Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కుట్రదారుల నోట కాళోజీ మాటలు !

‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తం… ప్రాంతేతరులు దోపిడీ చేస్తే దూరం దాకా తన్ని తరుముతాం’… ఈ మాటలను చాలామంది బహిరంగసభలలో, మీడియాలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ అన్న మాటలు ఇవి. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల దోపిడీనీ, వారికి వత్తాసు పలుకుతున్న నాటి తెలంగాణ ప్రాంత అసమర్థ నాయకులను ఉద్దేశించి ఆయన పై విధంగా తన ఆవేశాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంతటి చరిత్రాత్మకమైన మాటలను ఈ మధ్య కొందరు ఇష్టానుసారంగా వాడేస్తున్నారు.

కేవలం వాడటమే కాదు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడ చాలా తీవ్రంగానే చేస్తున్నారు. ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో తమకు తోచిన రీతిలో రాతలు, కారుకూతలు లెక్కలేనన్నిసార్లు చక్కర్లు కొట్టిస్తున్నారు. మరిదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు? తెలంగాణ సమాజాన్ని ఏం చేయాలని ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాస్త లోతుగా వెతికి చూస్తే అసలు కుట్ర అర్థమవుతుంది.

తెలంగాణ ఉద్యమంలో అడ్రస్‌ లేని వాళ్లు, అరిగోసలు పడ్డ తెలంగాణను పట్టించుకోకుండా ఉమ్మడి పాలకుల మోచేతుల కింద నీళ్లు తాగిన వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏ సందర్భంలో ఏ మాటలు ఎట్లా వాడారనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే మోసగాళ్ల చేతిలో మరో సారి మనం మోసపోయే ప్రమాదం ఉంది. ఇది యావత్ తెలంగాణ సమాజ భవిష్యత్తుకే ప్రమాదంగా పరిణమిస్తున్నది. వాస్తవానికి ఈ మాటలు అన్ని రకాల మీడియాలో, సమావేశాల్లో వల్లె వేస్తున్నవారు ప్రజల దృష్టి మరల్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ర్పయోజనమే అవుతుంది. ఎందుకంటే వాస్తవాలు కళ్ల ముందున్నాయి. ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఏడేళ్ల టిఆర్ఎస్ పాలన… దాని ప్రాధాన్యతాంశాలు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆత్మగౌరవ నినాదానికి నిలువెత్తు పతాకలా ఇక్కడ పాలన సాగుతున్నది (పదవీకాంక్ష ఉన్నవారికి సహజంగానే ఈ మాట నచ్చదు). తెలంగాణ సగర్వంగా తలెత్తుకు నిలబడింది. విశాల భారతదేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నది. గత పాలనకు, స్వయంపాలనకు ఉన్న తేడాను గుర్తిస్తోంది ఇక్కడి ప్రజానీకం. తెలంగాణ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? పాలనలో ప్రాధాన్యాంశాలు ఎట్లా మారాయి? ఎవరి కేంద్రంగా పాలన సాగుతున్నది? వందేళ్ల తర్వాత తెలంగాణ ఎంత ఉజ్వలంగా ఉండబోతున్నది… దానికి తగిన పునాదులు ఎంత బలంగా పడుతున్నాయి అనే విషయాల్ని తెలంగాణ సమాజమే కాదు యావత్ దేశమూ గుర్తిస్తున్నది. ఇవన్నీ ఇట్లా ఉంటే తమకు దోపిడీ చేయడానికి అవకాశం లేని కారణంగానే, అడ్డదిడ్డంగా దండుకునే ఛాన్స్ పోయిందనే బాధతోనే కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నీలాపనిందలు వేయజూస్తున్నారు.

ఎండాకాలం వస్తే చాలు కిలోమీటర్లమేర బిందెలతో, నీటికోసం నిలబడిన జనాల ఫోటోలు ప్రతి రోజూ పత్రికల్లో ప్రధాన వార్తలయ్యేవి. వానాకాలం వస్తే గండి పడిన చెరువులు, నీట మునిగిన పొలాలను చూసి గుండెలే చెరువయ్యేవి. అంతేకాదు కరెంటు లేక ఎండిపోయిన బోర్లు… నెర్రెలిచ్చిన వరిమళ్లు… ఇట్లా తెలంగాణ జీవితం నిత్యం వేదనాభరితంగా ఉండేది. కరెంట్ ఆఫీసుల ముందు ధర్నాలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడులు… ఎన్ని ఘటనలో! అరవై ఏళ్ల పాటు తెలంగాణ కూడు, గూడు, నీడ కోసం అల్లాడిపోయింది. అయినా నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. నోరు తెరిచి అడిగే దమ్ము, ధైర్యం ఈ ప్రాంత నాయకులకు లేదు. వెరసి తెలంగాణ నలిగిపోయింది. వలస కాలనీగా మారింది. కళ్ల ముందు తెలంగాణ జనజీవితాలు అల్లాడిపోతున్నా, ఇక్కడి నీళ్లు తరలిపోతున్నా, ఇక్కడి సంపదపై కోస్తాంధ్ర పెత్తనాన్ని, ఇక్కడి నాయకుల బానిస మనస్తత్వాన్ని చూసి చలించి తట్టుకోలేక కాళోజీ ఆవేదనతో ఆ మాటలు అన్నారు. ఆ మాటలకున్న ప్రాధాన్యత చారిత్రకంగా ఇట్లా ఉంటే… దీన్ని కొందరు తమకు అనుకూలంగా మలచుకుని దాని ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ల గురించి నిర్దిష్టంగా చెప్పాలంటే తాము దోపిడీచేయాలి. లేదంటే తమకు అండదండలిచ్చే ఆంధ్రా పెద్దలైనా దోచుకోవాలి. అందుకు తెలంగాణ అడ్డాగా మారాలి. అయితే ఇవేవీ ఇప్పుడు జరగడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు నిజమైన మేలు జరగొద్దు అనేదే ఈ కుట్రదారుల, కుహనా తెలంగాణవాదుల దుర్బుద్ధి.

తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసిన వారు ఎవరూ కూడా ఇలాంటి ఉల్టా రాతలు రాయడం లేదు. పల్టా ప్రచారాలూ చేయడం లేదు. ఎటొచ్చీ అధికారదాహంతో ఉన్న వారు మాత్రమే ఇష్టారీతిన మీడియాలో వాగుడు, తోచినట్లు రాసుడే పనిగా పెట్టుకున్నారు. ప్రాంతానికి జరిగిన మేలు, అదీ ఏడేళ్ల కాలంలో జరిగిన ప్రయోజనం… ఇవేవీ ఎందుకు కన్పించడం లేదు? చూసినా చూడనట్లు నటిస్తున్నారు. ప్రజలను మరోసారి నట్టేట ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంతేతరులు కూడా పార్టీలు పెట్టి మరోసారి తెలంగాణను వలస కాలనీ చేయడానికి పెద్దఎత్తున కుట్రలు చేస్తున్నారు. వారికి బలం చేకూర్చేలా ప్రజలను మభ్యపెట్టేలా వీరి ప్రచారాలున్నాయి. సగర్వంగా దేశం ముందు నిలబడుతున్న తెలంగాణను, సంక్పలబలంతో ముందుకు సాగుతున్ననాయకత్వ తీరును చూసి ఓర్వలేక ఎన్నోఎత్తులు వేస్తున్నారు. ప్రాంతేతరులకు రాజకీయంగా తెలంగాణలో ఎంట్రీ ఇప్పిస్తే మరోసారి ఆ పార్టీల మోచేతి నీళ్లు తాగి బతకొచ్చనే ఉద్దేశ్యంతో తమ బానిస మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.

ఇలాంటి వారి చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా సమాధానం చెప్తుంది. వరసగా రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. ఈ బలంతో , ప్రజలిచ్చిన ధైర్యంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ మరింత సమర్థంగా తన సేవలను తెలంగాణకు అంకితం చేస్తున్నారు, ఇకముందూ చేస్తారు ఇందులో సందేహం లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ముప్పేటదాడి జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో వారి కుట్రలను ప్రజలు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. వారికి తగిన బుద్ధిచెప్పాలి. కాళోజీ కవితను పూర్తిగా గుర్తు చేసుకుందాం.

‘దోపిడీ చేసే ప్రాంతేతరులను

దూరం దాకా తన్ని తరుముతాం

ప్రాంతం వాడే దోపిడీ చేస్తే–

ప్రాంతంలోనే పాతర వేస్తం

దోస్తుంగ ఉండే వారితో మేమును దోస్తే చేస్తం–

-ప్రాణం ఇస్తం

ఎంతకు అంత అన్న ధోరణితో–

చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది- తెలంగాణమిది

తీరానికి దూరాన ఉన్నది- ముంచే యత్నం చేస్తే తీరం

మునుగును తానే -మునుగక తప్పదు’

కాళోజీ చెప్పినట్లు తప్పుడు ప్రచారాలు చేసి తెలంగాణను వంచించాలని, ముంచాలని చూస్తే ‘తీరం మునుగును తానే–మునుగక తప్పదు’. ఈ విషయాన్ని తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లు గుర్తిస్తే మంచిది.

-క్రాంతికిరణ్‌

(అందోల్‌ శాసనసభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.