శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాదీపం వెలిగించారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం రూ.1,200 కోట్లతో ప్రకటించిన దళిత సాధికారత పథకం రాష్ట్ర రాజకీయాలలో నవశకానికి నాంది పలుకుతున్నది.
పాలకులు మారుతూ ఉంటారు. కానీ కొందరు పాలకుల సంస్కరణలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవకు చెందిన వారే ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన పథకాలు, సంస్కరణలు దేశానికే ఆదర్శం. ఇతర రాష్ర్టాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తుంది. ఇప్పుడు మరో చరిత్రాత్మక పథకం, ‘దళిత్ ఎంపవర్‌మెంట్’కు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎస్సీ హాస్టల్‌లో పురుగుల అన్నం, పలుచటి చారు తిని చదువుకున్న నాలాంటి వారికి, హాస్టళ్లు ఇంతగా మారి దళిత బిడ్డలు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం చేస్తూ గొప్ప చదువులు చదువే రోజులు వస్తాయని ఊహకు కూడా అందలేదు. కానీ కేసీఆర్ చేసి చూపించారు. ఈ పథకాన్ని కూడా ఆయన విజయవంతం చేసి తీరుతారు.
ఈ పథకం ద్వారా ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. రూ.12వందల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 11 వేల 900 కుటుంబాలకు సాయం అందుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి రూ.1,190 కోట్లను అందజేయడంతో పాటు నిర్వహణ కోసం రూ.20 కోట్లను వెచ్చిస్తారు. ప్రత్యేక లక్ష్యంతో చేపట్టిన దళిత సాధికారత పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో 12వందల కోట్లు ఇచ్చి, అవసరమైతే మరో రూ.300 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది దళిత ఉపప్రణాళికకు అదనం. భూమి లేని కుటుంబాలకూ బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనున్నది. కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఈ పథకం వల్ల అతడి కుటుంబానికి భద్రత లభిస్తుంది. ఎస్సీలపై హింసకు పాల్పడే పోలీసులను డిస్మిస్ చేయాలన్న సూచనను ఆమోదించారు. భూసేకరణలో, అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల ధరనే ప్రభుత్వం చెల్లించే విధానంలో అమలు కాబోతున్నది.
వ్యాపార నిర్వహణ, పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి సాయం, స్థల కేటాయింపు మొదలైనవాటిని ప్రభుత్వం పరిశీలించనున్నది. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. త్వరలోనే దళిత సాధికారత పథకం మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. రూ.10 లక్షలతో ఏయే యూనిట్లను స్థాపించాలనే సమాచారం బుక్ లెట్ల రూపంలో అందించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో డెయిరీ, ఇతర స్వయం ఉపాధి పథకాలపై మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. యూనిట్లు ప్రారంభించిన తర్వాత వాటిపై పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మండల స్థాయిలో అధికారిని నియమిస్తారు. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి, ప్రతి లబ్ధిదారునికి ప్రత్యేక గుర్తింపు కార్డును అందిస్తారు.
ఇల్లు లేని ఎస్సీలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుపై వ్యూహం ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతులు 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. శతాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు సహకరిస్తాయని ఆశిస్తున్నా.
(వ్యాసకర్త : శ్రీ సుంకె రవిశంకర్, చొప్పదండి శాసనసభ్యులు)