ ఏర్పడితే ఐటీ పరిశ్రమ ఎగిరిపోతుందని విష ప్రచారం చేసిన దుష్టశక్తులకు దీటైన సమాధానం చెప్పింది ఐటీ మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటన. అమెరికాపై కాలు మోపింది మొదలు.. ఐటీ, పారిశ్రామికరంగాల్లోని ఆయా దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులను కలుస్తూ బిజీబిజీగా గడిపిన కేటీఆర్.. తన రెండు వారాల పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలైనన్ని ఎక్కువ సంస్థలను ఒప్పించాలన్న దృఢ సంకల్పంతో వెళ్లిన కేటీఆర్.. ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు.
షెడ్యూలు దెబ్బతినకుండా మంచు తుఫానులో సాహసయాత్రలు చేసి మరీ కంపెనీల అధిపతులను కలిశారు. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, తద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అనేక ఎంవోయూలను కుదుర్చుకున్నారు. హైదరాబాద్ భౌగోళిక ప్రత్యేకతలు మొదలుకుని.. ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్, ఫార్మారంగాల్లో ఇప్పటికే హైదరాబాద్‌కు ఉన్న ప్రఖ్యాతిని వివరిస్తూ.. ప్రభుత్వం కొత్తగా.. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని పరిచయం చేస్తూ అమెరికా కంపెనీల మనసుదోచుకునేలా కేటీఆర్ పర్యటన సాగింది. చివరి రోజైన సోమవారం ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. అనంతరం సియాటెల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ స్కిన్‌ఫెల్డ్‌తో కూడా సమావేశమయ్యారు. అంతకు ముందు ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లను కలిశారు.
హైదరాబాద్ మా హాట్ ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ తమ హాట్ ఫేవరెట్ అని పలు ఐటీ, పారిశ్రామిక సంస్థలు తేల్చి చెప్పాయి. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ మొదటిసారి అమెరికా బయట నిర్మించబోయే తమ అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌తోపాటే ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేందుకు చేపట్టనున్న కార్యక్రమంలో సలహాలు ఇచ్చేందుకు గూగుల్ ఫైబర్ బృందం అంగీకరించింది. భారతదేశంలోనే తొలిసారి పూర్తి స్థాయిలో గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలను పొందే రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే పని చేస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీని మరింతగా విస్తరించేందుకున్న అవకాశాలు పరిశీలిస్తామని ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.
డాటా అనలిటిక్స్‌లో 30ఏండ్ల అనుభవం కలిగిన ఇన్ రిథమ్ కంపెనీ తెలగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని డాటా సెంటర్లకి ఉన్న రక్షణపట్ల ముగ్ధుడైన ఒరాకిల్ సీఈవో మార్క్‌హర్డ్.. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అసక్తి ప్రదర్శించారు. తాను పక్కా హైదరాబాదీనని చెప్పిన అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్.. హైదరాబాద్‌కోసం కచ్చితంగా సహకారం అందజేస్తానని మంత్రికి హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సీఈవో కేఆర్ శ్రీధర్ త్వరలోనే హైదరాబాద్ వస్తానని హామీ ఇచ్చారు. సిలికాన్ వ్యాలీలో నాస్కాం నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఇన్నోట్రెక్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగానికి ముగ్ధులైన పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు తెలంగాణ స్టార్టప్‌లకు సిలికాన్ వ్యాలీలో చోటు కల్పిస్తామని చెప్పారు.
పెట్టుబడులకు సిద్ధమన్న బోయింగ్ వైమానిక రంగంలో పేరెన్నికగన్న బోయింగ్ కంపెనీ అధ్యక్షుడు మార్క్ అలెన్ తమ కంపెనీ విస్తరణకు త్వరలోనే తెలంగాణకు తమ సంస్థ సీనియర్ ప్రతినిధులను పంపించనున్నట్లు కేటీఆర్‌కు తెలిపారు. హెచ్‌పీ ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ఐటీ దిగ్గజం హ్యులెట్ ప్యాకర్డ్(హెచ్‌పీ) వైస్ ప్రెసిడెంట్ సుపర్ణో బెనర్జీ అంగీకరించారు. ప్రముఖ ఐటీ, పెట్టుబడుల సంస్థ డీఈ షా ఎండీ ఎరిక్ వెప్‌సిక్ మరో కంపెనీ బ్లాక్‌స్టోన్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి హైదరాబాద్‌లో రూ.1274 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ రంగంలో పలు ప్రైవేటు సంస్థలను కలుపుకొని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాస్టర్ కార్డ్ అధ్యక్షుడు అజయ్ బంగా తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించేందుకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ కేపీఎంజీ చైర్మన్ జాన్‌వేహ్ మేయర్ అంగీకరించారు.

ప్రఖ్యాత వెంచర్ క్యాపిటల్ సంస్థ న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్‌తో కేటీఆర్ సమావేశమై హైదరాబాద్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. సన్ మైక్రో సిస్టమ్స్ కో ఫౌండర్ వినోద్ కోస్లా, జనరల్ ఎలక్రికల్స్ సంస్థ మాజీ చైర్మన్, సీఈవో జాక్ వెల్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీ ఎన్నారైలు మిషన్ కాకతీయకు 50,000 డాలర్ల విరాళాన్ని, డల్లాస్ ఎన్నారైలు 2లక్షల డాలర్లను వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకువచ్చారు.
తెలంగాణలో పాలన భేష్: అమెజాన్ తెలంగాణ ప్రభుత్వ చురుకైన పాలన పద్ధతులను అనుసరిస్తున్నదంటూ ప్రముఖ అమెరికా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అభినందించింది. రెండు వారాలుగా అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు చివరి రోజైన సోమవారం సియాటెల్‌లోని అమెజాన్ క్యాంపస్‌ను సందర్శించారు. అమెజాన్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మోనిక్ మెకీ, ఆ సంస్థ డైరెక్టర్ జాన్ స్కాట్లర్‌లను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్‌తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సియాటెల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ స్కిన్‌ఫెల్డ్‌తో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా సంస్థలకు సింగిల్ విండోలో అనుమతులు ఇస్తున్న తీరును మంత్రి ఆయనకు వివరించారు. టీ హబ్, టాస్క్‌వంటి కొత్త పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టిన విధానాలను సత్య నాదెళ్లకు తెలియజేశారు.