Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమికి ఓటేస్తే ఆగమే

-బాబు ఉస్కో అంటే.. కాంగ్రెస్ డిస్కో
-మహాకూటమి కాదది.. మాయలకూటమి
-ముసలి నక్క, గుంట నక్క ఒక్కటయ్యాయి
-కేసీఆర్‌ను కాపాడుకుంటేనే మరింత అభివృద్ధి
-ఆలేరు, భువనగిరిని సస్యశ్యామలం చేస్తా
-లక్షన్నర ఎకరాలకు నీరుతెచ్చే బాధ్యత నాదే
-నీళ్లు కావాలో.. కన్నీళ్లు కావాలో తేల్చుకోండి
-ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్
-జనాన్ని ఉర్రూతలూగించిన ప్రసంగం

ఇన్నాళ్లు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చింది. ప్రజల చెవిలో బీజేపీ పువ్వులు పెట్టింది. పుల్లలు పెట్టే కోదండరాంకు అగ్గిపెట్టె దొరికింది. ఇక ఆయనకు అదేపని. తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు ఉస్కో అంటే కాంగ్రెసోళ్లు డిస్కో చేస్తున్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. మహాకూటమి పేరుతో మహామోసానికి పాల్పడుతున్నారు అంటూ విపక్షాలపై మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. మహాకూటమికి ఓటేస్తే ఆగమైతం. గోస పడుతం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో వీరందరికి కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో జరిగిన ఆలేరు ప్రజా ఆశీర్వాదసభలో మంత్రి కేటీఆర్ ఉర్రూతలూగించేలా ప్రసంగించారు. ఆలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మాయకూటమి అయిన మహాకూటమికి ఓట్లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయినట్టేనన్నారు. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ 30 లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అత్యంత జుగుప్సాకరంగా కాంగ్రెస్‌తో జతకట్టి తెలంగాణ నీళ్లు, నిధులను మరోసారి దోచుకుపోవడానికి బయలుదేరాడని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెసోళ్లు కోర్టు మెట్లు ఎక్కారని మండిపడ్డారు.

తెలంగాణ రిమోట్ తన చేతుల్లోకి తీసుకొని ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కుట్ర లు చేస్తున్నారని అన్నారు. ముసలి నక్క కాంగ్రెస్.. గుంట నక్క చంద్రబాబు ఒక్కటై తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నారని, వారి పొత్తుల ఎత్తులను ప్రజలు చిత్తుచేయాలని పిలుపునిచ్చారు. ముసలితనంతో మూలనపడి లేవలేకున్న కాంగ్రెస్‌కు ఆసరా ఇస్తున్న చంద్రబాబు కుట్రలను తెలంగాణ సమాజం ఎన్నికల్లో ఛేదిస్తుందన్నారు. ఆరడుగుల ఆజానుబాహుడు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోట్లకట్టల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు ముందు సాగిలపడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలుగు ప్రజలపై ఢిల్లీ పెత్తనం చెల్లదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని పేర్కొన్నారు. సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కోదండరాం.. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకోవడం దారుణమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆలేరు, భువనగిరిలకు సాగునీటిని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంటే.. ప్రాజెక్టులను ఆపడానికి కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని, చనిపోయిన రైతుల పేరుతో దొంగ వేలిముద్రలు వేసి అక్రమ కేసులు వేశారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కాంగ్రెస్, టీడీపీ అడుగడుగునా అడ్డుపడ్డాయని, పాలమూరును వలసల జిల్లాగా మార్చిన ఘనత ఈ రెండు పార్టీలదేనని గుర్తుచేశారు. తెలంగాణలో కోటి ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకుసాగుతున్నారని చెప్పారు. 50 ఏండ్ల కాంగ్రెస్, 17 ఏండ్ల టీడీపీ పాలనలో తెలంగాణ దగాపడిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలోనే రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కథకు చంద్రబాబు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కథకు చంద్రబాబు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడని, ఆయన చేతికి జట్టును ఇవ్వడమంటే కాంగ్రెస్ తన వేలితో తన కళ్లను పొడుచుకున్నట్టేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. చూపులు కలిసిన శుభవేళ.. అంటూ రాగం తీస్తున్న రాహుల్- చంద్రబాబు ఒకరికొకరు వీణలు, ఫిడేళ్లు వాయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మన తలరాతలు మార్చే ఈ ఎన్నికల్లో రైతు వ్యతిరేక శక్తులకు ఓటేస్తే సాధించుకున్న తెలంగాణ ఆగమైతదన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిచేసుకోవాలంటే మళ్లీ కేసీఆర్‌ను సీఎంను చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి సాగునీటి వనరులు లేని ఆలేరు, భువనగిరిలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బాధ్యత తనదేనన్నారు.

కాంగ్రెస్‌ది చారాణా కోడికి బారాణా మసాలా ప్రచారం
అధికారంలో ఉన్నప్పడు కేవలం రూ.200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్.. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టుగా ప్రచారం చేసుకున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 200 రూపాయలకు ఏమొస్తది? కిలో ఉప్పొస్తదా? కిలో పప్పొస్తదా? అని ఆయన ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో ఆసరా పెన్షన్‌ను రూ.2,016కు, వికలాంగుల పెన్షన్‌ను రూ.3,016కు పెంచుతామని, నిరుద్యోగులకు రూ.3,016 భృతి అందజేస్తామని చెప్పారు. రాష్ర్టాన్ని 67 ఎండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును నిర్మించిన పాపానపోలేదన్నారు. ఇన్నేండ్లు పాలించినవాళ్లు ఇప్పుడు ఏదోచేస్తామంటే ప్రజలు ఎలా నమ్మాలన్నారు. మహాకూటమి పేరుతో ఇదిచేస్తాం అదిచేస్తాం అంటూ వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

కాంగ్రెస్ హయాం.. కరంట్ కష్టాల మయం..
గత కాంగ్రెస్ పాలకుల హయాంలో కరంట్ కష్టాలు ఇంతా అంతా కాదని, 9 గంటల కరంట్ ఇస్తామని చెప్పిన దొంగ కాంగ్రెస్ ఏ విధంగా ఇచ్చిందో రైతన్నలకు తెలుసుని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే కరంట్ ఉండేదని, దీంతో నాలుగెకరాలు ఉంటే రెండెకరాలు ఎండిపోయేదని వివరించారు. ఈ కష్టాలను భరించలేక వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు గల్లా ఎగరేసి చెప్పుకొనే పరిస్థితిని తీసుకొచ్చామని, దేశంలో ఎక్కడాలేనివిధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరంట్ ఇవ్వడంతోపాటు రూ.17 వేలకోట్ల వ్యవసాయ రుణాలను మాఫీచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా అన్నదాతలకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేల పెట్టుబడి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఇంతటితో సంతృప్తి చెందని సీఎం కేసీఆర్.. ఈ పెట్టుబడిని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించి రైతులకు మరింత చేరువయ్యారని తెలిపారు.

తిరుమలకు దీటుగా యాదాద్రి అభివృద్ధి పనులు..
తిరుమలకు దీటుగా యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, యాదాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక దివ్యధామంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్ముందు యాదాద్రి అద్భుతమైన పర్యాటకక్షేత్రంగా మారునున్నదని చెప్పారు. రూ.1,900 కోట్లతో జరుగుతున్న యాదాద్రి అభివృద్ధి పనులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలనాటికి పూర్తవుతాయని, హైదరాబాద్ నుంచి రాయగిరికి రానున్న ఎంఎంటీఎస్ రైలు సౌకర్యంతో లక్షల మందికి మేలు కలుగుతుందని చెప్పారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట ఐటీకారిడార్‌ను ఏర్పాటుచేసి స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందకుపైగా స్థానాలు గెలుచుకోవడం, డిసెంబర్ 11న సీఎంగా కేసీఆర్ మళ్లీ ప్రమాణం చేయడం ఖాయమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

పంటసాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్: గుత్తా
రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పంట సాయం అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు మహాకూటమి పేరుతో మాయలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్దిని కొనసాగించేందుకు వీలుకల్పించాలని కోరారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యంకాని సంక్షేమ పథకాలను కేసీఆర్ దిగ్విజయంగా అమలుచేశారని చెప్పారు. యాదాద్రిభువనగిరి జిల్లా ప్రజల ఆరోగ్య వరప్రదాయిని ఎయిమ్స్‌ను సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నా రు. కాంగ్రెస్, టీడీపీల కూటమిని మాయలకూటమిగా అభివర్ణించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలేరు ప్రజలు తనను మరోసారి ఆశీర్వదిస్తే సాగుకోసం గోదావరి జలాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మోతె సోమిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.