Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమిది బొమ్మలాట

-అధికారమిస్తే దశాబ్దాల గోస పునరావృతం
-టీఆర్‌ఎస్ గెలిస్తే నిర్ణయాధికారం ప్రజలదే
-ఆడబిడ్డలకు చీరెలివ్వకుండా అడ్డుకున్న ప్రతిపక్షం
-మన తలరాతలు మార్చేవి ఈ ఎన్నికలే
-ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయండి
-గంభీరావుపేట రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
-నేతన్నల బతుకులకు భరోసా ఇచ్చామని వ్యాఖ్య
-రాహుల్ చేతిలో రిమోట్.. చంద్రబాబు చేతిలో సెల్లు

సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏర్పడిన కూటమిని తోలుబొమ్మలాటగా రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అభివర్ణించారు. రాహుల్‌గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్. చంద్రబాబు చేతిలో సెల్లు. మధ్యలో ఉత్తమ్‌కుమార్ తోలుబొమ్మలా ఆడుతుంటాడు అని ధ్వజమెత్తారు. వారికి అధికారమిస్తే విధాన నిర్ణయాలు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటాయని, అదే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నిర్ణయాధికారం ప్రజలదేనని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, దమ్మన్నపేట, నాగంపేట, గజసింగవరం, గోరంట్యాల, మల్లుపల్లి, లింగంపేటతండా, రాజేశ్వర్‌రావుతండా, లక్ష్మీపూర్‌తండాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మంత్రి మాట్లాడుతూ.. మన తలరాతలు మార్చే ఈ ఎన్నికల్లో రైతు వ్యతిరేక శక్తులకు ఓటేస్తే దశాబ్దాల గోస మళ్లీ పునరావృతమవుతుందని, మనకంట్లో మన వేలు పెట్టుకొని పొడుచుకున్నట్టే అవుతుందని అన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలతో ఉరితాళ్లు పేనిన సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉండి, వారి బతుకుకు భరోసా కల్పించామని కేటీఆర్ చెప్పారు.

నేతన్నలకు పనికల్పించి, ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరెలు ఇస్తామంటే కండ్లుమండిన కాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. నాలుగేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నదన్న కేటీఆర్.. గడిచిన అరవైఏండ్లుగా ఏమీచేయలేనివారు.. ఇప్పుడెలా చేస్తారంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ కోసం ప్రజలు అనేక పోరాటాలు చేసి జైలుపాలవుతున్నా పదవుల కోసం పెదవులు మూసి, తెలంగాణ రాకుండా అడ్డుకున్నోళ్లంతా ఒక్కటై వస్తున్నారని విమర్శించారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్న తెలంగాణను కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని, ప్రాజెక్టులపై 200 కేసులు వేసిందని మండిపడ్డారు. పంటకు ఎదురు పైసలు ఇచ్చే బ్రహ్మాండమైన రైతుబంధు పథకాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని కేటీఆర్ విమర్శించారు.

ద్రోహులకు అధికారమిస్తే చీకటి రోజులు వాపస్
తెలంగాణలో ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి 30 లేఖలు రాసిన గుంట నక్క చంద్రబాబు, ముసలి నక్క కాంగ్రెస్ పార్టీలకు పొరపాటున కూడా ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాగా ఆలోచించి ఓటేయాలని, లేకుంటే చీకటి రోజులు వాపస్ వస్తాయని హెచ్చరించారు. కరంటు అడిగిన పాపానికి కాల్చిచంపిన రాబందులు కావాలో? ఆదుకుంటున్న రైతుబంధువు సీఎం కేసీఆర్ కావాలో తేల్చుకోవాలన్నారు. చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిచేసుకోవాలంటే మళ్లీ కేసీఆర్‌నే సీఎం చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీచేస్తుందని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో స్వల్పమార్పులు చేసి, స్థలాలు ఉన్నవారికి రూ.5లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రాజెక్టులు పూర్తిచేసి, ప్రతి గుంట భూమికి నీరిచ్చే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. పర్యటించిన ప్రతి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన ప్రజలకు చదివి వినిపించారు.

రామన్నకు బతుకమ్మలతో భారీ స్వాగతం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, పీరీలతో స్వాగతం పలికారు. మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి కేటీఆర్ నుదుట తిలకందిద్ది నీరాజనం పలికారు. రోడ్డు వెంట పటాకులు కాలుస్తూ కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగారు. ప్రతిగ్రామంలో కిలోమీటరు పొడువునా ప్రజలు బారులు తీరారు. సముద్రలింగాపూర్‌లో ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులంతా మంత్రికి మద్దతు ప్రకటించారు. నాగంపేట, మల్లుపల్లి, దేశాయిపేట, గజసింగవరం, గొరింట్యాల గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జగిత్యాలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్, మున్నూరు కాపు సంఘం నాయకుడు సమీండ్ల శ్రీనివాస్ మంత్రి టీఆర్‌ఎస్‌లో చేరారు. తమ గ్రామాలకు వచ్చిన కేటీఆర్‌తో యువత సెల్ఫీలు తీసుకున్నారు. కార్యక్రమాల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల అధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావు, డాక్టర్ రాజారాం, సెస్ డైరెక్టర్ దేవేందర్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చందా పృధ్వీధర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్, కంకణాల లింగన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షం కండ్లల్లో నిప్పులు
నాలుగున్నరేండ్ల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోయింది. దేశంలో నే ఆదర్శంగా నిలిచింది. దీన్నిచూసి ప్రతిపక్షాలు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి.
– మహమూద్‌అలీ, డిప్యూటీ సీఎం

గౌడ కులస్థులకు చేయూత
గౌడకులస్థులను ఆదుకుంటాం. తాటివనాలకు స్థలం కేటాయించి, డ్రిప్ సిస్టంను ఉచితంగా ఇస్తాం. తాటి మండువాల్లో షెడ్లు ఏర్పాటుచేయిస్తాం. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అమలుచేస్తాం. గీత సంఘాల్లో సభ్యుడైతే ద్విచక్ర వాహనాలు అందజేస్తాం.
-ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి

అమిత్ షా మాటలు హాస్యాస్పదం
రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతున్నదంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సోయితప్పి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి నలుగురు నాయకులుంటే.. ఎనిమిది గ్రూపులున్నాయి. మహాకూటమి ఎప్పుడు ఇచ్చుకపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీల్డ్‌కవర్ సీఎంలు మనకొద్దు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకుందాం.
– తన్నీరు హరీశ్‌రావు,రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.