Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతం

-త్వరలో 10 వేల టీచర్ల భర్తీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం -ఈ ఏడాది 15 వేల కోట్లతో 2 లక్షల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు -లక్షా 50 వేల కోట్లతో ప్రాజెక్టులు.. కోటి ఎకరాలకు నీరు -నీటి సమస్య రాకూడదనే ప్రాజెక్టుల రీడిజైనింగ్ -దళితులు, మైనారిటీలకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తాం -అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రుణభారం స్వల్పం -ప్రభుత్వ చొరవను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు -శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR sppech in Assembly

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు కచ్చితంగా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే సింగరేణి ఉద్యోగాలు కలుపుకొని 24,500 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇవిగాక 10 వేల ఉపాధ్యాయ పోస్టులు, మరో వెయ్యి ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే దళితులు, మైనార్టీలకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. జస్టిస్ చెల్లప్ప, సుధీర్ కమిటీలనుంచి డాటా రాగానే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేశామని, రాబోయే ఐదేండ్ల కాలంలో లక్షా 50 వేల కోట్ల తో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో 2016-17 ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. కొందరు సభ్యులు ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్‌తో రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నదని 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2లక్షల కోట్లు దాటుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నందువల్లనే అనేక రుణసంస్థలు భారీగా రుణాలు అందించడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రుణభారం చాలా స్వల్పమని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలకు అనేక అవార్డులు లభించాయని, ప్రధాని మోదీ సైతం మన ప్రభుత్వ చొరవను ప్రశంసించారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చేపట్టిన అన్ని పథకాలను అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా మిషన్ భగీరథను అనుకున్న సమయానికి పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో బోర్లు పెరిగిపోయి భూగర్భ జలాలు రీచార్జ్ కానందువల్లనే వర్షాలు కురిసినా, లేకున్నా ప్రతి ఎండాకాలం నీటికి కటకట ఏర్పడుతున్నదని సీఎం చెప్పారు. మిషన్‌భగీరథతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని సీఎం చెప్పారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీపీఎల్ కార్డులున్న బీసీలకు కూడా వర్తింపచేస్తామని, సన్నబియ్యం పథకాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి కాలేజీలకు కూడా అమలు చేస్తామని తెలిపారు.ఈ సంవత్సరం 15వేల కోట్లతో రెండు లక్షల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల పీజు రీయింబర్స్‌మెంట్ బకాయల పాపం తమకు వారసత్వంగా వచ్చిందని అంటూ అయినా బకాయిలన్నీ ఏప్రిల్‌లోగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖను ఇప్పటికే ఆదేశించానని సీఎం తెలిపారు. ఆ తర్వాత ఏ నెల బకాయిలు ఆ నెలలో చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు.

వైద్యశాలల్లో బెడ్ల నిర్వహణ బాధ్యత సూపరింటెండెంట్లకు ఇస్తున్నామని , జిల్లా వైద్యశాలల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ మాదిరిగా సీటీస్కాన్, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామని, జిల్లాకు నాలుగు చొప్పున డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో డిప్లమాటిక్‌గా వెళ్లాలే తప్ప బస్తీమే సవాల్ అంటే దశాబ్దాలు దాటినా కట్టుకోలేమని స్పష్టం చేశారు. కరువు విషయంలో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు పోవాల్సి ఉందని చెప్పారు. అసెంబ్లీ పార్లమెంటు సీట్ల పెంపు విషయం ఫైనల్ కాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విపక్షాల నుంచి మంచి సలహాలు, సూచనలు వస్తాయని ఆశించానని, అయితే అలాంటి పరిస్థితి సభలో కనిపించ లేదని ముఖ్యమంత్రి ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నా ఎందుకో ప్రధాన ప్రతిపక్షానికి గిట్టడం లేదని, ప్రతి విషయంలో విమర్శలు, ఆరోపణలు తప్ప మంచి ఉద్దేశం, మంచి కోణం నుంచి స్వాగతించిన సందర్భాలు కనిపించడం లేదని సీఎం విచారం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ప్రబుత్వం పై వాస్తవాలకు దూరంగా ఉండే విధంగా ఆరోపణలు చేయడమే ప్రధాన ప్రతిపక్షం పనిగా పెట్టుకున్నదని సీఎం విమర్శించారు. దాదాపు గంటన్నర సేపు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమం, భవిష్యత్తు కార్యచరణను విపక్షాలకు సీఎం వివరించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఇంటికో ఉద్యోగం భ్రమే.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం హామీ ఇవ్వలేదు. ఏ మహాత్ముడు పుట్టించాడో కాని అది భ్రమే. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాదు. రాష్ట్ర జనాభా మూడు కోట్లకు పైగా ఉంది. ఈ లెక్కన ఇంటికో ఉద్యోగం అంటే ఎన్ని ఉద్యోగాలివ్వాలి. సాధ్యమా? సున్నం రాజయ్య(సీపీఎం నేత) గారు చెప్పారు.. రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇంకా అనేక లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగం కావాలనే అపోహలను యువకులు పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు అవసరమైన చోట తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తాం. అన్నీ చేసినా కూడా లక్ష నుంచి లక్షన్నర దాకా ఉంటాయి. చెప్పినమాట చెప్పినట్టు లక్ష ఉద్యోగాలను మాత్రం ఈ టెర్మ్ లోనే భర్తీ చేసి తీరుతాం.

నూరుశాతం బడ్జెట్ ఖర్చు ఎక్కడా ఉండదు.. రాష్ట్ర బడ్జెట్ మీద విపక్షాల నుంచి చాలా సూచనలు, సలహాలు వస్తాయని ఆశించా. చెప్పిన అంశాలే మళ్లీ మళ్లీ ప్రస్తావించారు తప్ప కొత్త సూచనలు రాలేదు జానారెడ్డిగారు మాట్లాడిందే ఉత్తమ్ మాట్లాడారు. బడ్జెట్‌లో డబ్బు ఖర్చు కాలేదంటున్నారు. కానీ అది ఎప్పుడూ ఎక్కడా కూడా ఖర్చు కాదు. గడచిన పదేండ్ల కాంగ్రెస్ పాలనలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల సరాసరి చూస్తే 79.52 శాతమే ఉంది. గత నాలుగేండ్ల కాంగ్రెస్ పాలనలో ఖర్చు పెట్టింది 83.23 శాతమే. 2015-16లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక లేక పోయినా 80.33 శాతం ఖర్చు పెట్టింది.

ఉత్తమ్ వ్యాఖ్యలు బాధాకరం.. ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఉత్తమ్ చెప్పారు. అనేక చోట్ల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారో తీర్పు వచ్చింది. ఉత్తమ్‌కుమార్ నాకు మంచి మిత్రులు. బాధాకరమైన విషయం ఏమిటంటే సీఎం చైనాకు లగ్జరి జెట్ తీసుకుని రూ. 10 కోట్లు ఖర్చు చేశానన్నారు. నేను ఒక్కడినే విహారానికి వెళ్ళినట్టు చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానం మేరకు నేను చైనాకు వెళ్ళాను. నాతో కలుపుకుని మొత్తం 17 మందిమి, తొమ్మిది రోజులు ఆరు నగరాల్లో పర్యటించి 13 బిజినెస్ మీటింగ్‌లలో పాల్గొన్నాం. అనేక కంపెనీలతో మాట్లాడాం. ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఈ పర్యటనకు విమానం ఖర్చు 2.03 కోట్లు, లాడ్జీలు, హోటళ్ళు, తిండి, కార్ల కిరాయిలు రూ.72 లక్షలు, మొత్తం కలుపుకుంటే రూ.2.75 కోట్లు అయింది. పది కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఉత్తమ్ చెప్పడం బాధాకరం.

బస్తీమే సవాల్ అంటే ప్రాజెక్టులు కావు.. పొరుగు రాష్ట్రాలతో బస్తీమే సవాల్ అంటే కుదరదు. మనం డిప్లమాటిక్‌గా వ్యవహరించాలి. మహారాష్ట్రలో ఒక ప్రభుత్వముంది, మనమెట్ల ఆలోచిస్తమో.. వాళ్ల ప్రజల కోసం వాళ్లూ ఆలోచిస్తరు. కయ్యమే పెట్టుకుంటానంటే నడవదు. ఈరోజు ఏం చెపుతున్నానో.. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడికి కూడా ఇదే విషయం అక్కడుండి(ప్రతిపక్షంలో) చెప్పాను. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టుకు 1974లో వెంగళరావు గారు, ఎస్బీ చవాన్ ఒప్పందం చేశారు. ప్రాజెక్టు రాలేదు. ఎందుకు రాలేదు? నలభై సంవత్సరాలైనా తట్టెడు మన్ను కూడా తీసే పరిస్థితుల్లేవు. మేం ఏమయ్యా కడతారా లేదా? అని అడిగినం. ఏమిటీ కథ అని చూస్తే.. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కడితే చాలా పెద్దపెద్ద జనాభా ఉన్న ముప్పయ్ ఆరు గ్రామాలు మహారాష్ట్రలో మునిగిపోతాయి. ఆ ప్రాజెక్టు వద్దని అక్కడి ప్రాంత ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు, అక్కడి అసెంబ్లీలో ధర్నాలు చేశారు. పోడియం ముందు పోయినరు. దానితో మేం ప్రాజెక్టు కట్టలేమని వారు తట్టపారా కింద పడేశారు. మరి, ఏంటి ఆల్టర్‌నేటివ్ అని అడిగితే ప్రాజెక్టు వద్దు..బ్యారేజీలు కట్టుకుందామన్నారు. లోయర్ పెన్‌గంగ కింద బేల, తాంసి, జైనత్ అనే మూడు మండలాలకు 50 నుంచి 60 వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా మనకు బ్యారేజీలు కట్టుకోమని క్లియరెన్స్ ఇచ్చారు. చెనాట- కోరాట బ్యారేజీ కడుతున్నాం. అల్టీమేట్‌గా నీళ్లు తెచ్చుకోవాలి తప్ప.. మరింత కాలయాపన జరిగి ప్రజలకు నిరాశ అయితే ఎవరికి లాభం?

మిషన్ భగీరథే పరిష్కారం.. ఇప్పుడు డ్రాట్ గురించి మాట్లాడుతున్నాం. కరువు ఉన్నా లేకున్నా… ఎవ్రీ సమ్మర్ ఈజ్ ఏ డ్రాట్ ఫర్ తెలంగాణ. ఎందుకు? దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్నీ బోర్‌వెల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. భూగర్భ జలాలను సక్ చేస్తున్నారు.. ఇంజెక్షన్లు సక్ చేసినట్లు చేస్తుంటే ఉంటయా నీళ్లు? డెలిబరేట్ నెగ్లిజెన్స్ ఇది.

మేజర్ ప్రాజెక్టులు రాలేదు. రైతులు 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేసి మోటార్లు పెట్టి నీళ్లు లాగుతున్నరు. భూమి రీచార్జ్ కాకపోతే నీళ్లు రావు. వర్షాలు పడ్డా పడకపోయినా ప్రతి ఎండాకాలంలో ప్రజలు గోస పడడానికి కారణం ఇది. ఆ సమస్యకు పరిష్కారం మిషన్ భగీరథ. సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుభవించిన బాధలు తెలుసు కాబట్టి.. అక్కడ చేసిన స్కీమ్ రిప్లికేషనే.. మిషన్ భగీరథ. ఇది హైలీ పాజిటివ్ స్కీమ్. 2016 డిసెంబరుకే 6200 గ్రామాలకు నీరు వస్తుంది. ఈ ఏప్రిల్, మే నెలల్లోనే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచినీరు వస్తుంది.

మన నీళ్లు మనం వాడుకుందాం.. కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్‌తో రకరకాలుగా మాట్లాడుతున్నరు. ఎత్తు ఇంత.. అంత అంటూ అంటున్నరు. 290 టీఎంసీల పైచిలుకు కృష్ణాలో అలకేషన్ ఉంది. గోదావరిలో 912 టీఎంసీల అలకేషన్ ఉంది. తెలంగాణకు ఉన్న అవైలబుల్ ల్యాండ్ ఎంత? కల్టివబుల్ ల్యాండ్ ఎంత? తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి.. వాటిని రివైవ్ చేసుకుందాం. అనుమానాలు, శషబిషలు లేవు. ఫైట్ చేయాల్సిన చోట చేద్దాం. బ్రిజేష్ ట్రైబ్యునల్ మీద మన వాదనలున్నాయి. గోదావరి మీద మనం అడుగుతీసి అడుగు వేస్తే.. పొరుగు రాష్ట్రం వాళ్లు ఇమ్మిడియేట్‌గా అడ్డు చెబుతున్నరు. వారు పట్టిసీమ కట్టినారు. డైవర్ట్ చేసినరు. నీళ్లు తీసుకున్నరు. అదే స్పీడుతో మనం కూడా వెళ్లాలి.

ఊరికే ప్రకటనలతో లాభం లేదు.. కరువు మండలాలను ఎక్కువగా ప్రకటించమని ఉత్తమ్ కుమార్ అంటున్నారు. కానీ, ఎక్కువగా ప్రకటించుకోవడం వల్ల లాభం లేదు. కేంద్రం గైడ్‌లైన్స్ వేరుగా ఉంటాయి. సెంట్రల్ కమిటీ వస్తారు. తిరిగి చూస్తారు. ఖరీఫ్‌కి ముందే ఇన్‌పుట్ సబ్సిడీని అందించడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది. ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేశాం. అవసరమైతే మరో మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తాం.

అవి ఏపీ వారసత్వంగా వచ్చినవే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చినవే. ఏప్రిల్ నెల నుంచి కచ్చితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను జీరో డౌన్ చేయాలని అధికారులను ఆదేశించాం. ఇక నెలనెలా క్లియర్ అయ్యేలా చూడాలని సూచించాం. అక్బరుద్దీన్ ఒవైసీకి థ్యాంక్స్. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆస్తి ఉంది. దురదృష్టవశాత్తు కొంతపోయింది. ఉన్నవాటినైనా నిలబెట్టుకోవాలి. హుస్సేన్‌షావలి దర్గాకు చెందిన ఎవరికీ ఇవ్వని, మిగిలిన భూములన్ని రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు సరెండర్ చేస్తాం. ఇప్పటికే కేటాయించిన భూములకు డబ్బులు వసూలు చేసి వక్ఫ్‌బోర్డులో జమచేస్తాం.

అంబేద్కర్ 125 జయంతిని ఘనంగా జరుపుతాం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ప్రభుత్వం చాలా ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఎంత ఖర్చయినా సరే, ఊరూవాడల్లో ఘనంగా నిర్వహిస్తాం. ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ భవనం కూలిపోయే దశకు చేరుకున్నది. దీన్ని కూల్చేసి ఇక్కడ మల్టీస్టోరీ బిల్డింగ్ నిర్మాణం చేపడుతాం.

మైనార్టీలకు రిజర్వేషన్.. మైనార్టీలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినం. ఉద్యమ సందర్భంలో చెప్పినం.. వంద శాతం స్టిక్ అయ్యి ఉన్నం. రెండింటికీ కమిటీలు వేశాం. అసదుద్దీన్ ఒవైసీ గారు ఓ రిక్వెస్ట్ చేశారు. ఇమ్‌పెక్కబుల్ డాటా పక్కాగా ఉండాలి.. ఎవరూ కొశ్చన్ చేసేలా ఉండొద్దు. రెండు నెలలు సమయం ఎక్కువ తీసుకోండి.. కానీ డేటా పక్కాగా సమకూర్చండి. గతంలో ఆమేర్ అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మహారాష్ట్రలో చేసిన డాటాను మహారాష్ట్ర హై కోర్టు కూడా అంగీకరించింది. ఆ విధంగ చేద్దాం. ఎస్టీలపై జస్ట్టిస్ చెల్లప్ప, మైనార్టీలపై సుధీర్ కమిటీ పని ఒక రెండు నెలల్లో పూర్తవుతుంది. ఎవ్వరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆ డేటా రాగానే ఆ సమయానికి శాసన సభ సమావేశాలు లేకపోతే ప్రత్యేక సమావేశం పెట్టి ఏకగీవ్రంగా తీర్మానం ఆమోదించుకుందాం. మనమంతా ప్రతినిధి బృందంగా వెళ్లి భారత ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ని కలుద్దాం. తమిళనాడులో ఎట్లయితే తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టి గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో మనకు కూడా ఇవ్వాలి. కాబట్టి, డేటా రాగానే సభ పెట్టుకుని ఏకగ్రీవంగా తీర్మానించుకుందాం.

చదివి మాట్లాడితే బాగుంటుంది రవీంద్రకుమార్‌కు సీఎం చురక

ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మంగళవారం సాయంత్రం చర్చలో పాల్గొన్న సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ టీఎస్-ఐపాస్‌లో దళితులకు ప్రాధాన్యత కల్పించలేదంటూ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగ చేసుకుంటూ రవీంద్రకుమార్ గారు… చదివి మాట్లాడితే బాగుంటుంది. టీఎస్-ఐపాస్‌లో టీఎస్-ప్రైడ్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఇది దళితులు, గిరిజనుల కోసమే. టీఎస్-ప్రైడ్‌లో 65 మంది శిక్షణ పొందుతుండగా వీరిలో 45 మంది దళితులు, 20 మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. ఇటీవలే వీరు నాతో గ్రూప్‌ఫొటో కూడా దిగారు. ఇది గమనించకుండా మాట్లాడితే ఎలా? అని చురక వేశారు. ఇందుకు రవీంద్రకుమార్ స్పందిస్తూ ఇంకో విషయం మాట్లాడబోయి పొరపాటున అలా మాట్లాడానని తన తప్పును సరిదిద్దుకున్నారు.

జిల్లాకు నాలుగు డయాలసిస్ సెంటర్లు మెడికల్ డిపార్ట్‌మెంట్‌కు మంచి యువకుడైన, హుషారైన వ్యక్తి డాక్టర్ లక్ష్మా రెడ్డి మంత్రిగా ఉన్నరు. మన దవాఖానల గురించి చెప్పాలంటే గవర్నర్ గాంధీకి పోయి చాలా ఇబ్బంది పడ్డరు. గతంలో మన బెడ్లను చూస్తే ఆ బెడ్ మీద పడుకుంటే మళ్లా కొత్త బీమార్ వస్తదా అన్నట్లుండేది. దీనిపై డాక్టర్లను పిలిచి మీటింగు పెడితే చీపురు కట్ట విరిగినా కొనేటందుకు మాకు అధికారం లేదు అని ఉస్మానియా, గాంధీ సూపరింటెండెంట్లన్నరు. పరిస్థితి మారడానికి ఏం చేయాలని అడిగితే పర్ బెడ్, పర్ మంత్ రూ.6వేలు చెల్లిస్తే మూడు నాలుగు నెలల్లో పరిస్థితి మారుస్తామన్నరు. మనదగ్గరున్న అన్ని గవర్నమెంటు దవాఖానల్లో 17,639 బెడ్లున్నాయి. వాటికి రూ. 174 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించినం. టోటల్ పవర్స్ సూపరింటెండెంట్లకిచ్చేసి ఏదవసరమున్నా వాళ్లే ఖర్చు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నం. రెండు మూడునెలల తర్వాత ఎమ్మెల్యేలంతా మీమీ నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు పెట్టుకొని అన్ని విషయాలను చెప్పండి. పాత బెడ్లు స్క్రాబ్‌కింద అమ్ముతరా.. ఏదో ఒకటి చేసి మొత్తం కొత్త బెడ్లు కొనమని డబ్బులు కూడా ఇచ్చినం. పేద ప్రజలకు టెస్టులు, డయాలసిస్ చేయాలంటే జిల్లాల్లో అవకాశం లేదు. హైదరాబాద్ రావాల్సివస్తుంది. అట్లాకాకుండా జిల్లాకు నాలుగు చొప్పున డయాలసిస్ సెంటర్లను పెట్టబోతున్నం. దాంట్లో కార్పొరేట్ దవాఖానల్లాగ అత్యాధునిక సీటీస్కాన్, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ అన్నిమిషన్లను ఏర్పాటు చేస్తం. రాష్ట్రవ్యాప్తంగా నలభై సెంటర్లలో త్వరలోనే మిషన్లు కొంటం. టెస్టులు, డయాలసిస్ అన్నీ అక్కడే జరిగేటట్లు చూస్తం. మెడిసిన్‌ల కోసం ప్రైవేటు మెడికల్‌షాపులకు వెళ్లకుండా అన్నీ అక్కడ్నే దొరికేటట్లు చర్యలు తీసుకుంటం. ప్రైవేటు మెడికల్ షాప్‌లకు మందులు రాస్తే సస్పెండ్ చేస్తం. మెడిసిన్ బడ్జెట్‌ను రెండింతలు చేసినం. వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చే పేదవాళ్లలో దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దయనీయ పరిస్థితులున్నయి. అట్లాంటి వాళ్లకు గవర్నమెంటు అంబులెన్స్‌లోనే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నం.

జాతీయ రహదారుల విస్తీర్ణం పెరిగింది దళిత, గిరిజనులకు డ్రిప్ ఇరిగేషన్‌కు వందశాతం సబ్సిడీ ఇస్తున్నం. కల్యాణలక్ష్మిలో బీపీఎల్ కార్డుకింద ఉన్న బీసీలందరికి ఇవ్వాలని నిర్ణయించినం. సన్నబియ్యం కాలేజీలు, యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా పెట్టాలని నిర్ణయించినం. డెబ్బై మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నం. ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో జాతీయ రహదారులను గమనిస్తే.. తెలంగాణ పరిధిలో 2573 కి.మీ జాతీయ రహదారులు ఉంటే, ఏపీలో ఆరువేల కి.మీ మేర ఉండే. కేంద్ర రవాణా మంత్రితో మాట్లాడి 18,500 కి.మీ మేర జాతీయరహదారులను నిర్మించేలా ఒప్పించినం. గతంలో దేశంలో జాతీయ రహదారుల్లో తెలంగాణలో 2.4 శాతం ఉంటే అదిప్పుడు 3.7 శాతానికి చేరింది.

అనేక అవార్డులు 22 నెలల ప్రభుత్వానికి అనేక అవార్డులొచ్చినయి. ఈ మధ్య సీఎస్‌లతో దేశవ్యాప్తంగా జరిగిన మీటింగులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా మన ఇండస్ట్రియల్ పాలసీ భేష్ అని మెచ్చుకున్నరు. హడ్కో, ఇండియా టుడే, సీఎన్‌ఎన్ ఐబీఎన్ వాళ్లు చాలా అవార్డులు ఇచ్చిండ్రు. మేం సొంత డబ్బా కొట్టుకోదల్చుకోలేదు. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ క్రైటేరియా అనుకుంటే మరి ప్రతిపక్షాలకు ఎందుకు కనబడటం లేదు. మా ప్రభుత్వం వచ్చినంక హైదరాబాద్‌లోనూ ప్రజా ఆస్తులను కాపాడినం. బొటానికల్ గార్డెన్‌లపై కూడా కోర్టులో కొట్లాడి ప్రజలకు తెచ్చిచ్చినం. నిజాం కాలంనాటి ఈఎన్‌టీ దవాఖానలో రెండెకరాల స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగాం.

మీకు మాకు తేడా ఏంటంటే? ఇసుక మైనింగ్ గురించి ప్రభుత్వాదాయం చెబితే 2009-10లో 8 కోట్లు, 2010-11లో 27 కోట్లకు పెరిగింది. 2011-12లో ఏమైందో పదికోట్లకు పడిపోయింది. 2012-13కు వచ్చేసరికే 1.6 కోట్లకు వచ్చింది. 2013-14లో ఏం రోగమొచ్చిందో లక్షలల్లకు పడిపోయింది. 2014-15లో 13 కోట్లయ్యింది. 2015-16లో ఇసుక మైనింగ్ మీద ప్రభుత్వానికి రూ. 340 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదీ ఇండికేషన్ ఆఫ్ టీఆర్‌ఎస్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్. కొత్త రాష్ట్రం, కొత్త సందర్భం.. భేదాభిప్రాయాలున్నా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చేసేందుకు ఇపుడు చేసేదంతా పునాది. మీ (ప్రతిపక్షాలు) సూచనలు ఉత్తమంగా ఉంటే వందశాతం స్వీకరిస్తం. కానీ నిర్ణయం కాకముందే ఆరోపణలు సరికాదు. అందరి ఆమోదంతోనే ముందుకు పోతాం.

స్థానిక అవసరాల కోసమే ఎస్‌డీఎఫ్ ఎస్‌డీఎఫ్ అనేది ప్రత్యేకించి ముఖ్యమంత్రి నిధి అని కొందరు సభ్యులంటున్నరు. కానీ చిన్న చిన్న అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఎస్‌డీఎఫ్. దీంట్లో జిల్లా కలెక్టరుకు రూ. 10 కోట్లు పెడతం. ఆ జిల్లా మంత్రికి రూ. 25 కోట్లు, ఎమ్మెల్యే పరిధిలో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తున్నం. చిన్న అవసరాలకు కూడా అధికారి ఫైలు జనరేట్ చేసి హెచ్‌వోడీకి పంపి అది హైదరాబాద్‌కు వచ్చి అనుమతులు వచ్చేవరకు వేచిచూడకుండా.. ఉదాహరణకు ఆదిలాబాద్‌లో అత్యధికంగా చలి ఉంటుంది. ఆ జిల్లా మంత్రి, కలెక్టర్ దగ్గర డబ్బులు ఉంటే పిల్లలకు బ్లాంకెట్లు కొనివ్వచ్చు. ఇలాంటి స్థానిక అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాడుకునే వీలుంటది. చేనేత కార్మికుల సమస్యలు నాకు తెలుసు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ తరపున యాభై లక్షలు ఫండ్ కింద పెట్టి సాయం చేసిన. అట్లాంటి అవసరాలకు ఎస్‌డీఎఫ్ కింద వాడుకుంటం. అర్చకుల జీతాలను కూడా కచ్చితంగా పెంచడంపై పాజిటివ్‌గా ఆలోచిస్తున్నం. బీసీ సబ్‌ప్లాన్‌పై బీసీ కమిటీ అధ్యయనం చేస్తుంది. అది బీసీలకు ఉపయోగపడుతుందంటే వచ్చే ఏడాది పెడతాం అని సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం సీఎం ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యుల స్పందన సందర్భంగా వారు సంధించిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సీఎం ప్రసంగంపై అక్బర్‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం తీసుకుంటున్న చర్యలపై ధన్యవాదాలు తెలియజేశారు.

షావలీదర్గా అంశాలపై వేసిన కమిటీకి కాలపరిమితి నిర్ణయించాలని, ఉర్దూ భాషలో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని, పాతబస్తీలో కళాశాలల పునరుద్ధరణకు రూ. 15 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ.. షావలీదర్గా అంశాలపై కమిటీ కాలపరిమితిని మైనార్టీ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. ఉర్దూలో పరీక్షలు రాసే అవకాశం ఉంటే పరిశీలిస్తామని, కమిటీతో చర్చించాలని సూచించారు. పాతబస్తీలో కళాశాలల అభివృద్ధికి పదిహేను కోట్లకు మరో ఐదు కోట్లు కలిపి ఇస్తామన్నారు. అదే విధంగా తెలంగాణ ఏర్పడితే తిరుపతితో పాటు అజ్మీర్ దర్గాలో మొక్కులు చెల్లించే అంశాన్ని గుర్తుచేశారు. స్పెషల్ ట్రైన్‌లో పదిజిల్లాల నుంచి కలిసి హిందూ, ముస్లిం తేడా లేకుండా వచ్చేవారందర్నీ కలుపుకొనిపోయి మొక్కులు చెల్తిస్తానని, దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి చెప్పినానన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము అడిగిన పది అంశాలకు సీఎం సానుకూలంగా స్పందించడంపై ధన్యవాదాలు తెలిపారు. సిటీ పరిధిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల అంశంపైనా త్వరలో వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. రుణమాఫీ ఒకేసారి ఇవ్వాలంటూ టీడీపీ పక్షనేత రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనపై స్పందిస్తూ రైతులను అన్ని విధాల ఆదుకుంటామని, రుణమాఫీపై ఇప్పటికే సవివరంగా చెప్పామని తెలిపారు. సభ చివరలో ద్రవ్యవినిమయ బిల్లుల ఆమోదం కోసం ఆర్థిక మంత్రి ఈటల ప్రతిపాదించగా.. సభ్యుల అంగీకారంతో స్పీకర్ ఆమోద ముద్రవేశారు.

కోటి ఎకరాలకు నీరు అందితేనే పచ్చని తెలంగాణ కోటి ఎకరాలకు నీరు తెచ్చుకుంటేనే మనం కలలు కన్న పచ్చని తెలంగాణ వస్తుంది. అది జరిగి తీరుతుంది. అందుకే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నాం. రాబోయే ఐదేండ్ల కాలంలో లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల కోట్ల నిధులు ఖర్చు పెడితేనే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఈ సీజన్‌కే నీటిని అందించే విధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కొద్దిపాటి పెట్టుబడులు పెడితే ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేస్తాం. దేశంలో 41 శాతం ఫార్మారంగం హైదరాబాద్‌లోనే ఉంది. శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ పేదలకు తక్కువ ధరకు పెన్సిలిన్ వంటి మందులు అందజేస్తుంది. శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేస్తాం అని సంప్రదించారు. ఇందుకు మెదక్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి స్థలాన్ని చూపించాం.

ఆ మూడు రంగాలకే భారీ పెట్టుబడులు అవసరం రాష్ట్రంలో ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ రంగాలకే ప్రధానంగా పెట్టుబడులు అవసరం. స్టేట్ ఓన్ రెవెన్యూ(ఎస్‌ఒఆర్)లో 15 శాతం వృద్ధి కనిపిస్తున్నది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల నుంచి ఆదాయం వస్తున్నది. 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటుతుంది. ఇంతకుముందు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి రెవెన్యూ రాబడి కుదించుకు పోయింది. లేకుంటే అభివృద్ధి మరింత బాగా జరిగేది. రెండు లక్షల కోట్లు మిషన్ భగిరథ, సాగునీటికి పెడితే రాబోయే రోజుల్లో ఇంతభారీగా నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్పులతో రాష్ట్ర భవిష్యత్‌కు ప్రమాదం లేదు. పెట్టుబడులు రావాలంటే అప్పులు చేయక తప్పదు. ఊపర్ షేర్వాని- అందర్ పరేషానీ లా పరిస్థితి ఉంది.

అప్పులు 16.1శాతమే.. గుమ్మినిండి వడ్లుండాలె.. గూటమోలె పిల్లలుండాలె.. అంటె ఎట్లా..? పథకాలు ఊర్తికావాలంటే అప్పులు తేవాలె. అయినా దేశం చేసిన అప్పులు 47 శాతమైతే తెలంగాణ రాష్ట్రం అప్పు 16.1 శాతమే. పంజాబ్ రాష్ట్రం 30.7, గోవా 30.5, యూపీ 28.2, కేరళ 26.5, గుజరాత్ 22.5, మధ్యప్రదేశ్ 22.5 అప్పుల శాతం ఉంటే రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు 17 శాతం అప్పుల్లో ఉన్నాయి. అప్పుల విషయంలో రాజ్యాంగానికి లోబడి ఉన్నాం. ఏ మాత్రం భయపడే పరిస్థితి లేదు. తలసరి ఆదాయం వైపు చూసినా పంజాబ్‌లో 36 శాతం, కేరళ 30 శాతం, గుజరాత్ 28 శాతం, మధ్యప్రదేశ్ 28 శాతం అప్పులుంటే రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, రాష్ర్టాలు 20 నుంచి 30 శాతం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలో 19 శాతం ఉంది. అప్పులు తీసుకుని ఆగమై పోతామని గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే పరిమితులకు లోబడి ఉంటాయి. రుణ సంస్థలు ఊరికే ఇవ్వవు. ఏదో చెప్తే మన పప్పులు ఉడకవ్. 2012-13లో 2.4 శాతం, 2013-14లో 16.4 శాతం, 2014-15లో 8.8 శాతం, 2015-16లో 11.7 శాతం వృద్ధి రేటు ఉంది. ఈ వృద్ధి రేటు చూసే అప్పులు ఇస్తారు. వృద్ధిరేటు తక్కువగా ఉన్న రాష్ర్టాలకు అప్పులు ఇవ్వరు.

నిధులు తెచ్చాం..నీళ్లు, నియామకాలు రావాలి.. ప్రధానంగా మూడు అంశాలపై రాష్ట్రం కోసం పోరాడాం. నిధులు వచ్చాయి. కోరికలు నెరవేరాయి. నీళ్ళు, నియామకాలు రావాలి. సభలో సభ్యులు కూడా ప్రస్తావించారు. మన రాష్ట్రం మనకు ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయన్నాను. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ఇంకా తేల్చలేదు. ఆరు నెలల గడువు పొడిగించారు. సాగతీత జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఆయా శాఖల్లో విభజన పూర్తి కాలేదు. అది జరగకుండా ఉద్యోగాల భర్తీ చేస్తే తర్వాత సూపర్‌న్యూమరి పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయినా సింగరేణి కాలరీస్‌ను కలుపుకుని 24 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేపో, మాపో నోటిఫికేషన్ ఇస్తున్నాం.

జిల్లాల సంఖ్య పెంచుతాం కొత్త జిల్లాలపైన మన సభ్యులు, మిత్రులు కూడా అడుగుతున్నరు. దానిపైన ఇప్పటికే సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసినం. మొత్తం భారతదేశంలో పశ్చిమబెంగాల్, ఏపీ మాత్రం జిల్లాలను విభజించకోలేదు. ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినపుడు ఏపీ శాసనసభ నియోజకవర్గాలు 225, తెలంగాణలో 153కు పెంచాలనేదానిపై ఏప్రిల్ సమావేశాల్లోనే బిల్లు పెడతామని చెప్పిన్రు. అది పూర్తయితే నియోజకవర్గాల ఏర్పాటుపైన ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతుందో సలహా తీసుకొని, అన్ని బేరీజు వేసుకొని జిల్లాల విభజనపై కసరత్తు చేసుకుందాం. అసెంబ్లీ సమావేశాల్లో మంచి సలహాలు ఇచ్చినవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విమర్శలు చేసిన వారిప్పటికైనా పూర్తిగా తెలుసుకోవాలని మనవి.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. దళితులకు మూడు ఎకరాల భూమి తప్పకుండా అందజేస్తాం. కమతాల ఏకీకరణ జరుగుతున్నది. సీసీఎల్‌ఎ రేమాండ్ పీటర్ దీనిపై బాగా కసరత్తు చేస్తున్నారు. దళితులకు మూడు ఎకరాలు ఒకేచోట భూములు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 వేలకు పైచిలుకు కుటుంబాలకు భూములు అందజేశాం. ఈ భూపంపిణీ ఒక్క టర్మ్‌లోనే పూర్తిచేస్తామని ఎక్కడా చెప్పలేదు.

సాగునీటి ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష -పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందస్తు సన్నద్ధత సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీఇంజినీరింగ్‌పై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న విపక్షాలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ముందస్తుగా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష జరుగనుంది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను ఈ సమీక్షకు సీఎం పిలిచారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.