-ఓట్లకోసం సిద్ధాంతాన్ని మార్చిన టీడీపీ -వలసవాదులున్న పార్టీతో కోదండరాం వెంపర్లాట -బాబుతో కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అనిపించగలరా? -తెలంగాణకు కృష్ణానీళ్లు వద్దంటున్న బాబుతో కాంగ్రెస్ పొత్తా! -నాగర్కర్నూల్రోడ్షోలో మంత్రి హరీశ్‌రావు -సీఎం కేసీఆర్ వెంట నడిస్తే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం సిద్ధాంతాన్ని మార్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అవకాశవాద పార్టీల కూటమికి ఓటేస్తే.. తెలంగాణ మరోసారి వలసవాదుల పాలనలోకి వెళుతుందని హెచ్చరించారు. అదే కేసీఆర్‌కు ఓటువేస్తే అభివృద్ధి మరింత పురోగమిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సాధకులు, అభివృద్ధి నిరోధకుల మధ్య పోటీ నెలకొందని, అవకాశవాదులు కావాలా? అభివృద్ధి కావాలా? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మర్రి యువగర్జన రోడ్ షోకు మంత్రి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డ చంద్రబాబు.. కాంగ్రెస్, టీజేఎస్‌తో పొత్తు కట్టడం ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తులతో నమ్మకంతో ఉంటే.. ప్రజలపై నమ్మకంతోనే టీఆర్ఎస్ ఎన్నికల్లో దిగిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలువడం ఖాయమన్నారు.
ప్రజలు తరిమేసిన టీడీపీని కాంగ్రెస్ తెస్తున్నది పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ఆపాలని, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడులాంటి పథకాలకు కృష్ణానీళ్లు వద్దని చంద్రబాబు లేఖలు రాశారని, అలాంటి బాబు పార్టీని ప్రజలు తెలంగాణసీమ దాటిస్తే కాంగ్రెస్ నాయకులు తిరిగి పొత్తు పేరుతో పొలిమేరలోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పాలమూరులో వలసలను తాము వాపస్ తెస్తే.. వలసవాదులను కాంగ్రెస్ నాయకులు మళ్లీ తెస్తున్నారని అన్నారు. టీడీపీని వలసవాదులన్న కోదండరాం.. ఇప్పుడు అదే పార్టీతో నాలుగుసీట్ల కోసం వెంపర్లాడటంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు నడవనీయరని, కృష్ణానీళ్లు తెలంగాణకు రానీయరని చెప్పారు. శ్రీశైలం నీళ్లు చంద్రబాబు జాగీరా? ఎందుకు నీళ్లు వాడుకోనియ్యడు? ఏ విధంగా అడ్డుపడతావో చూస్తం. ఎవ్వరడ్డొచ్చినా కృష్ణానీళ్లతో ఎంజీకేఎల్ఐ మోటార్లు నడుపుతం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా? అమరవీరులకు జోహార్లు అర్పించారా? తెలంగాణ తల్లికి పూలదండ వేసారా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. ఖమ్మం నుంచి ఆంధ్రాలో బాబు కలుపుకొన్న ఏడు మండలాలను తిరిగి ఇప్పించగలరా? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తెప్పించగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చితే టీఆర్ఎస్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ప్రారంభించిందని చెప్పారు.

నంబర్‌వన్‌గా తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని హరీశ్ చెప్పారు. కృష్ణాజలాల్లో 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీల హక్కు సాధించుకున్నామని, గతేడాది 26టీఎంసీలు వాడుకున్నామన్నారు. కాంగ్రెస్‌పార్టీ చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్నదని చెప్తూ.. ఆయనకు ఓటేస్తే ఎంజీకేఎల్ఐ మోటర్లు నడవనిస్తారా? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణకు దక్కాలన్నా, ఆ నదులపై ప్రాజెక్టులు పూర్తికావాలన్నా టీఆర్ఎస్ గెలవడం అవసరమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బైకని శ్రీనివాస్‌యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డితో పాటుగా వేలమంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మాస్కులు ధరించిన యువత పాదయాత్రలో పాల్గొనగా.. నాయకులు ప్రచారం రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు.