Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కుత్సితాలను తిప్పికొడుదాం..!

ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ తరపున బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట్టి ప్రాంతీయ అస్తిత్వాలను కబళించే పార్టీకి స్థానిక సామంతుడు కాగా, మరొకరేమో ఆంధ్రా ఏజెంట్‌. ఇలాంటివారు ఇవ్వాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నరు! ఈనగాచి నక్కల పాలు చేసినట్టు.. ఇప్పుడిప్పుడే తలెత్తుకొని నిలబడుతున్న ‘తెలంగాణను ఎవని పాల్జేస్తరురో తెలంగాణ.. ఎవడేలుకోవాలిరో తెలంగాణ’ అని అడుగుతున్నది అందుకే!

అరువై ఏండ్ల వివక్ష, అణచివేతల నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకుపోతున్నది. దీన్ని ఓర్వలేని చంద్రబాబు, షర్మిల కువిమర్శలు చేస్తున్నరు. వీళ్ళా మన రాతలు మార్చేది? శాంతిభద్రతలు, సహజీవన పరిస్థితులు అడుగంటిపోయిన మధ్యయుగాల ను తలపించే మోదీ-షా ద్వయమా తెలంగాణ గీత కూర్చేది? గంగానదిలో శవాలు తేలుతూంటే నోరు మెదిపే ధైర్యం లేని బీజేపీ పంచన కూచున్న మాయావతి పార్టీయా తెలంగాణ చింత తీర్చేది. మన తెలంగాణకేం తక్కువైందని పరాయివాళ్ల పాలుచేద్దాం?! నిన్నమొన్ననే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ‘హైదరాబాద్‌కు అనుకూలంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దానికున్న అర్హతల కారణంగానే అన్ని కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్‌ వారధిలా ఉంది. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు ఇక్కడున్నారు. అన్నింటికన్నా మిన్నగా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించే సాటిలేని గొప్పమనస్తత్వం కలిగిన వారు’ అని కొనియాడారు. చాలదా తెలంగాణ ఘనతకు ఈ నిదర్శనం?

గతవారం పార్లమెంట్‌లో బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ నగుబాటుకు గురయ్యారు. తెలంగాణలో పరిశుభ్రమైన తాగునీరు అందుబాటు గురించి రేవంత్‌ ప్రశ్నిస్తే, దేశంలోకెల్లా తెలంగాణ టాప్‌లో ఉందన్నది పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణలో కేంద్రనిధుల దుర్వినియోగం గురించి బండి సంజయ్‌ అడిగితే.. అట్లాంటిదేమీ లేదని పార్లమెంట్‌లో కేంద్రమంత్రే సమాధానం! మాట్లాడకుంటే మీకు ఏం రాదని జనం అనుకుంటరు కావొచ్చు, కానీ మాట్లాడితే ఏమీ తెలియదన్నది తెలిసిపోతది కదా. ఎందుకురబై ఇజ్జత్తీసుకుంటరు? మీరేమి ఉద్ధరిస్తరు నలుపెరుగని యెర్రగురివిందల్లాగా!

మూలవాసులు, ఈ నేల బిడ్డలు, తెలంగాణ ఆత్మ ఉందని ఇంతకాలం అనుకున్న కొందరు నిరాశపరుస్తున్నరు. కేసీఆర్‌ సారథ్యంలోని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అందలాలెఎక్కిన ఈటల రాజేందర్‌ నేడు మాట్లాడుతున్న మాటలు అన్యాయమైనవి. విమర్శలు రాజకీయ జీవికలో భాగమని కొంతమేర అర్థం చేసుకోదగినా, ఆయన వ్యవహారం శృతి మించుతున్నది. ప్రాంతీయ పార్టీలు పనికిరావంటున్న ఈటల తెలంగాణ సహా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ర్టాలు బీజేపీ ఏలుబడిలోకి రావాలని కోరుకుంటున్నరు! ప్రజల ఆత్మగౌరవం అంటూ సుద్దులు చెప్పే ఈ మాజీ లెఫ్టిస్ట్‌ నేడు పక్కా మతతత్వవాదిగా మారిపోవడం శోచనీయం. భర్తృహరి అంటారు కదా- ‘ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి శీతాద్రిసుశ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబు నందుండి యస్తోకాంభోధి బయోధినుండి పవనాంధో లోకముంజేరె గంగాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్టసంపాతముల్‌..’ అచ్చు అట్లే వామపక్ష భావజాలం నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి, కీలక పదవుల నుంచి.. చివరికి మత తత్వవాదిలా మారి, వివేక భ్రష్టత తో తెలంగాణ సహా అన్ని ప్రాంతీ య అస్తిత్వాలను అపహాస్యం చేసేదాకా దిగజారారు ఈటల రాజేందర్‌.

జర్నలిజం ముసుగులో చీకటి వ్యాపారాలు చేసే తీన్మార్‌ మల్లన్న, స్వామిగౌడ్‌, విఠల్‌, బి.ఎస్‌.రాములు లాంటివారు పదవులు లేకపోతే ఉండలేని స్థితిలో బీజేపీ పంచన చేరుతున్నరు. పదవులే సర్వస్వమా? ప్రజల కోసం పనిచేసే, తెలంగాణ ఆత్మ ఉన్న టీఆర్‌ఎస్‌ లాంటి వేదికలో పనిచేయడం సరిపోదా? పదే పదే రెన్యువల్స్‌ మీకే కావాలంటే యువకులు ఏమైపోవాలి? ఇటీవల కేసీఆర్‌ పలురకాల పదవులు ఇచ్చింది ఎవరికి? యువతకూ, ఉద్యమవీరులకు కాదా? అది సరిపోదా? భూమి మీ చుట్టే తిరగాలా ఎప్పుడూ?

ఒక్క తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనే కాదు, నే డు దేశమంతా ఒక సాంస్కృతిక సంధి దశకు చేరుకుంటున్నది. అందుకే మనం తెలంగాణ బిడ్డలుగానే కాక భరతమాత బిడ్డలుగా కూడా గురుతరమైన బాధ్యతతో మెలగవలసి ఉన్న ది. కుత్సితపు అజెండాతో, మాయ మాటలతో మభ్యపెట్టే వ్యక్తులు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం సహా దేశమంతా ప్రజాస్వా మ్య పూరిత రాజకీ య కార్యాచరణ జరగాలి. దానికి కలిసివచ్చే శక్తులు నిరంతర చర్చలో ఉండాలి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆ సంకల్పం రాష్ట్రంలో నూ, దేశంలోనూ ప్రకటితమవుతున్నది. మనందరం అడుగులో అడుగేయాల్సిన సందర్భం ఇదే!

-శ్రీశైల్‌ రెడ్డి పంజుగుల ,90309 97371

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.