Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమికి ఓటేస్తే మరణశాసనమే

-కాంగ్రెస్, టీడీపీతో పొత్తును ఏ అమరవీరుడు కోరాడు
-కేసీఆర్ అంటే కాల్వలు.. చెరువులు.. రిజర్వాయర్లు
-రాహుల్‌గాంధీవి నీతిమాలిన మాటలు
-బీజేపీతో పొత్తులేదు.. మోదీకి భయపడం
-రాష్ట్రంలో కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దు
-కాంగ్రెస్ నేతలకు ఆత్మగౌరవం లేదు..
-కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సభలో మంత్రి కే తారకరామారావు

మహాకూటమి పొత్తు తెలంగాణ రైతుల పొట్ట కొట్టేదేకానీ.. మన ప్రయోజనాలను కాపాడేదికాదని, మాయాకూటమికి ఓటేస్తే మన మరణశాసనాన్ని మనమే రాసుకున్నట్టేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు. తెలుగుదేశానికి లీడర్లు లేరు. వీరిద్దరికీ ముఖంలేదు అని ఎద్దేవాచేశారు. ఏ అమరుడి కుటుంబం కాంగ్రెస్, టీడీపీతో పొత్తు కోరిందో కోదండరాం చెప్పాలని డిమాండ్‌చేశారు. ప్రజలంతా ఆలోచనతో ఓట్లెయ్యాలని, ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లింగంపేట మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెట్టకపోయి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, సాగునీళ్లు పొలాలకు చేరుకునేవన్నారు. మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే.. సీఎం కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి దాని సాధనకు కృషిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అంటే.. కాల్వలు.. చెరువులు.. రిజర్వాయర్లు.. అని ప్రజలు చెప్పుకొంటున్నారని పేర్కొంటూ.. కారు వేగం ఆగొద్దని.. డ్రైవరు మారొద్దని అన్నారు.

నీతిమాలిన మాటల రాహుల్‌గాంధీ
ఇటీవల కామారెడ్డికి వచ్చిన రాహుల్‌గాంధీ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చెప్పినవన్నీ అసత్యాలేనని కేటీఆర్ స్పష్టంచేశారు. కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు అన్నడు రాహుల్. కాళేశ్వరం ఖర్చు రూ.80వేల కోట్లే. కాళేశ్వరంతో లాభంలేదు.. ఉత్తగనే అంచనాలు పెంచిండ్రని చెప్పిండు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.17వేల కోట్లతో అంచనాతో జీవో ఇచ్చింది. ఏడాది తిరుగకుండానే అంచనా వ్యయాన్ని రూ.34వేల కోట్లకు, మళ్లీ ఆరునెలల తర్వాత రిజర్వాయర్లు, ఎకరం ఆయకట్టు పెరుగకుండానే రూ.40వేల కోట్లకు చేర్చింది. మనం 16 లక్షల ఎకరాల ఆయకట్టును 34 లక్షల ఎకరాలకు పెంచాం. ఎల్లారెడ్డిలో ఒక్క రిజర్వాయర్ లేకుండే. ఇప్పుడిక్కడ ఆరు రిజర్వాయర్లు కడుతున్నం. రెండు పంప్‌హౌస్‌లు పెంచాం. రిజర్వాయర్లు పెరిగాయి. సిమెంట్, స్టీలు ధరలు పెరిగిన ఈ ఎనిమిదేండ్ల తర్వాత రూ.80వేల కోట్లకు అంచనాలు పెరుగవా? అని రాహుల్‌నుద్దేశించి అన్నారు. రాహుల్‌వి నీతిమాలిన మాటలు. సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖంలేని వ్యక్తి.. ఇక్కడొచ్చి గెలుస్తాడట. కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయితీస్తాడట అట్లుంది రాహుల్ పరిస్థితి అని ఎద్దేవాచేశారు.

కాళేశ్వరం పూర్తయితే ఎల్లారెడ్డి సస్యశ్యామలం
కాళేశ్వరం పూర్తయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయాధారిత ఎల్లారెడ్డిలో బోర్లు తప్ప పరిశ్రమలు లేవు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. బంగారంలాంటి వనరులున్నాయి. ఇన్ని రోజులు సమైక్యాంధ్ర పాలకుల చేతిలో ఉన్న పాపానికి నీళ్లు రాలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి లక్షా 20వేల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణలో 38 లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. తెలంగాణ పల్లెలు గోదావరి జిల్లాలుగా, మరో కోనసీమగా కనిపిస్తాయి అని చెప్పారు. అన్ని రాష్ర్టాల్లో రైతుల విషయంలో రాజకీయపార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. ఇక్కడ మాత్రం రైతులకు అన్యాయంచేసేందుకు కూడబలుక్కుంటున్నాయని విమర్శించారు. ఇది తెలంగాణ దురదృష్టం. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఆత్మగౌరవంతో పనిచేసినవారుకాదు. గతంలో ఆంధ్రా నాయకుల సంచులు మోసినవారు, వెన్నెముక లేని నాయకులు కావటమే ఈ పరిస్థితికి కారణం. ఒక్క పైసా ఇవ్వను పో అంటూ నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో కారుకూతలు కూసినా స్పందించినవారు లేరు. కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకుంటే ఎవ్వరూ నోరువిప్పని పరిస్థితి. ఇప్పుడు వీళ్లంతా కొత్త రూపాల్లో వస్తున్నారు అని కేటీఆర్ చెప్పారు.

కూటమితో చీకట్లే
పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే రాష్ర్టానికి చీకట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2009లో తొమ్మిదిగంటల కరంటు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆరుగంటలే ఇచ్చిందని గుర్తుచేశారు. ఆనాడు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఉండేదని, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. రైతులకు గుండె ధైర్యాన్నిస్తూ వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. అనేక కార్యక్రమాలను రైతుల కోసం చేసినప్పటికీ ఇంకా ఏదో చేయాలనే తపనలోనే కేసీఆర్ ఉన్నారని తెలిపారు.

మేం ఎవరికీ భయపడం
తాము ఎవరికీ భయపడేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అసలు బీజేపీతో టీఆర్‌ఎస్‌కు పొత్తేంది? అసలు పొత్తే ఉండదు. మోదీకి, రాహుల్‌కు, చంద్రబాబుకు టీఆర్‌ఎస్ భయపడదు. ప్రజలే మా బాస్‌లు. కాంగ్రెస్‌లా ఢిల్లీలో బాస్‌లుండరు అని చెప్పారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టీఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లా ఇంచార్జి బక్కి వెంకన్న, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దాదన్నగారి విఠల్‌రావు, నిట్టు వేణుగోపాల్‌రావు, ముజీబుద్దీన్, లోయపల్లి నర్సింగరావు, సత్యంరావు తదితరులు పాల్గొన్నారు.

పదివేల బైకులతో ర్యాలీ
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌సాగర్ చౌరస్తా నుంచి సభాస్థలి వరకు 10వేల బైక్‌లతో భారీర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నిజాంసాగర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారరథాలను కేటీఆర్ ప్రారంభించారు. దారిపొడవునా ప్రజలకు అభివాదంచేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు కదిలారు. రవీందర్‌రెడ్డి స్వగ్రామం ఎర్రాపహాడ్‌లో మంత్రికి మహిళలు ఎదురొచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఏ అమరుడి కుటుంబం పొత్తు కోరింది?
తెలంగాణ ఇస్తామని ఈ గడ్డపై ప్రకటన చేస్తే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, సమైక్యవాది చంద్రబాబుతో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖరాయించి టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని గుర్తుచేసిన కేటీఆర్.. టీజేఎస్ ఏ ప్రాతిపదికన కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నదో చెప్పాలని డిమాండ్‌చేశారు. అమరుల ఆకాంక్షల ప్రాతిపదికన పొత్తు అంటున్న కోదండరాంకు తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య కు టుంబం వచ్చి పొత్తు పెట్టుకోమందా? ఏ పార్టీ లు వందలమంది చావులకు కారణమయ్యా యో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొమ్మని ఎవరు చెప్పారు? అంటూ నిలదీశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రయత్నానికి కాంగ్రెస్ అడ్డం పడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి ఏకంగా 30 ఉత్తరాలు రాసి మన ప్రాజెక్టులకు అడ్డం పడుతుండు. ఈ రోజు కోదండరాం, కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి అన్నారు.

నాకు పొగరు లేదు, పౌరుషం ఉంది..
తనకు పొగరుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించడాన్ని మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనకు పొగరు లేదని, కానీ పౌరుషం ఉందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమాలు చేసినం.. జైలుకుపోయినం కాబట్టే పౌరుషం ఉందని స్పష్టంచేశారు. తనకు తెలివిలేదని ఉత్తమ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. నిజమే ఉత్తమ్‌లాగా నాకు కారు ఇంజిన్‌లో మూడుకోట్లు డబ్బులు పెట్టి వాటిని కాల్చే తెలివి లేదు. పేదలకు సేవచేసే తెలివి మాది. ఆపదలో ప్రజలకు అండగా నిలవాలనే తెలివి నాది అంటూ రిటార్టిచ్చారు. తాగునీరు, సాగునీరు ఇచ్చినంక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారనే భయం తో ప్రతిపక్షాలు రీతి లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఆఖరుకు తన కొడుకును కూడా వదలని స్థాయికి కాంగ్రెస్ నేతలు దిగజారారన్నారు. ఢిల్లీకి కేసీఆర్ పోతే మోదీని కలిసిండ్రని అంటుండ్రు. అసలు ప్రధాని జపాన్‌లో ఉన్నడనే తెలివి కూడా ఉత్తమ్‌కు, షబ్బీర్‌అలీకి లేదు అని ఎద్దేవాచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.