Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమి అంటేనే సంక్షోభం

-నాలుగున్నరేండ్లలో సుభిక్ష రాష్ట్రంగా తెలంగాణ
-కూటమి వస్తే దొంగలుకొట్టే రాత్రి కరంటు చాలవుతది
-కురుమల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కేసీఆరే
-గజ్వేల్ కురుమల ఆత్మీయసభలో మంత్రి హరీశ్‌రావు

కూటమి అంటే సంకీర్ణం, సంకీర్ణమంటేనే సంక్షోభం. మనకు సంకీర్ణం కావాలా? సంక్షేమం కావాలా? అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా? ఒకసారి ఆలోచన చేయండి. కూటమి అధికారంలోకి వస్తే కరంటు సంక్షోభం వస్తుంది. కాంగ్రెసోళ్లస్తే దొంగలు కొట్టేరాత్రి కరంటు చాలవుతుంది. ఆ మాయాకూటమి అధికారంలోకి వస్తే రాజకీయ, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వర్గల్, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణను ఈ నాలుగున్నరేండ్లలో సంక్షేమ, సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. అడుగకుండానే గొర్రెపిల్లలను రూ.6వేల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చారని చెప్పారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలను తీసుకురావడమే కాకుండా 24గంటల కరంటు ఇచ్చిన గొప్పతనం సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. సుభిక్ష రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలన్నీ ఉండాలంటే మనం కేసీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని కురుమల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ కాంగ్రెస్‌వాళ్లకు ఉండదని చెప్పారు.

కాంగ్రెసోళ్ల కండ్లకు రేచీకటి వచ్చింది
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెసోళ్ల్లకు కనిపించడంలేదు. వారికి రేచీకట్లు వచ్చాయి. కంటి వెలుగు పథకానికి వెళ్లి కండ్ల పరీక్షలు చేయించుకోవాలి అని మంత్రి హరీశ్ సూచించారు. పక్కరాష్ట్రం మంత్రి రేవన్న ఇక్కడి అభివృద్ధి పథకాలను మెచ్చుకొని పోతే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శించారని ఆరోపించారు. కాంగ్రెసోళ్లు అధికారంలో ఉన్నప్పుడు కురుమలకు గుంటెడు జాగ ఇచ్చారా? అని ప్రశ్నించారు. అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలాన్ని రూ.5 కోట్లు ఇచ్చిందని చెప్పారు. కురుమల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంకోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. కురుమలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.

పొద్దుందాక తిరిగే ముఖంలేక చీకట్ల తిరుగుతుండ్రు
గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు చీకట్ల తిరుగుతుండ్రు. పొద్దుందాక తిరిగే ముఖంలేక సాటుసాటుకు తిరుగుతున్నారు. పన్నెండుగంటల రాత్రికి తలుపులు కొట్టి కాళ్ల మీద పడుతుండ్రు. పనులుచేస్తే కాళ్లపై ఎందుకు పడాలే. అట్లా కాళ్లపై పడేటోళ్లకు, క్వార్టర్ పెట్టెలు పంచేటోళ్లకు మీరే తగిన గుణపాఠం చెప్పాలి అని మంత్రి పిలుపునిచ్చారు. మన అక్కచెల్లెండ్లు ఇంట్లో నల్ల తిప్పుతుంటుంటే గలగల వచ్చే గోదావరి నీళ్లు ముఖ్యమా? ఈ ఒక్కనాడు వచ్చే క్వార్టర్ సీసాలు ముఖ్యమా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పనగేశ్, కొమురవెల్లి మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్ సేవేళ్ల సంపత్, కురుమ సంఘం నాయకులు రామస్వామి, రాజేశ్వర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత గజ్వేల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒగ్గుడోలు విన్యాసాలు, బోనాలతో మంత్రి హరీశ్‌రావుకు ఘనంగా స్వాగతం పలికారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.