-చాలెంజర్ పురస్కారాన్ని ప్రదానంచేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు -అవార్డు తనకు కాదు కేసీఆర్ మార్గనిర్దేశకత్వానికి గుర్తింపు అన్న మంత్రి కేటీఆర్

రాష్ట్రమంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో స్కోచ్ సంస్థ చాలెంజర్ అవార్డును అందుకున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై నెలల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను అభినందిస్తూ సంస్థ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్‌కు అవార్డును ప్రదానం చేశారు.
స్టార్టప్ ఇండియా విభాగం కింద హైదరాబాద్ నగరంలో టీ-హబ్ పేరుతో ఐటీ రంగంలో ఇన్‌క్యుబేటర్‌ను నెలకొల్పడంలో మంత్రి కేటీఆర్ ప్రముఖ పాత్ర పోషించారని, ఈ రంగ అభివృద్ధిలో ఈ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని స్కాచ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ వ్యాఖ్యానించారు. అవార్డును అందుకున్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈ అవార్డు వ్యక్తిగతంగా తన పేరు మీద ఇచ్చినప్పటికీ నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఐటీ రంగానికి లభించిన గుర్తింపు ఇది అని వ్యాఖ్యానించారు. టీ-హబ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడిందని, అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు దీనివైపు చూస్తున్నాయని, పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌పై దృష్టి సారించాయని అన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమం తొలిసెషన్‌కు హాజరై దేశంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తున్నందుకు సంస్థకు అభినందనలు తెలిపారు. ఐటీ రంగంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా ప్రతిభ కనబర్చిన వ్యక్తులను ఈ సంస్థ అవార్డులతో సత్కరించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు స్కోచ్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.