Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

లడాయికి రెడీ

– నేడు వాయిదా తీర్మానం – చర్చకు అనుమతించకుంటే ప్రశ్నోత్తరాలు భగ్నం – కేసీఆర్‌తో ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి భేటీ – భవిష్యత్ ప్రణాళికపై సుదీర్ఘ మంతనాలు – ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సీఎం సంప్రదింపులు – త్వరలో ముఖ్యమంత్రులతో సదస్సుకు యోచన – ఇతర పార్టీల మద్దతు కూడగట్టే యత్నం – రంగంలోకి దిగిన పార్లమెంటరీ పార్టీ నేత కేకే – ప్రధాని, హోం మంత్రి వద్దకు ఎంపీలతో ఓ బృందం

KCR-001 హైదరాబాద్ అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంతో పార్లమెంటు వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది. కేంద్రంపై పోరుకు సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు.

ఇప్పటికే ప్రధానికి లేఖ ద్వారా తమ నిరసన వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ఈ దిశగా ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్లమెంటులో ఆందోళన జరపడంతో పాటు కేంద్ర వైఖరికి నిరసనగా దేశంలోని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టేందుకు కూడా సీఎం కేసీఆర్ కార్యాచరణలోకి దిగినట్లు తెలుస్తున్నది.

పార్లమెంటు వేదికగా పోరు.. పార్లమెంటు ఉభయసభల్లో పార్టీ ఎంపీలు కేంద్రం దుశ్చర్యలను ఎలుగెత్తి దేశానికి చాటాలని నిర్ణయించారు. ఇందుకు తగిన కార్యాచరణపై కేశవరావు, జితేందర్‌రెడ్డిలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై కేసీఆర్ వారికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంపీలంతా సోమవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోనే ఇతర పార్టీల ఎంపీలను కలిసి కేంద్ర హోంశాఖ రాసిన లేఖపై విస్తృతంగా ప్రచారం చేయాలని, మోడీ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థకు ఎలా విఘాతం కలిగిస్తున్నదో వారికి వివరించాలని చెప్పారు. ఇలాంటి చర్యలు ఉపేక్షిస్తే మున్ముందు ఇతర రాష్ర్టాల అధికారాలపై కూడా కేంద్రం పెత్తనం చెలాయించేందుకు అవకాశమిచ్చినట్టు అవుతుందనే విషయాన్ని వారికి విశదీకరించాలని చెప్పినట్లు సమాచారం.

ఎంపీల వ్యూహం.. పార్టీ అధినేత ఆదేశానుసారం పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై పార్టీ ఎంపీలు ఒక అవగాహనకువచ్చారు. హోంశాఖ లేఖపై చర్చకు ఉభయసభల్లో స్పీకర్, డిప్యూటీ చైర్మన్‌లకు వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు తెలిసింది. చర్చకు అనుమతించనట్లయితే ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలనే యోచనలో వారు ఉన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలను కూడా కలుపుకొని కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. లేఖపై చర్చకు పట్టుబట్టడం… అనుమతించకపోతే సభను అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడం రేపటి కార్యక్రమంగా నిర్ణయించినట్లు సమాచారం.

ఒకవేళ చర్చకు అనుమతి లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ సర్కారు నిర్వాకాలు దేశమంతా ప్రతిధ్వనించేలా ప్రసంగాలు చేయాలని నిర్ణయించారు. ఎవరెవరు ఏం మాట్లాడాలనే దానిపైనా వ్యూహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సభల్లోనూ ఇదేరీతిన ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని ఎంపీలు నిర్ణయించారు. దీనికి తోడు ప్రధానంగా ఇతర పార్టీల, సభ్యుల మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఈ బాధ్యతను రాజకీయంగా అపార అనుభవం, పార్లమెంటేరియన్లలో విస్తృత పరిచయాలు ఉన్న రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు ఈ బాధ్యతను భుజాన వేసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఎంపీలందరూ సోమవారం ఉదయం పది గంటలకు ఒకసారి అందరు ఎంపీలు సమావేశమయ్యేందుకు ప్రణాళిక రూపొందించారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.

అన్ని పార్టీల మద్దతు కూడగడతాం: జితేందర్‌రెడ్డి హోం శాఖ లేఖకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ఎంపీల మద్దతు కూడగడతామని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో చర్చల అనంతరం జితేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర లేఖపై పార్లమెంటులో సోమవారం వాయిదా తీర్మానం ఇస్తామని, స్పీకర్ అనుమతించకపోయినా తాము పట్టుబట్టి, చర్చించి తీరతామన్నారు. ఇందుకోసం ఇతర ఎంపీల మద్దతును కూడా కూడగడతామన్నారు.

రాష్ర్టాల హక్కులు హరించడం కేవలం తెలంగాణకే పరిమితం కాదని మున్ముందు అన్ని రాష్ర్టాల్లో కేంద్ర పెత్తనం చెలాయించేందుకు ఇది ఆరంభంగా మారుతుందని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రాష్ర్టాల ఎంపీలకు వివరించి అప్రమత్తం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఒడిశా (బీజూ జనతాదళ్), తమిళనాడు(ఏఐడీఎంకే), పశ్చిమ బెంగాల్(తృణమూల్ కాంగ్రెస్) ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జయలలిత, మమతాబెనర్జీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. ఎంపీలందరినీ కూడగట్టి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులను కూడాకలిసి న్యాయం కోరుతామన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నపుడు ఆయనకు ఇలాంటి పరిణామాలు ఎదురైనపుడు కేంద్రం అధికారాలను ఆయన ప్రశ్నించిన వైనాన్ని ఆయనకు గుర్తు చేస్తామని చెప్పారు. మున్ముందు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఈ అంశంపై సదస్సు నిర్వహించే యోచన కూడా ఉందని ఆయన చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.